Chief Minister: రండీ.. లోక్‌సభ ఎన్నికల్లో మన సత్తా చూపుదాం
ABN, First Publish Date - 2023-06-08T09:28:57+05:30
వచ్చే యేడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికలకు దేశంలోని జాతీయ, ప్రాంతీయ పార్టీలన్నీ ఐకమత్యంతో సిద్ధం కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే
- ప్రతిపక్షాలకు స్టాలిన్ పిలుపు
చెన్నై, (ఆంధ్రజ్యోతి): వచ్చే యేడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికలకు దేశంలోని జాతీయ, ప్రాంతీయ పార్టీలన్నీ ఐకమత్యంతో సిద్ధం కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) పిలుపునిచ్చారు. స్థానిక పెరంబూరు బిన్నీ మిల్లు మైదానంలో డీఎంకే ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత కరుణానిధి శతజయంతి ఉత్సవం జరిగింది. బుధవారం రాత్రి పార్టీ ప్రధాన కార్యదర్శి దురైమురుగన్(Duraimurugan) అధ్యక్షతన ఏర్పాటైన బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తూ... వచ్చే లోక్‌సభ ఎన్నికలు అత్యంత కీలకమైనవని, ఎవరు అధికారంలోకి రాకూడదో తేల్చే వని పేర్కొన్నారు. అందుకే బీజేపీ కుట్రలు, కుతంత్రాలకు దూరంగా ఉండి సత్తా చాటాల్సిన ఆవశ్యకత ఆసన్నమైందన్నారు. ఇక ఈ వేడుకలకు కారులో వస్తున్న సమయంలో బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఫోన్ చేసి ఈ నెల 23న జరుగనున్న ప్రతిపక్ష నేతల సమావేశానికి తప్పకుండా రావాలంటూ ఆహ్వానించారని తెలిపారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్షాల్లో చీలికలు తెచ్చేందుకు బీజేపీ నాయకులు కుతంత్రాలు, కుయుక్తులు పన్నే అవకాశం ఉందని, ఆ విషయాన్ని గుర్తుంచుకుని జాతీయ పార్టీల నాయకులు, ప్రాంతీయ పార్టీల నాయకులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. తమ మధ్య అభిప్రాయబేధాలను పక్కనపెట్టి ఐకమత్యంతో లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం కావాలని కోరారు. దేశంలో జాతి, కులాల పేరుతో చిచ్చు రగిలిస్తున్న బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు. బీజేపీ సిద్ధాంతాలను ఆచరించేలా రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్.రవి పనితీరు ఉందని, ఈ విషయంలో తాను ఆయనకు వ్యతిరేకంగా పోరాడుదాం రమ్మంటూ రాష్ట్ర ప్రజలను ఉసిగొల్పదలచుకోలేదని అన్నారు.
ద్రావిడం అంటే ఎందుకింత మంట?
రాష్ట్రంలో ద్రావిడం, ద్రావిడ తరహా పాలన అంటేనే కొందరికి మంటపుడుతోందని, ఆ పాలనకు అర్థం తెలియనివారే పనిగట్టుకుని ద్రావిడ సిద్ధాంత కాలం చెల్లిందంటూ విమర్శలు చేస్తున్నారని గవర్నర్‌పై సీఎం పరోక్ష విమర్శలు గుప్పించారు. అందరికీ అన్ని సదుపాయాలు కల్పించడమే ద్రావిడ తరహా పాలన లక్ష్యమన్నారు. 95 యేళ్లపాటు సంపూర్ణ జీవితాన్ని గడిపిన కరుణానిధి రాష్ట్ర ప్రజానీకానికి, తమిళ సమాజానికి అందించిన సేవలను ప్రజలంతా గుర్తుంచుకోవాలన్నారు. ఈ శతజయంతి వేడుకలను ఈ నెల 3న జరపాలని నిర్ణయించి భారీ ఏర్పాట్లు కూడా చేపట్టామని, అయితే ఒడిశా రైలు ప్రమాదం కారణంగా వాయిదా వేశామని, మానవతా దృక్పథంతో తాను తీసుకున్న నిర్ణయాన్ని కరుణానిధి జీవించి ఉంటే మెచ్చుకునే వారన్నారు. మరో ఐదేళ్లపాటు జీవించి ఉంటే కరుణానిధి ఈ వేడుకల వేదికపై ప్రధాన ఆకర్షణగా ఆశీనులై ఉండేవారని చెప్పారు. కరుణ మృతి చెందినట్లు తాను భావించడం లేదని, తమ పారిపాలనపై ఎవరికీ కనబడని రీతిలో నిఘా వేస్తున్నారనే భావిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. పెరియార్, అన్నాదురై, కరుణానిధి అడుగుజాడల్లో నడుస్తున్న తమ పార్టీ వచ్చే యేడాది జూన్ 3వ తేదీ వరకు శతజయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా జరపనుందని వివరించారు. 75 యేళ్ల క్రితం డీఎంకే ఆవిర్భావం జరిగిన ఉత్తర చెన్నైలోనే కరుణ శతజయంతి వేడుకల ప్రారంభ సభ జరపడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. కన్నియాకుమారి నుంచి గుమ్మిడిపూండి వరకూ కరుణానిధి పాదం మోపని ప్రాంతమంటూ ఏదీ లేదని, ప్రజలతో మమేకమై వారికి అన్ని సదుపాయాలను కల్పించడమే జీవితాశయంగా పెట్టుకున్నారని చెప్పారు. ఈ శతజయంతి వేడుకల్లోనే లోక్‌సభ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనబోతున్నామని, మతతత్వ శక్తులను తరిమికొట్టనున్నామని చెప్పారు. ముందుగా ఈ సభలో ‘అప్పా ఎండ్రు అళైక్కట్టుమా తలైవరే’ (నాన్నా అని పిలువమంటారా నాయకుడా) అనే పేరిట స్టాలిన్ ప్రసంగాలతో కూడిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సభలో మంత్రి పీకే శేఖర్‌బాబు స్వాగతోపన్యాసం చేశారు. టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి, ఎండీఎకే నేత వైగో, ద్రవిడకళగం నేత కే వీరమణి, సీపీఎం నాయకుడు కే.బాలకృష్ణన్, సీపీఐ నాయకుడు ముత్తరసన్, ఇండియన్ ముస్లింలీగ్ నాయకుడు కేఎం ఖాదర్ మొయిద్దీన్, డీపీఐ నేత తిరుమావళవన్, మనిదనేయ మక్కల్ కట్చి నాయకుడు జవాహిరుల్లా, తమిళగవాళ్వురిమై కట్చి నాయకుడు వేల్‌మురుగన్, కొంగునాడు మక్కల్ దేశీయకట్చి నాయకుడు ఈశ్వరన్ తదితరులు ప్రసంగిస్తూ కరుణానిధి రాష్ట్రాభివృద్ధికి, బలహీనవర్గాలు, మైనార్టీల సంక్షేమం కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఆయన సేవలను కొనియాడారు. ఖాదర్‌మొయిద్దీన్, కేఎస్ అళగిరి తమ ప్రసంగంలో మద్రాసు విశ్వ విద్యాలయం పేరును కలైంజర్ విశ్వవిద్యాలయంగా మార్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశం మూడు గంటలకు పైగా కొనసాగింది. ఎంపీలు టీఆర్‌బాలు, కనిమొళి, దయానిధి మారన్, ఎ.రాజాతదితరులు కూడా సమావేశానికి హాజరయ్యారు.
Updated Date - 2023-06-08T09:28:57+05:30 IST