Chief Minister: 40 సీట్లలో గెలిస్తే ప్రధాని ఎంపిక బాధ్యత మనదే
ABN, First Publish Date - 2023-11-28T07:26:21+05:30
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే కూటమి ఘనవిజయం సాధించడం తథ్యమని ఆ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin)
- లోక్‌సభ ఎన్నికల్లో మంచి పేరున్నవారికే సీట్లు
- పొత్తుపై అధిష్ఠానానిదే తుది నిర్ణయం
- జిల్లా నేతల సభలో స్టాలిన్
చెన్నై, (ఆంధ్రజ్యోతి): రానున్న లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే కూటమి ఘనవిజయం సాధించడం తథ్యమని ఆ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) ధీమా వ్యక్తం చేశారు. పుదుచ్చేరి సహా 40 నియోజకవర్గాలలో గెలిస్తే కాబోయే ప్రధాని అభ్యర్థిని డీఎంకే ఎంపిక చేస్తుందని చెప్పారు. ఆదివారం టి.నగర్ జీఎన్‌చెట్టి రోడ్డులోని స్టార్ హోటల్‌లో డీఎంకే(DMK) జిల్లా శాఖ కార్యదర్శుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డీఎంకే ప్రధాన కార్యదర్శి దురైమురుగన్, కోశాధికారి టీఆర్ బాలు, డిప్యూటీ కార్యదర్శి కేఎన్ నెహ్రూ, మహిళా విభాగం నాయకురాలు, ఎంపీ కనిమొళి(MP Kanimozhi), వ్యవస్థాపక కార్యదర్శి ఆర్‌ఎస్ భారతితోపాటు పార్టీకి చెందిన 70 జిల్లాశాఖల కార్యదర్శులు హాజరయ్యారు. ఈ సమావేశంలో డిసెంబర్ 17న సేలంలో జరగనున్న యువజన మహానాడు ఏర్పాట్లపై సమీక్ష్చిఆరు. ఆ మహానాడుకు కనీ సం ఐదు లక్షలమందిని తరలించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సమావేశానికి అధ్యక్షత వహించిన స్టాలిన్ ప్రసంగిస్తూ లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని పార్టీ శ్రేణులు ప్రారంభించాలని, గత మూడేళ్లలో డీఎంకే ప్రభు త్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీలతో పొత్తులు కుదుర్చుకోవడం, మిత్రపక్షాలకు సీట్ల కేటాయింపులు తదితర కీలకమైన అంశాలపై అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. గృహిణులకు కలైంజర్ సాధికారిక నగదు పంపిణీ పథకం, సిటీ, టౌన్ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం, ప్రభుత్వ పాఠశాల్లో ప్లస్-2 దాకా చదివిన విద్యార్థినులకు ఉన్నత విద్యనభ్యసించేందుకు ప్రతినెలా రూ.1000 చెల్లించే పథకం వంటి వాటి వల్ల ఇకపై మహిళలందరూ డీఎంకేకు మద్దతుగా వ్యవహరించి, పార్టీని గెలిపిస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు. యువజన మహానాడుకు ప్రతి జిల్లా నుంచి కనీసం వెయ్యిమంది హాజరయ్యేలా జిల్లా నేతలు చర్యలు చేపట్టాలన్నారు. 25 లక్షల మంది సభ్యులున్న డీఎంకే యువజన విభాగం యువకుల ఓట్ల సమీకరణపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. కొత్త ఓటర్లను జాబితాలో నమోదు చేయించేందుకు కూడా చర్యలు తీసుకోవాలన్నారు.
పేరున్నవారికే టిక్కెట్లు...
లోక్‌సభ ఎన్నికల్లో ప్రజల మధ్య మంచి పేరు కలిగినవారికే పార్టీ టిక్కెట్లు ఇస్తామని, ఈ విషయంలో అధిష్టానవర్గం ఈసారి ఖచ్చితంగా వ్యవహరిస్తుందని స్టాలిన్ అన్నారు. మునుపటిలా స్థానికులకే కాకుండా పొరుగు ప్రాంతాలకు చెందినవారిని కూడా అభ్యర్థులుగా ఎంపికే చేసే అవకాశం ఉందని చెప్పారు. పార్టీ శ్రేణులు అభ్యర్థులను ప్రతిపాదిస్తే పరిశీలించి ఆచితూచి వ్యహరించి ఎంపిక చేస్తామన్నారు.
నీట్ మినహాయింపు సాధించి తీరుతాం
- డాక్టర్ల సదస్సులో స్టాలిన్
ఎవరెంతగా వ్యతిరేకించినా అడ్డుకట్ట వేసినా నీట్ మినహాయింపును సాధించి తీరుతామని సీఎం స్టాలిన్ శపథం చేశారు. చేపాక్ కలైవానర్ అరంగంలో ఆదివారం ఉదయం ఏర్పాటైన సామాజిక సమానత్వాన్ని చాటే వైద్యుల సంఘం నాలుగో మహానాడును ఉద్దేశించి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వం వైద్య, విద్య రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. వైద్యరంగంలో చికిత్సలకు సంబంధించి జరుగుతున్న విప్లవాత్మకమైన మార్పులను ఎప్పటికప్పుడు గుర్తించి అందుకు తగినట్లుగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల స్థాయిని అంతర్జాతీయ ప్రమాణాలతో నడుపుతున్నామన్నారు. నవీన వైద్య చికిత్స పరికరాలను కూడా సమకూర్చుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో పురోగమిస్తున్న వైద్య సదుపాయాలకు గండికొట్టేలా కేంద్రం నీట్‌ను అమలు చేసి పేద విద్యార్థులకు వైద్య కోర్సులను దూరం చేసిందన్నారు. నీట్ భయంతో అనిత అనే విద్యార్థి నుంచి తాజాగా జగదీశ్వరన్ అనే విద్యార్థి వరకు ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే డీఎంకే యువజన విభాగం, విద్యార్థుల విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ప్రారంభించిన సంతకాల సేకర ణ ప్రస్తుతం ఉద్యమస్థాయికి చేరిందన్నారు. అదే విధంగా నెక్స్‌ట్ పరీక్షల నుంచి మినహాయింపును సాధించట మే తమ ప్రభుత్వ ప్రధాన ఆశయమని పేర్కొన్నారు. పస్తుతం ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యను మళ్లీ రాష్ట్ర జాబితాలోకి తీసుకువచ్చేందుకు న్యాయపోరాటం సాగిస్తామని స్టాలిన్ ప్రకటించారు.
Updated Date - 2023-11-28T07:26:22+05:30 IST