Assembly polls 2023: మహిళల ఖాతాల్లోకి రూ.15,000.. సీఎం ప్రకటన
ABN, First Publish Date - 2023-11-12T14:57:37+05:30
అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 'గృహ లక్ష్మి యోజన' కింద మహిళలకు రూ.15,000 ఆర్థిక సాయం అందిస్తామని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ ప్రకటించారు. మహిళలకు ఇచ్చే సాయం నేరుగా వారి అకౌంట్లలోనే జమ అవుతుందన్నారు.
రాయపూర్: అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ (Congress) పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 'గృహ లక్ష్మి యోజన' కింద మహిళలకు రూ.15,000 ఆర్థిక సాయం అందిస్తామని ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ (Bhupesh Baghel) ప్రకటించారు. మహిళలకు ఇచ్చే సాయం నేరుగా వారి అకౌంట్లలోనే జమ అవుతుందన్నారు. ఈమేరకు ఆదివారంనాడు ఆయన ఒక ట్వీట్ చేశారు.
''దీపావళి శుభ తరుణంలో లక్ష్మీదేవి ఆశీస్సులతో రాష్ట్రంలో మహిళా సాధికారతకు కీలక నిర్ణయం తీసుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఛత్తీస్‌గఢ్ గృహ లక్ష్మి యోజన పథకం కింద ఏటా రూ.15,000 చొప్పున ఆర్థిక సాయం నేరుగా మహిళల అకౌంట్లలో జమ చేయాలని నిర్ణయించాం. ఛత్తీస్‌గఢ్ సుసంపన్నమై, పేదరిక నిర్మూలన జరగాలనే సంకల్పంతో రాబోయే ఐదేళ్లు మా ప్రభుత్వం పని చేస్తుంది. దీపావళి శుభ సందర్భంగా మన తల్లులు, సోదరీమణులు ఆర్థిక స్వావలంబన సాధించాలని కోరుకుంటున్నాను'' అని ఆ ట్వీట్‌లో సీఎం అన్నారు.
క్యూలో నిలబడనవసరం లేదు..
గృహ లక్ష్మి యోజన పథకం కింద మహిళలు ఎలాంటి దరఖాస్తులు పూర్తిచేయాల్సిన అవసరం లేదని, క్యూలలో నిలుచునే పని లేదని సీఎం తెలిపారు. ప్రభుత్వమే స్వయం ఇంటింటికి వచ్చి సర్వే చేస్తుందని, ప్రతిదీ ఆన్‌లైన్‌లోనే పూర్తి చేస్తుందని, నేరుగా అకౌంట్లలోకి సొమ్ములు జమ అవుతాయని బఘెల్ స్పష్టం చేశారు. కాగా, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ నవంబర్ 7న జరుగగా, నవంబర్ 17న రెండో విడత పోలింగ్ ఉంటుంది. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.
Updated Date - 2023-11-12T14:57:39+05:30 IST