Chief Minister: ‘జమిలి’ పై నిలదీయండి.. కూటమి పార్టీలకు అనుగుణంగా మసలుకోండి
ABN, First Publish Date - 2023-09-17T09:17:29+05:30
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు డీఎంకే ఎంపీలు క్రమం తప్పకుండా హాజరు కావాలని, ప్రత్యేకించి బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చే ‘ఒకే దేశం...
- రోజూ సభకు హాజరు తప్పనిసరి
- డీఎంకే ఎంపీలకు స్టాలిన్ దిశానిర్దేశం
చెన్నై, (ఆంధ్రజ్యోతి): పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు డీఎంకే ఎంపీలు క్రమం తప్పకుండా హాజరు కావాలని, ప్రత్యేకించి బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చే ‘ఒకే దేశం... ఒకే ఎన్నికలు’ ప్రతిపాదనను వ్యతిరేకించాలని ఆ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) ఆదేశించారు. స్థానిక తేనాంపేటలోని డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో శనివారం ఉదయం ఆ పార్టీ ఎంపీల సమావేశం స్టాలిన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో లోక్‌సభ, రాజ్యసభ సమావేశాల్లో పార్టీ ఎంపీలు అనుసరించాల్సిన తీరుపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ... రాజ్యసభలో బీజేపీకి తగిన మద్దతు లేదు కనుక జమిలీ ఎన్నికల ప్రతిపాదనను అక్కడే డీఎంకే ఎంపీలు, ‘ఇండియా’ కూటమి ఎంపీలు కలిసికట్టుగా వీగిపోయేలా చూడాలని సూచించారు. అదే విధంగా బీజేపీ తీసుకొచ్చిన నీట్ కారణంగా రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలు అధికమైన విషయాన్ని పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లాలన్నారు. అలాగే నీట్ నుంచి రాష్ట్రాన్ని మినహాయించే బిల్లును రాష్ట్రపతి త్వరలో ఆమోదించేలా బీజేపీ పాలకులపై ఒత్తిడి చేయాలని దిశానిర్దేశం చేశారు. ఇదేవిధంగా లోక్‌సభలో, శాసనసభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే దిశగా ప్రతిపాదించిన బిల్లును ఆమోదించాలని ఈ సమావేశాల్లో బీజేపీ పాలకులపై ఒత్తిడి చేయాలని కూడా పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగావకాశాల్లో మండల్ కమిషన్ సిఫారసులకు అనుగుణంగా రిజర్వేషన్లు పాటించాలని, బీసీలకున్న క్రిమీలేయర్‌ను రూ.25లక్షలుగా పెంచాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకంలో సామాజిక న్యాయాన్ని పాటించాలని, రిజర్వేషన్లలో 50 శాతం గరిష్ఠ పరిమితిని ఎత్తివేయాలని కూడా కేంద్రాన్ని కోరాలన్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం కులవృత్తిని ప్రోత్సహించేందుకంటే ప్రవేశపెట్టిన ‘విశ్వకర్మ యోజన’ పథకం లోపాలను సభలో ఎలుగెత్తి చాటాలని, ప్రత్యేకించి 18 యేళ్లలోపువారిని కళాశాల చదువులకు వెళ్లకుండా కులవృత్తి వైపు ప్రేరిపించేలా ఆ పథకం ఉందన్న సంగతిని సభకు స్పష్టం చేయాలని ఆదేశించారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఈనెల 18 నుంచి 22 దాకా కొత్త పార్లమెంట్ భవనసముదాయంలో జరుగనున్న విషయం తెలిసిందే. ఇదిలా వుండగా శనివారం జరిగిన ఈ ఎంపీల సమావేశంలో కలైంజర్ మహిళా సాధికారిక పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేశారు. కావేరి నిర్వాహక మండలి, సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం కావేరి జలాలను విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరుతూ మరొక తీర్మానం చేశారు. మదురై ఎయిమ్స్ ఆసుపత్రి నిర్మాణ పనులకు, నగరంలో రెండో విడత మెట్రో రైలు ప్రాజెక్టు పనులకు వెంటనే నిధులు కేటాయించాలని కేంద్రప్రభుత్వాన్ని కోరుతూ మరొక తీర్మానం చేశారు. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ తదితరులు పాల్గొన్నారు.
కావేరి జలాల కోసం...
కావేరి నదీ జలాల కోసం సుప్రీంకోర్టు, కావేరి నిర్వాహక మండలి ద్వారా చేస్తున్న ప్రయత్నాలు జాప్యమవుతుండటంతో డీఎంకే ఎంపీల బృందం కేంద్ర జలశక్తి మంత్రిని కలుసుకుని వినతిపత్రం సమర్పించనున్నట్లు సీఎం స్టాలిన్ ప్రకటనను జారీ చేశారు. ఓ వైపు కావేరి నిర్వాహక మండలి ఆదేశాలను, మరో వైపు సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను భేఖాతరు చేసి కర్ణాటక ప్రభుత్వం డెల్టా రైతులకు కావేరి జలాలను విడుదల చేయక మొండి వైఖరిని ప్రదర్శిస్తోందన్నారు. ఈ పరిస్థితుల్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానుండడంతో ఆ సందర్భంగా కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను రాష్ట్ర నీటి వనరుల శాఖ మంత్రి దురైమురుగన్ నాయకత్వంలో డీఎంకే ఎంపీల బృందం కలుసుకుని వినతిపత్రం సమర్పించనున్నదని స్టాలిన్ వివరించారు.
Updated Date - 2023-09-17T09:17:29+05:30 IST