CM Stalin: సీఎం స్టాలిన్ సంచలన కామెంట్స్... ఆ తగ్గింపు ఎన్నికల సమీపానికి సంకేతం
ABN, First Publish Date - 2023-08-31T08:03:04+05:30
వంటగ్యాస్ సిలిండర్‌పై కేంద్రప్రభుత్వం రూ.200 ధర తగ్గించడం పార్లమెంటు ఎన్నికలు సమీపించాయనడానికి సంకేతంలాంటివని
చెన్నై, (ఆంధ్రజ్యోతి): వంటగ్యాస్ సిలిండర్‌పై కేంద్రప్రభుత్వం రూ.200 ధర తగ్గించడం పార్లమెంటు ఎన్నికలు సమీపించాయనడానికి సంకేతంలాంటివని ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) వ్యాఖ్యానించారు. బుధవారం తన నియోజకవర్గమైన కొళత్తూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. మునుముందు కేంద్రప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరల్ని తగ్గించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదని ఎద్దేవా చేశారు. ప్రస్తు తం 28 పార్టీలతో పటిష్ఠంగా వున్న ‘ఇండియా’ కూటమి మరింత బలోపేతమవుతుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కేవలం పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే గ్యాస్ సిలిండర్ ధర తగ్గించారని స్టాలిన్ పునరుద్ఘాటించారు.
కొళత్తూరులో అభివృద్ధి కార్యక్రమాలు
స్థానిక కొళత్తూర్ నియోజకవర్గం సహా పలు ప్రాంతాల్లో జరుగుతున్న వర్షపు కాలువల నిర్మాణ పనులను బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister Stalin) పరిశీలించారు. కొళత్తూర్ నియోజకవర్గం పరిధిలో రూ.91.36 కోట్లతో చేపట్టిన వర్షపునీటి కాలువల నిర్మాణాలను సీఎం పరిశీలించారు. అలాగే, వీవీ నగర్, పుంపుహార్ నగర్ 4వ వీధి, పెరియార్ నగర్ 29వ వీధి, జవహర్ నగర్ 5వ మెయిన్ రోడ్డు, సెల్వినగర్ 5వ వీధి తదితర ప్రాంతాల్లో ఉన్న 4 పార్క్‌లు, ఒక క్రీడా మైదానంలో రూ.1.9 కోట్లతో చేపట్టిన ‘స్పాంజ్ పార్క్’ నిర్మాణాలను సీఎం ప్రారంభించారు. ఈ ప్రాంతాల్లో మొక్కలు నాటడం, ప్రహరీ, చిన్నారులకు క్రీడా ఉపకరణాలు, వాకింగ్ ట్రాక్, కుర్చీ వసతి, విద్యుద్దీపాలు, సీసీ కెమెరాలు, తాగునీరు, వాచ్‌మెన్ తదితర సౌకర్యాలు కల్పించనున్నారు. కొళత్తూర్ ఎమ్మెల్యే కార్యాలయంలో అనిత అఛీవర్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యార్థినీ, విద్యార్థులకు టాలీ శిక్షణ తరగతులు, మహిళలకు టైలరింగ్ తదితరాలను సీఎం పరిశీలించారు. కొళత్తూర్ హరిదాస్ రోడ్డులోని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్‌కు చెందిన తామరై కుళం పార్క్‌ను సీఎం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దురైమురుగన్, కేఎన్ నెహ్రూ, చక్రపాణి, పీకే శేఖర్‌బాబు, జీసీసీ మేయర్ ప్రియ, ఎంపీలు కళానిధి వీరాస్వామి, గిరిరాజన్, ఎమ్మెల్యేలు తాయగం కవి, ఎస్.సుందర్శనం, కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ మహే్‌షకుమార్, కమిషనర్ జె.రాధాకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-08-31T08:03:04+05:30 IST