CM Bommai: యడియూరప్ప ఇంటిపై దాడి వెనుక కాంగ్రెస్ కుట్ర!
ABN, First Publish Date - 2023-03-28T18:52:38+05:30
కర్ణాటకలో ఎస్సీల రిజర్వేషన్ అంశంపై చిచ్చురేగడం, బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప..
బెంగళూరు: కర్ణాటకలో (Karnataka) ఎస్సీల రిజర్వేషన్ (SCs Reservation) అంశంపై చిచ్చురేగడం, బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప (BS Yediyurappa) నివాసంపై పలువురు బంజారా ప్రజలు రాళ్లతో దాడికి దిగడం వెనుక కాంగ్రెస్ హస్తం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై (Basavaraj Bommai) అన్నారు. కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌పై ఆయన విరుచుకుపడ్డారు. యడియూరప్ప ఇంటిపై దాడి ఘటనకు ముందు రోజు కర్ణాటక కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారని, వారంతా బీజేపీకి వ్యతిరేకంగా బంజారా వర్గాన్ని తప్పుదారి పట్టిస్తూ రెచ్చగొట్టారని ఆయన ఆరోపించారు.
శివకుమార్ ఆరోపణలు అవాస్తవం..
బీజేపీలో అంతర్గత పోరే యడియూరప్ప నివాసంపై దాడికి కారణమంటూ డీకే శివకుమార్ చేసిన ఆరోపణలను సీఎం బొమ్మై కొట్టివేశారు. ''శివకుమార్ ఏమి మాట్లాడుతున్నారు? అరెస్టయిన వాళ్లంతా కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్లే. దీనికి ఆయన ఏమి సమాధానం చెబుతారు?'' అని సీఎం నిలదీశారు. నిజానికి బంజారా కమ్యూనిటీ ప్రజలకు ఏమీ తెలియదని, వారిని కాంగ్రెస్ తప్పుదారి పట్టించిందని ఆరోపించారు. బంజారా నిరసనలకు ముందు రోజే కాంగ్రెస్ పార్టీ నేతలు సమావేశమయ్యారని, ఆ వర్గాన్ని తప్పుదారి పట్టించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా నిరసనలు చేపట్టిందని, వీటన్నింటికీ ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడైనా డీకే అబద్ధాలు చెప్పడం మానుకోవాలని అన్నారు.
ఎస్సీల రిజర్వేషన్‌పై కర్ణాటక ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా బంజారా, కొరచి, బొవి, కుర్మి కమ్యూనిటీకి చెందిన ప్రజలు యడియూరప్ప నివాసం ముందు సోమవారంనాడు ఆందోళనకు దిగారు. రాళ్లురువ్వడంతో పోలీసులు లాఠీచార్జి జరిపారు. దీంతో పలువురిని పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. బీజేపీలో అంతర్గత పోరే ఈ ఘటనకు కారణమని కాంగ్రెస్ ఆరోపించగా, ప్రతి కులానికి సామాజిక న్యాయం జరగడం ఇష్టంలేకనే కాంగ్రెస్ నేతలు ప్రజలను రెచ్చగొడుతున్నారని ముఖ్యమంత్రి ఆరోపించారు.
Updated Date - 2023-03-28T18:55:51+05:30 IST