ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CM Stalin: రోజుకో సభ, పూటకో విమర్శ.. రాజకీయనేతలా గవర్నర్‌

ABN, First Publish Date - 2023-04-11T10:38:58+05:30

తన ప్రభుత్వంపై ఇబ్బడిముబ్బడిగా విమర్శలు చేయడంతో పాటు 14 కీలకమైన బిల్లుల్ని పెండింగ్‌లో పెట్టిన రాష్ట్ర గవర్నర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

- నిప్పులు చెరిగిన సీఎం

చెన్నై, (ఆంధ్రజ్యోతి): తన ప్రభుత్వంపై ఇబ్బడిముబ్బడిగా విమర్శలు చేయడంతో పాటు 14 కీలకమైన బిల్లుల్ని పెండింగ్‌లో పెట్టిన రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(Governor RN Ravi)పై రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(MK Stalin) ఎదురుదాడికి దిగారు. గవర్నర్‌ వైఖరికి ముకుతాడు వేసేలా శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. శాసనసభలో చేసిన బిల్లుల్ని గవర్నర్‌ ఆమోదించేలా, రాజ్యాగ ధర్మాసనం కల్పించిన విధుల ప్రకారం ఆయన బాధ్యతలు నిర్వర్తించేలా సలహా ఇవ్వాలని, బిల్లుల్ని ఆమోదించేందుకు నిర్ణీత గడువును విధించాలని కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రపతికి విజ్ఞప్తి చేస్తూ సోమవారం ఉదయం శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin).. గవర్నర్‌ వైఖరిపై నిప్పులు చెరిగారు. ‘‘ఈ యేడాది గవర్నర్‌ ప్రసంగంతో ప్రారంభమైన వార్షిక బడ్జెట్‌ శాసనసభ సమావేశాలు ముగియక ముందే రెండోసారి గవర్నర్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి ఏర్పడటానికి రాష్ట్ర ప్రభుత్వం కారణం కాదు. గవర్నర్‌ రాజ్యాగ ధర్మాసనం ప్రకారం విధులు నిర్వర్తించకుండా రాజకీయ ధోరణితో వ్యవహరిస్తుండటం వల్లే రెండోసారి సభలో తాను తీర్మానాన్ని ప్రతిపాదించాల్సి వచ్చింది’’ అని అన్నారు. దేశంలో ఫెడరల్‌ రాజ్యాంగ విధానాన్నే కోరుకుంటున్నానని, అదే సమయంలో రాష్ట్రాలు స్వయం సమృద్ధిని కలిగి ఉండాలని ఢిల్లీలో డీఎంకే(DMK) వ్యవస్థాపకుడు అన్నాదురై చేసిన ప్రకటనను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నానని అన్నారు. ‘మేకకు గడ్డం ఎందుకు? రాష్ట్రాలకు గవర్నర్‌ పదవులెందుకు’ అంటూ అన్నాదురై చేసిన వ్యాఖ్యల్ని ఉటంకించారు. అయినా ప్రస్తుత డీఎంకే(DMK) ప్రభుత్వం గవర్నర్‌కు తగిన గౌరవ మర్యాదలు ఇస్తోందన్నారు.

‘‘1969లో కరుణానిధి ఏర్పాటు చేసిన హనుమంతయ్య సంస్కరణల కమిటీ పార్టీలకు అతీతంగా ఏకపక్షంగా వ్యవహరించని విశ్వాసపాత్రుడైన వ్యక్తులను గవర్నర్లుగా నియమించాలని సిఫారసు చేసింది. అదే విధంగా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని రాజమన్నార్‌ కమిటీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలను గురించిన నివేదికలో గవర్నర్‌ వ్యవస్థను రద్దు చేసేందుకే ఇదే మంచి తరుణం’ అని సిఫారసు చేసింది. ఆ సిఫారసులపై ఇదే శాసనసభలో ఐదు రోజులపాటు చర్చించి, రాష్ట్ర స్వయంపాలన తీర్మానం ఆమోదించి కేంద్రప్రభుత్వానికి కూడా పంపించారు. సర్కారియా కమిషన్‌ కూడా గవర్నర్లు నిష్పక్షపాత ధోరణిని అవలంబించే వ్యక్తులై ఉండాలని పేర్కొంది. మాజీ ప్రధాని వాజ్‏పేయి ప్రభుత్వ హయాంలో (2000 సంవత్సరం) నియమించిన సుప్రీం మాజీ న్యాయమూర్తి వెంకటాచలయ్య కమిటీ కూడా ఇదే అభిప్రాయాన్నే వ్యక్తం చేసింది. అంతేకాకుండా రాష్ట్రపతిని తొలగించేందుకు పార్లమెంట్‌కు ఇంపీచ్‌మెంట్‌ అధికారం ఉన్నట్లే గవర్నర్లను తొలగించేందుకు శాసనసభలకు అధికారం కల్పించాలని అప్పట్లో అభిప్రాయాలు వెల్లడయ్యాయి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేడ్కర్‌ కూడా గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలలో జోక్యం చేసుకోకూడదని నొక్కివక్కాణించారు. 2010లో పీపీ సింఘాల్‌ కేసులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్‌ నాయకత్వంలో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాగం ధర్మాసనం కూడా గవర్నర్‌గా నియమితులైన వ్యక్తి రాజ్యాంగ విధులను సక్రమంగా నిర్వర్తించాలే తప్ప రాజకీయ పార్టీలకు విధేయుడై మసలుకోకూడదని స్పష్టం చేసింది. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర ప్రజలకు గవర్నర్లు మార్గదర్శకులు, సన్నిహితులుగా ప్రవర్తించాలంటూ ఎంతోమంది న్యాయమూర్తులు పలు తీర్పుల్లో సుస్పష్టంగా ప్రకటించారు’’ అని సీఎం గుర్తు చేశారు. అయితే ప్రస్తుత గవర్నర్‌ పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు సన్నిహితంగా మసలుకోవడం లేదని, ఆయన అనుసరిస్తున్న విధానాలను బట్టి, చేపడుతున్న చర్యలను బట్టి స్పష్టమవుతోందని ఆరోపించారు. పాలనాపరమైన అంశాలపై పాలకులతో మాట్లాడాల్సిన గవర్నర్‌.. బహిరంగ సభల్లో ప్రజా వేదికలపై బహిరంగంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.

ప్రజా సంక్షేమం కోసం సభలో ఆమోదించిన బిల్లుల్ని కించిపరిచేలా ప్రభుత్వ విధానాలకు, ప్రజాభిప్రాయాలకు, శాసనసభ సౌర్వభౌమత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గవర్నర్‌ తన పదవిని మరచి రాజకీయ నాయకుడిలా వ్యవహరిస్తున్నారన్నారు. గవర్నర్‌ పదవి నియమనిబంధనలన్నింటిని విడిచిపెట్టి, బహిరంగ వేదికలపై ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారన్నారు. ప్రత్యేకించి ప్రధాని రాష్ట్ర పర్యటనకు విచ్చేస్తున్నప్పుడు, తాను ప్రధానిని కలుసుకునేందుకు ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడమే గవర్నర్‌ ఆనవాయితీగా పెట్టుకున్నారని ఆరోపించారు. ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధచట్టానికి సంబంధించిన బిల్లును రెండోసారి సభలో ఆమోదించి పంపినా గవర్నర్‌ పట్టించుకోకుండా, నిరంకుశ దోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. దీంతో అమాయకులు ఆ జూదానికి బలవుతున్నారని స్టాలిన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. వీటన్నింటికి తోడు శాసనసభ, ప్రభుత్వం చేసిన బిల్లును తాను పెండింగ్‌లో ఉంచితే వాటికి తన ఆమోదం లేనట్లేనని భావించాలంటూ గవర్నర్‌ వక్రభాష్యాలు చెప్పడం రాజ్యాంగ ధర్మాసనానికి వ్యతిరేకమన్నారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులతో కూడిన శాసనసభలో ఆమోదించే బిల్లులను.. నియామక పదవిలో ఉన్న గవర్నర్‌ సంతకం చేసి ఆమోదించే పద్ధతికి వ్యతిరేకంగా రాజ్యాంగ ధర్మాసనాన్ని సవరించేందుకు తగు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని స్టాలిన్‌ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత గవర్నర్‌కు రాజ్యాంగ ధర్మాసనం విధులు తెలియవని చెప్పడం లేదని, అయితే ఆయనకు రాజ్యాంగంపై ఉండాల్సిన విశ్వాసం కాస్తా రాజకీయ విశ్వాసంగా మారిందన్నారు. సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులను అతిక్రమించి, మంత్రివర్గం తీసుకునే విధానపరమైన నిర్ణయాలను విమర్శిస్తూ బహిరంగ సభల్లో మాట్లాడుతున్నారని, మతసామరస్యతకు వ్యతిరేకంగా గవర్నర్‌ వ్యవహరిస్తున్నారని స్టాలిన్‌ ఘాటుగా విమర్శించారు. ప్రజా సంక్షేమానికి అడ్డుగా నిలిచిన గవర్నర్‌.. శాసనసభనే అవమానిస్తున్నారని, ‘రోజుకొక సభ పూటకొక విమర్శ’ అనే తరహాలో రాజ్‌భవన్‌ను రాజకీయ భవన్‌గా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వర్గానికి చెందినవారికి గవర్నర్‌ బాకా ఊదుతున్నారని చెప్పారు. సభలో తాను గవర్నర్‌కు వ్యతిరేకంగా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నట్లు భావించరాదని, ఉన్నతమైన పదవిలో ఉంటూ గవర్నర్‌ తన విధుల ప్రకారం ప్రవర్తించడం లేదని సభకు తెలియజెప్పడమే తన ఉద్దేశమన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి చట్టాన్ని ఆగమేఘాలపై చేయడం లేదని, ఆచితూచి న్యాయనిపుణుల సలహాలు తీసుకుని, సమగ్రంగా చర్చించిన మీదటే ప్రజలకు అవసరమైన చట్టాలను రూపొందిస్తోందని సీఎం పేర్కొన్నారు. ప్రస్తుతం తాము ప్రవేశపెట్టిన తీర్మానానికి అందరూ మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలా వుండగా ఈ తీర్మానాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా కేంద్రప్రభుత్వానికి పంపనున్నట్లు అసెంబ్లీ వర్గాలు తెలిపాయి.

Updated Date - 2023-04-11T10:38:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising