Chief Minister: ఆ పథకాలు అందరికీ అందాల్సిందే...
ABN, First Publish Date - 2023-08-27T09:01:21+05:30
సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin)
అడయార్(చెన్నై): సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) ఆదేశించారు. అంతేకాకుండా పథకాల పంపిణీలో అలసత్వం వద్దని హితవు పలికారు. డెల్టా జిల్లాల పర్యటన నిమిత్తం వెళ్లిన సీఎం మూడో రోజైన శనివారం నాగపట్టినం జిల్లా కలెక్టరేట్‌లో అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సమావేశంలో మంత్రులు కే.ఎన్.నెహ్రూ, ఏ.వీ.వేలు, ఎస్.రఘుపతి, ఉదయనిధి, అన్బిల్ మహేశ్, టీ.ఆర్.బీ.రాజా, మెయ్యనాథన్, హోం శాఖ కార్యదర్శి అముద, నాలుగు జిల్లాల కలెక్టర్లు జానీటామ్ వర్గీస్ (నాగై), చారుశ్రీ (తిరువారూరు), మహాభారతి (మైలాడుదురై), దీపక్ జాకబ్ (తంజావూరు), ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నాలుగు జిల్లాల్లో చేపట్టిన అన్ని రకాల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. అదేవిధంగా జాలర్లు, వ్యవసాయదారుల సమస్యలతో పాటు ఈశాన్య రుతుపవనాల సమయంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే, ఈ నాలుగు జిల్లాల్లో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, పోలీసులకు ముఖ్యమంత్రి అభినందించి ప్రశంసా పత్రాలను అందజేశారు. అక్కడ నుంచి వేలాంకన్నిలోని ప్రైవేట్ అతిథి గృహానికి చేరుకుని మధ్యాహ్న భోజనం ఆరగించారు. అక్కడ నుంచి తిరువారూరులోని సన్నిధి వీధిలో ఉన్న సొంత నివాసానికి వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు. ఆదివారం తిరుత్తురైపూండిలో జరిగే పార్టీ నేత ఇంటి శుభకార్యంలో పాల్గొంటారు. ఆ తర్వాత రోడ్డు మార్గంలో తిరుచ్చికి చేరుకుని, అక్కడ నుంచి విమానంలో చెన్నైకు చేరుకోనున్నారు.
Updated Date - 2023-08-27T09:01:23+05:30 IST