Chief Minister: నన్ను అవమానించాలన్న ధ్యేయంతో కేంద్రం.. అయినా కాంగ్రెస్‌తోనే..
ABN, First Publish Date - 2023-03-02T10:21:35+05:30
రాష్ట్రంలో ఇక డీఎంకేదే శాశ్వత పరిపాలన అని, హామీలన్నింటినీ అమలు చేస్తున్న తమ పార్టీ పట్ల రోజురోజుకు ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని ముఖ్యమంత్రి,
- ఎయిమ్స్ నిర్మాణం లేదు, పథకాలకు నిధుల్లేవు
- లోక్‌సభ ఎన్నికలు కీలకమైనవి
- 40 స్థానాలు మనవే
చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇక డీఎంకేదే శాశ్వత పరిపాలన అని, హామీలన్నింటినీ అమలు చేస్తున్న తమ పార్టీ పట్ల రోజురోజుకు ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్(Stalin) ప్రకటించారు. స్థానిక నందనం వైఎంసీఏ మైదానంలో బుధవారం సాయంత్రం ఏర్పాటైన తన 70వ జన్మదిన వేడుకల సభలో ఆయన ప్రసంగిస్తూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించిన ఐదువందలకు పైగా హామీల్లో 80 శాతం హామీలను రెండేళ్లలో అమలుచేశానని, తక్కిన హామీలను యేడాదిలోపే నెరవేరుస్తానని పేర్కొన్నారు. తాను నెంబర్ సీఎంగా పేరు తెచ్చుకోవటం కంటే రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉందని పేరు సాధిస్తేనే తాను సంతోషిస్తానన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న ద్రావిడ తరహా పాలనను అన్ని రాష్ట్రాలు ఆసక్తిగా గమనిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో నాలుగేళ్ల క్రితం కేంద్రప్రభుత్వం మదురై ఎయిమ్స్(AIIMS Madurai) ఆసుపత్రికి శంకుస్థాపన చేసి, ఆ తరువాత పనులు ప్రారంభించ లేదన్నారు. తద్వారా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను అవమానించిందన్నారు. తమిళభాషాభివృద్ధికి నిధులు విడుదల చేయడం లేదని, జీఎస్టీ బకాయిలను చెల్లించటం లేదని చెబుతూ.. ఇదంతా తనను అవమానపరచాలన్న ధ్యేయంతో కేంద్రం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఆన్‌లైన్ రమ్మీ(Online Rummy) నిషేధ చట్టం తీసుకువస్తే ‘మహాభారతంలో జూదం ఉంది కదా’ అంటూ రాష్ట్ర గవర్నర్ ఆ చట్టానికి అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు.
డీఎంకే శ్రేణులంతా లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం కావాలని, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పుదుచ్చేరి సహా 40 నియోజకవర్గాలలోనూ డీఎంకే కూటమి ఘనవిజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తన జన్మదిన వేడుకలకు జాతీయ స్థాయి నేతలు తరలిరావటం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. తాను దివంగత నేతలు అన్నాదురైలా అనర్గళంగా మాట్లాడలేనని, కలైంజర్ కరుణానిధిలా రచనలు చేయలేనని, అయితే వారిలా ప్రజలకోసం, రాష్ట్ర సంక్షేమం కోసం నిరంతరం పాటుపడటం మాత్రమే తెలుసునని అన్నారు. 70 యేళ్ల వయస్సులో యువకుడిలా కనిపించడానికి కారణంగా నిరంతరం ప్రజా సేవ చేయటమే కారణమన్నారు. 14 యేళ్ళ వయస్సులో గోపాలపురం పార్టీ యువజన శాఖను ప్రారంభించానని, పార్టీ గెలుపుకోసం నాటకాల్లో నటించానని, ఎమర్జెన్సీలో యేడాదిపాటు జైలుకు వెళ్లానని గుర్తు చేసుకున్నారు. ప్రజా జీవితంలో ఇదంతా సహజమని ధైర్యం చెప్పిన తన తండ్రి కరుణానిధి జైలుకు వెళుతుండగా వీడ్కోలు పలికారని స్మరించుకున్నారు. ఈ సమావేశానికి డీఎంకే ప్రధాన కార్యదర్శి మంత్రి దురైమురుగన్ అధ్యక్షత వహించారు. ఎంపీ టీఆర్‌బాలు స్వాగతోపన్యాసం చేశారు. మంత్రి సుబ్రమణ్యం(Minister Subramaniam) వందన సమర్పణ చేశారు. ఈ సమావేశంలో టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి, ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దినేష్ గుండూరావు, ఎండీఎంకే నేత వైగో, సీపీఎం నేత బాలకృష్ణన్, సీపీఐ నేత ముత్తరసన్, ముస్లింలీగ్ నేత ఖాదర్ మొహిద్దీన్, డీపీఐ నేత తిరుమావళవన్, డీఎంకే కూటమి ఎంపీలు, శాసనసభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి: భార్యకు భరణం ఇవ్వాలి.. నా కిడ్నీని కొంటారా?
Updated Date - 2023-03-02T10:21:35+05:30 IST