Chief Minister: ఎలా ఉన్నారు.. మీకేం భయం లేదు.. అండగా ఉంటాం
ABN, First Publish Date - 2023-03-08T10:05:15+05:30
తిరునల్వేలి జిల్లా కావల్‌కినరు వద్ద గ్లోవ్స్ తయారు చేసే ప్రైవేటు కర్మాగారంలో పనిచేస్తున్న ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన కార్మికులను ముఖ్యమంత్రి ఎం
చెన్నై, (ఆంధ్రజ్యోతి): తిరునల్వేలి జిల్లా కావల్‌కినరు వద్ద గ్లోవ్స్ తయారు చేసే ప్రైవేటు కర్మాగారంలో పనిచేస్తున్న ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన కార్మికులను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మంగళవారం ఉదయం కలుసుకున్నారు. నాగర్‌కోవిల్‌లో తన కార్యక్రమాలను ముగించుకుని తూత్తుకుడికి వెళుతూ మార్గమధ్యంలో కావల్‌కినరు వద్ద కానమ్ లేటెక్స్ కర్మాగారంలో ఉత్తరాది కార్మికులు పనిచేస్తున్నారని తెలుసుకుని కాన్వాయ్‌ని ఆకర్మాగారానికి మళ్ళించాలని భద్రతావిభాగం అధికారులను ఆదేశించారు.ఆతర్వాత కర్మాగారంలోకి వెళ్ళిన సీఎం స్టాలిన్(CM Stalin)కు అక్కడి అధికారులు ఘనస్వాగతం పలికారు. ఆ కర్మాగారంలో 450 మంది కార్మికులు పనిచేస్తున్నారని, వారిలో 150 మంది దాకా బిహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్(Bihar, Jharkhand, West Bengal) రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారని అధికారులు తెలిపారు. ఆ ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన కార్మికులలో సుమారు 30 మంది మహిళలని పేర్కొన్నారు. కర్మాగారం అధికారుల వద్ద ఆ వివరాలను తెలుసుకున్న స్టాలిన్ ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన కార్మికులను కలుసుకుని ఎలా వున్నారని ప్రశ్నించారు. కార్మికులు బదులిస్తూ తాము పదేళ్లకు పైగా అక్కడే పనిచేస్తున్నామని, కర్మాగారం యజమానులు తమను కంటికి రెప్పలా కాపాడుతున్నారని, స్థానిక ప్రజల నుండి కూడా తమకెలాంటి సమస్యలు లేవని తెలిపారు. ఆ తర్వాత స్టాలిన్ వారితో మాట్లాడుతూ... ఉత్తరాది కార్మికులపై దాడులు జరుగుతున్నట్లు వెలువడిన వదంతులను నమ్మ వద్దని తెలిపారు. కార్మికులకు సమస్యలేవైనా ఎదురైతే తక్షణమే స్థానిక అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరారు. స్టాలిన్‌తోపాటు మంత్రులు కేఎన్ నెహ్రూ, కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్ మనో తంగరాజన్, కన్నియాకుమారి జిల్లా కలెక్టర్ పీఎన్ శ్రీధర్, కానమ్ లేటెక్స్ కర్మాగారం డైరెక్టర్ ప్రవీణ్ మేథ్యూ తదితరులు పర్యటించారు.
Updated Date - 2023-03-08T10:05:15+05:30 IST