Chief Minister: సీఎం వ్యంగ్య వినతి.. గవర్నర్‌ను మార్చొద్దు... ప్లీజ్! ఆయనే మా ప్రచార సారథి
ABN, First Publish Date - 2023-10-28T10:50:34+05:30
రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవిని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చవద్దని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) వ్యంగ్యంగా
చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవిని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చవద్దని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) వ్యంగ్యంగా విజ్ఞప్తి చేశారు. కనీసం వచ్చే యేడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల వరకైనా ఆయన్ని బదిలీ చేయరాదని వ్యంగాస్త్రాలు సంధించారు. ఎగ్మూరులోని కల్యాణమండపంలో శుక్రవారం ఉదయం జరిగిన ప్రముఖ న్యాయవాది ఏఎన్ పురుషోత్తం కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొన్న అనంతరం సీఎం ప్రసంగిస్తూ... అన్నాదురై ఆదర్శ వివాహాలకు చట్ట ప్రకారం ఆమోదం కల్పించారని, ప్రస్తుతం డీఎంకే(DMK) ఆధ్వర్యంలో ఇలాంటి ఆదర్శ వివాహాలు జరుగుతున్నాయని, ఇదే ద్రావిడ తరహా పాలనలోని ప్రత్యేకత అని చెప్పారు. ప్రస్తుతం పెద్ద పదవుల్లో ఉన్నవారు ఏవేవో అడుగుతున్నారన్నారు. అసలు ఆ (గవర్నర్) పదవులే వృథా అని, అందులోనూ విశాలమైన భవంతుల్లో కూర్చుని ద్రావిడం అంటే ఏమిటి? అని అదే పనిగా అడుగుతున్నారని, ప్రస్తుతం తన అధ్యక్షతన జరిగే వివాహమే ద్రావిడమని వివరించారు. ద్రావిడమంటే ఏమిటని అడగడం కూడా ద్రావిడమేనని స్టాలిన్ చెప్పారు. ద్రావిడమంటే ఏమిటని అడుగుతున్న ఆయనే (గవర్నర్‌గా) కొనసాగాలని కోరుకుంటున్నామని, అప్పుడే తమ ప్రచారానికి మరింత బలం చేకూర్చుకోగలమని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ఓ విజ్ఞప్తి చేయదలిచానని, దయచేసి ఇక్కడున్న గవర్నర్‌ని ఎప్పటికీ మార్చవద్దని వారి అడుగుతున్నట్లు చెప్పారు. కనీసం లోక్‌సభ ఎన్నికల వరకైనా ఆయనను మార్చకూడదన్నారు. అందువల్ల తమకు కలిగే లాభాలెన్నో ఉన్నాయన్నారు. ఆయన ఇష్టమొచ్చినట్లు ఏవేవో మాట్లాడుతున్నారు... వాటిని ఎవరూ పెద్దగా పట్టించుకోవడమే లేదు... సామాజిక ప్రసార మాధ్యమాల్లోనూ అందరూ ఆయన మాటలను గమనిస్తున్నారు అని స్టాలిన్ చెప్పారు.
ద్రావిడమంటే మరో ఉదాహరణ కూడా చెప్పగలనని, దేశంలో ఏ కార్పొరేషన్ చేయని పనులను జీసీసీ చేసిందన్నారు. తాను మేయర్‌గా ఉన్నప్పుడు నగరంలో కీలకమైన ప్రాంతాల్లో నిర్ణీత సమయానికంటే ముందే ఫ్లైఓవర్లు నిర్మించి ట్రాఫిక్ సమస్యను తగ్గించామని, అయితే జయలలిత అధికారంలోకి రాగానే ఆ వంతెనలు నాణ్యంగా లేవని ఆరోపించి తప్పుడు కేసులు బనాయించి మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని కటకటాలపాలు చేసిందన్నారు. ఆ సమయంలో న్యాయవాది పరంధామన్ హైకోర్టులో దాఖలు చేసిన ప్రజాహిత వాజ్యం వల్లే ఆయన విడుదలయ్యారని స్టాలిన్ గుర్తు చేశారు. కార్పొరేషన్ ప్రజల కోసం భారీ యెత్తున ఫ్లైఓవర్లు నిర్మించవచ్చునని చాటిచెప్పింది డీఎంకే ద్రావిడ సిద్ధాంతమని అన్నారు. ప్రస్తుతం జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ వచ్చే యేడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి ఘనవిజయం సాధిస్తుందని సర్వేలు వెల్లడిస్తున్నాయని, అదే విధంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించినట్లే రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తమ కూటమి గెలుస్తుందన్నారు. తన అధ్యక్షతన జరిగే ఆదర్శ వివాహాల్లో నూతన వధూవరులకు ఇచ్చే సలహా ఒక్కటేనని వారికి జన్మించే పిల్లలకు అందమైన పేర్లు పెట్టాలన్నదే ఆ సలహా అని స్టాలిన్ చెప్పారు. ఈ వివాహ వేడుకల్లో మంత్రి పీకే శేఖర్‌బాబు, ఎంపీ డాక్టర్ కళానిధి వీరాసామి, శాసనసభ్యులు జోసెఫ్ సామువేల్, ఇ. పరంధామన్, తాయగం కవి, సీనియర్ న్యాయవాది విడుదలై, మేయర్ ఆర్ ప్రియ, డిప్యూటీ మేయర్ ఎం.మహే్‌షకుమార్, మాజీ ఎంపీ టీకేఎస్ ఇళంగోవన్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ అధ్యక్షుడు పి. రంగనాథన్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-10-28T10:50:34+05:30 IST