Chattisgarh Assembly elctions: 'మోదీ కి గ్యారంటీ' 2023 పేరుతో మేనిఫెస్టో రిలీజ్
ABN, First Publish Date - 2023-11-03T16:58:35+05:30
ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మేనిఫెస్టోను కేంద్ర హోం మంత్రి అమిత్‌షా శుక్రవారంనాడు విడుదల చేశారు. 'మోదీ కి గ్యారెంటీ 2023' పేరుతో రాయపూర్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు.
రాయపూర్: ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల (Chattisgarh Assembly elections) బీజేపీ మేనిఫెస్టోను కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) శుక్రవారంనాడు విడుదల చేశారు. 'మోదీ కి గ్యారెంటీ 2023' పేరుతో రాయపూర్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. రాబోయే ఐదేళ్లలో ఛత్తీస్‌గఢ్‌ను పూర్తి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్దిదిద్దుతామని ఈ సందర్భంగా అమిత్‌షా హామీ ఇచ్చారు. ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం రమణ్ సింగ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
'కృషి ఉన్నతి యోజన' కింద ఎకరాకు 21 క్వింటాళ్ల పంటను సేకరిస్తామని, వివాహిత మహిళందరికీ ఏడాదికి రూ.12,000 చొప్పున ఇవ్వాలని నిర్ణయించామని అమిత్‌షా చెప్పారు. రెండేళ్లలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రధాన మంత్రి యోజన కింద 18 లక్షల ఇళ్లు నిర్మిస్తామని, ట్యాప్‌ల ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన నీళ్లు అందిస్తామని, కౌలు రైతులకు వార్షికంగా రూ.10,000 సాయం అందిస్తామని, కొత్తగా 500 జన్ ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
అవినీతిపరులను జైళ్లకి పంపుతాం..
దీనికి ముందు, పండారియా అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో అమిత్‌షా మాట్లాడుతూ, కాంగ్రెస్ హయాంలో ఉండేవన్నీ కుంభకోణాలేనని, బీజేపీకి అధికారం ఇస్తే అవినీతికి పాల్పడే వాళ్లను జైళ్లకు పంపుతామని అన్నారు. ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ కాంగ్రెస్‌కు 'ప్రీపెయిడ్ సీఎం' అని విమర్శించారు. రాష్ట్ర ఖజానాను కాంగ్రెస్ పార్టీకి ఎటీఎంగా మార్చారని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో మతమార్పిడులు పెరిగిపోతుంటాయని, రాజ్యాంగం ప్రతి మనిషికి తమకు నచ్చిన మతవిశ్వాసాలు పాటించే హక్కు ఇచ్చినప్పటికీ పేద గిరిజనుల మతమార్పిడికి రాష్ట్ర యంత్రాగాన్ని కాంగ్రెస్ వినియోగిస్తోందని ఆరోపించారు. ఫలితంగా రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో, గ్రామంలో ఘర్షణలు తలెత్తుతున్నాయని, శాంతి భద్రతల పరిస్థితి క్షీణిస్తోందని అన్నారు. కాగా, 90 అసెంబ్లీ స్థానాలున్న ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీకి తొలి విడతగా నవంబర్ 7న 20 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగనుంది. తక్కిన 70 నియోజకవర్గాల్లో నవంబర్ 17న తుది విడత పోలింగ్ ఉంటుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడతాయి.
గత ఎన్నికల్లో..
ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 90 సీట్లకు 68 స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. బీజేపీ కేవలం 15 సీట్లకే పరిమితమైంది. మాజీ సీఎం అజిత్ జోగి సారథ్యంలోని జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ (జే) 5 సీట్లు, బీఎస్‌పీ 2 సీట్లు గెలుచుకున్నాయి.
Updated Date - 2023-11-03T16:58:36+05:30 IST