ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CM Stalin: గుజరాత్ మోడల్ అంటూ వంచన.. సీఎం స్టాలిన్ ధ్వజం

ABN, First Publish Date - 2023-09-05T08:56:01+05:30

దేశమంతటా గుజరాత్‌ మోడల్‌ పాలనను అందిస్తామంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ

- తొమ్మిదేళ్ల బీజేపీ పాలనలో హామీల సంగతే మరిచారు

- దేశాన్ని కాపాడడమే ‘ఇండియా’ లక్ష్యం

చెన్నై, (ఆంధ్రజ్యోతి): దేశమంతటా గుజరాత్‌ మోడల్‌ పాలనను అందిస్తామంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ తొమ్మిదేళ్ల పాలనలో ఎన్నికల హామీలను నెరవేర్చలేదని డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్‌(DMK president and CM Stalin) ధ్వజమెత్తారు. సోమవారం ఉదయం ‘వంచన చేసిన బీజేపీని ఓడిద్దాం... భారతదేశాన్ని కాపాడుకుందాం’ పేరుతో ఆయన ఆడియోను విడుదల చేశారు. ఈ ఆడియో తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ అంటూ ఒకే సమయంలో ఐదు భాషల్లో విడుదలకావడం విశేషం. స్టాలిన్‌ తన ప్రసంగంలో ప్రధాని మోదీ చెప్పినట్లు రైతుల ఆదాయం రెండింతలు, పేదల జీవన ప్రమాణాలు పెరగలేదని, ఈ వైఫల్యాలను దాచిపెట్టేందుకే మతతత్వాన్ని ఎత్తుకున్నారన్నారు. ప్రజల్లో మతపరమైన చిచ్చు రగిల్చి చలి కాచుకుంటున్నారని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ భారతీయులందరూ కాపాడుకుంటున్న సమైక్యతా భావాన్ని నాశనం చేయడం ద్వారా రాజ్యాంగ పునాదులనే పెకలించే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. గుజరాత్‌ మోడల్‌ పాలన అంటూ ప్రగల్భాలు పలికిన నరేంద్రమోదీ(Narendra Modi) ప్రస్తుతం ప్రజలకు ఏ మోడల్‌ పాలనను అందించాలో తెలియక అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారని ఎద్దేవా చేశారు. విదేశాల నుంచి నల్లధనాన్ని తీసుకువచ్చి ప్రతిభారతీయుడి బ్యాంక్‌ ఖాతాలో రూ.15లక్షల జమ చేస్తామని, యేడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, భారత్‌ను ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థికాభివృద్ధి సాధించిన దేశంగా రూపురేఖలనే మార్చుతానని హామీలిచ్చిన మోదీ... దేన్నీ నెరవేర్చలేదన్నారు. వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ కార్పొరేట్‌ సంస్థలకు అండగా ఉంటోందని, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటుపరం చేసిందని, లాభాల్లో నడిచిన విమానయాన సంస్థలను సైతం ప్రైవేటు సంస్థలకు అప్పగించి ఆ సంస్థలను సమర్థవంతంగా నడపలేని తమ చేతగానితనాన్ని ప్రపంచానికే ఎలుగెత్తి చాటిందన్నారు. ‘ఇండియా’ కూటమిలో భాగస్వామ్యం కలిగిన డీఎంకే ప్రస్తుతం దేశాన్ని మతతత్వ శక్తుల నుంచి కాపాడే బాధ్యతను స్వీకరించిందని, 2023 లోక్‌సభ ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి రావాలనే విషయం ముఖ్యం కాదని, ఎవరూ అధికారంలోకి రాకూడదనే విషయమే ముఖ్యమని అన్నారు.

తిరుచ్చెందూరు ఆలయ గోల్ట్‌బాండ్‌ వడ్డీ చెల్లింపు...

తిరుచ్చెందూరు సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయంలో భక్తులు చెల్లించిన బంగారు కానుకలను కరిగించి మేలిమి బంగారు బిస్కెట్ల పొదుపు ద్వారా ఎస్‌బీఐ చెల్లించిన వార్షిక వడ్డీ చెల్లింపు పత్రాన్ని ముఖ్యమంత్రి ఆలయ అధికారులకు అందజేశారు. ఆ ఆలయంలో యేళ్లతరబడి భక్తులు సమర్పించిన బంగారు కానుకలు నిరుపయోగంగా ఉండేవి. డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాజీ న్యాయమూర్తుల సమక్షంలో ముంబైలోని కేంద్రప్రభుత్వ గుర్తింపు కలిగిన సంస్థలో వాటిని మేలిమి బంగారు బిస్కెట్లుగా మార్చి బ్యాంకులలో గోల్డ్‌ బాండ్లుగా పొదుపు చేసే పథకం అమలు చేస్తోంది. ఈ మేరకు తిరుచ్చెందూరు ఆలయంలోని బంగారు కానుకలను కరిగించి బంగారు బిస్కెట్లుగా మార్చారు. ఈ బంగారు బిస్కెట్ల విలువ రూ.99.77 కోట్లు కాగా వీటిని స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో పొదుపు చేశారు. ఆ బంగారు పొదుపునకు యేటా 2.25 కోట్లు వడ్డీ రూపంలో ఆదాయం లభిస్తోంది. ఈ నేపథ్యంలో గత యేడాది పొదుపు చేసిన బంగారు నిల్వలకు ఎస్‌బీఐ చెల్లించిన వడ్డీ పత్రాన్ని సచివాలయంలో సోమవారం ఏర్పాటైన కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులకు స్టాలిన్‌ అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు, మాజీ న్యాయమూర్తి ఆర్‌.మాలా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివదాస్‌ మీనా, పర్యాటక, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ కె.మణివాసన్‌, హిందూ దేవాదాయ శాఖ ప్రత్యేక అధికారి జే.కుమార గురుబరన్‌, కమిషనర్‌ మురళీధరన్‌, స్టేట్‌ బ్యాంక్‌ జనరల్‌ మేనేజర్‌ గోవింద్‌నారయణ్‌ గోయల్‌ తదితరులు పాల్గొన్నారు.

క్రీడావిజేతలకు నగదు ప్రోత్సాహకాలు...

సచివాలయంలో సోమవారం ఉదయం జరిగిన మరో కార్యక్రమంలో ఖేలో ఇండియా, జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పతకాలు సాధించిన 134 మంది క్రీడాకారులకు రూ.2.24 కోట్ల ప్రోత్సాహకాల పంపిణీకి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ శ్రీకారం చుట్టారు. ఆ మేరకు పదిమంది క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలను ఆయన అందజేశారు. ఈ కార్యక్రమలో యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖల మంత్రి ఉదయనిధి, క్రీడా శాఖ ముఖ్య కార్యదర్శి అతుల్య మిశ్రా, రాష్ట్ర క్రీడాభివృద్ధి సంస్థ మెంబర్‌ సెక్రటరీ జే మేఘనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-05T08:56:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising