Chief Minister: రాష్ట్రంలో శాంతిభద్రతలపై సీఎం సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారో తెలిస్తే..
ABN, First Publish Date - 2023-07-12T07:34:13+05:30
రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శాంతిభద్రతలు భేషుగ్గా ఉన్నాయని, గత 6 నెలలుగా నేరాల సంఖ్య, ప్రత్యేకించి హ
చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శాంతిభద్రతలు భేషుగ్గా ఉన్నాయని, గత 6 నెలలుగా నేరాల సంఖ్య, ప్రత్యేకించి హత్యలు, మానభంగాలు వంటివి తగ్గుముఖం పట్టాయని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) పేర్కొన్నారు. సచివాలయంలో మంగళవారం ఉదయం శాంతిభద్రతలపై పోలీసు ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శివదాస్ మీనా, డీజీపీగా శంకర్‌జివాల్ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి సమీక్షా సమావేశం ఇదేనని, ఇందులో తీసుకునే నిర్ణయాలు శాంతి భద్రతలు మెరుగు పరిచేందుకు దోహదపడాలన్నారు. ఏ ప్రాంతంలోనైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగితే ఘర్షణలు, అల్లర్లు ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. యేడాదిపాటు తమ జోన్లు, సర్కిళ్లలో శాంతి భద్రతలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలో ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో పోలీసు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న వారికి స్టేషన్‌కు తీసుకెళ్ళి విచారణ జరిపేటప్పుడు చిత్రహింసలు పెట్టరాదని హెచ్చరించారు. ఇకపై రాష్ట్రంలో ఎక్కడా లాక్‌పడెత్‌లు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. మహిళలు, బాలికలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు నిరోధించేందుకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలిచ్చే ఫిర్యాదులను స్వీకరించి వీలైనంత త్వరగా పరిష్కరించాలన్నారు. విల్లుపురం, చెంగల్పట్టు జిల్లాల్లో ఇటీవల కల్తీ సారా రేపిన విషాదం పునరావృత్తం కాకుండా ఎక్సైజు విభాగం పోలీసులు, శాంతిభద్రతల విభాగ పోలీసులు సమన్వయంగా నిరోధక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇక రాష్ట్రాన్ని మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీఎస్, డీజీపీ సహా హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పి.అముదా, గ్రేటర్ చెన్నై పోలీసు కమిషనర్ సందీప్రాయ్ రాథోడ్, ఆయా శాఖలకు చెందిన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-07-12T07:34:14+05:30 IST