Chief Minister: ద్రావిడ పాలనకు విద్య, ఆరోగ్యం రెండు కళ్లు
ABN, First Publish Date - 2023-07-16T07:49:19+05:30
రాష్ట్రంలో తన సారథ్యంలో సాగుతున్న ద్రావిడ పాలనకు విద్య, ఆరోగ్యం రెండు కళ్లు వంటివని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chi
- విద్యార్థుల ఏకైక లక్ష్యం విద్యాభ్యాసమే
- సీఎం స్టాలిన్ పిలుపు
- మదురైలో కలైంజర్ లైబ్రరీ ప్రారంభం
చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో తన సారథ్యంలో సాగుతున్న ద్రావిడ పాలనకు విద్య, ఆరోగ్యం రెండు కళ్లు వంటివని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) పేర్కొన్నారు. చదవడమే విద్యార్థుల ఏకైక లక్ష్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. మదురై నగరానికి మరో మణిహారంలా పుదునత్తం రోడ్డులో నిర్మించిన డాక్టర్ కలైంజర్ కరుణానిధి గ్రంథాలయాన్ని ఆయన శనివారం సాయంత్రం ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో మంత్రులు దురైమురుగన్, ఏ.వీ.వేలు, మూర్తి, ఉదయనిధి, అన్బిల్ మహేశ్, ఎంపీలు టీఆర్ బాలు, ఎ.రాజా, వెంకటేశన్, ప్రత్యేక ఆహ్వానితులుగా హెచ్‌సీఎల్ గ్రూపు ఫౌండర్ శివనాడార్, హెచ్‌సీఎల్ చైర్మన్ రోషిని నాడార్ తదిరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ ప్రసంగిస్తూ... విద్యార్థుల సంక్షేమం కోసం తాము అమలు చేస్తున్న పథకాలు, అనుసరిస్తున్న అనేక విధానాలను దేశంలోని పలు రాష్ట్రాలు అనుసరిస్తున్నాయన్నారు. రాష్ట్ర రాజధాని చెన్నై అయితే, కళల రాజధాని మదురై అని చెప్పారు. అలాంటి మదురైలో గ్రంథాలయాన్ని నిర్మించకుండా మరెక్కడ నిర్మిస్తామని ప్రశ్నించారు. ప్రియతమ నేత కరుణానిధిపై ఉన్న ప్రేమను తెలియజెప్పేలా ఈ లైబ్రరీ ఉందన్నారు. విద్యార్థులు, పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు, ఇతర ప్రతిభావంతులు ఇలా ప్రతి ఒక్కరూ ప్రయోజనం పొందేలా, తమ మేథస్సుకు పదును పెట్టుకునేలా ఇక్కడకు రావాలన్నారు. దివంగత నేత కలైంజర్ రాసిన పుస్తకాలను భద్రపరిచేందుకే ఒక గ్రంథాలయాన్ని నిర్మించవచ్చన్నారు. కవితలు, సంపుటిలు, పిట్టకథలు, నవలలు, నాటకాలు, శాసనసభలో ఆయన చేసిన ప్రసంగాలు, ఆయన రాసిన లేఖలు, పాటలు ఇలా అనేక రకాలైన రచనలు చేశారన్నారు. చెన్నైలో కలైంజర్ పేరుతో అత్యాధునిక సౌకర్యాలో ఆస్పత్రిని, మదురైలో గ్రంథాలయాన్ని నిర్మించినట్టు గుర్తుచేశారు. ‘చెప్పింది చేస్తాం ... చేసేదే చెబుతాం’ అనే నినాదానికి ప్రతీకలే చెన్నై, మదురై(Chennai, Madurai)లో నిర్మించిన ఆస్పత్రి, గ్రంథాలయం అని అన్నారు. డీఎంకే అనేది ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని, విజ్ఞాన కేంద్రమన్నారు. కలైంజర్ గ్రంథాలయ నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. తమిళనాడు ఇప్పటికీ ప్రత్యేక శక్తిగా ఉండటానికి కారణం విద్యార్థులు చేపట్టిన హిందీ వ్యతిరేక పోరాటమేనన్నారు. కామరాజర్ జయంతి వేడుకల రోజును ఎడ్యుకేషన్ డేగా దివంగత కరుణానిధి ప్రకటించారని గుర్తు చేశారు. నాణ్యమైన విద్యా ప్రమాణాలు అందించే రాష్ట్రాల్లో తమిళనాడు దేశంలోనే రెండో స్థానంలో ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత కలైంజర్ చేపట్టిన చర్యల ఫలితంగా రాష్ట్రంలో విద్యా రంగ అభివృద్ధి గణనీయంగా పెరిగిందని సీఎం అన్నారు. అంతకుముందు ఆయన రూ.134 కోట్లతో 2,13,334 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆరు అంతస్తుల్లో నిర్మించిన గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్క అంతస్తులో శీతలీకరణ సౌకర్యం కల్పించారు. బాలబాలికలు, వికలాంగులు, వృద్ధులు ఇలా ప్రతి ఒక్కరికీ అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. ఈ గ్రంథాలయంలో సుమారుగా 4.3 లక్షల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ భవనంలో ఆరు లిఫ్టులు, ఆరు ఎస్కలేటర్లు, 150 వాహనాలకు పార్కింగ్ సదుపాయం వంటి సౌకర్యాలు కల్పించారు. వికలాంగుల విభాగం, ఆడిటోరియం, కల్చరల్ సెంటర్ గ్రౌండ్‌ఫ్లోర్‌లోనే ఉన్నాయి. మొదటి అంతస్తులో మాజీ ముఖ్యమంత్రి దివంగత కరుణానిధి పుస్తకాలు, ఆయన గురించి ఇతరులు చేసిన రచనలను పొందుపరిచారు. ఈ గ్రంథాలయంలో మొత్తం 71 మంది సిబ్బంది వున్నారు.
Updated Date - 2023-07-16T07:49:19+05:30 IST