Manipur: మణిపుర్ హింసపై ప్రధాని మోదీకి కాంగ్రెస్ 4 ప్రశ్నలు.. ఏంటంటే?
ABN, First Publish Date - 2023-10-04T15:46:54+05:30
మణిపుర్ హింస(Manipur Riots)పై ప్రధాని మోదీ స్పందించకుండా వివిధ రాష్ట్రాల్లో తిరుగుతూ రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్(Jairam Ramesh) విమర్శించారు.
మణిపుర్: మణిపుర్ హింస(Manipur Riots)పై ప్రధాని మోదీ స్పందించకుండా వివిధ రాష్ట్రాల్లో తిరుగుతూ రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్(Jairam Ramesh) విమర్శించారు. బీజేపీ(BJP) ప్రభుత్వం వచ్చిన 15 నెలలకే రాష్ట్రంలో విధ్వంసం జరుగుతోందని ఆక్షేపించారు. రాష్ట్రాన్ని ప్రధాని పూర్తిగా విడిచిపెట్టారని అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ విభజన రాజకీయాల వల్లే రాష్ట్రంలో ఈ పరిస్థితి ఏర్పడిందిన జైరాం ఆరోపించారు. ప్రధాని ఈ అంశంపై లోక్ సభలో మాట్లాడటానికి కేవలం 5 నిమిషాల సమయం తీసుకోవడం దారుణమని వ్యాఖ్యానించారు. మణిపుర్ హింసకు సంబంధించి పలు అంశాలపై స్పందించాలని డిమాండ్ చేస్తూ ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున పలు ప్రశ్నలు సంధించారు.
1.సీఎం బీరెన్ సింగ్ తో ప్రధాని మోదీ(PM Modi) చివరిసారి ఎప్పుడు మాట్లాడారు?
2.మణిపూర్ బీజేపీ ఎమ్మెల్యేలను ఆయన చివరిసారి ఎప్పుడు కలిశారు?
3.రాష్ట్రానికి చెందిన తన మంత్రివర్గ సహచరుడితో రాష్ట్రంలో పరిస్థితి గురించి ప్రధాని చివరిసారి ఎప్పుడు చర్చించారు?
4.హింసాత్మక ఘటన బాధిత కుటుంబాలకు బీజేపీ సర్కార్ చేసిన సాయమేంటి?అంటూ జైరాం రమేశ్ ప్రధానిని ప్రశ్నించారు.
మణిపుర్ లో కుకీ, మైతేయి తెగల మధ్య చెలరేగిన ఘర్షణలో 175 మంది మరణించారు. 50 వేలకు పైగా నిరాశ్రయులయ్యారు. అదే సమయంలో మహిళలపై లైంగిక వేధింపు ఘటనల వీడియోలు బయటకి వచ్చాయి. ఈ వీడియోలు యావత్తు దేశాన్నే కదిలించాయి. సుప్రీంకోర్టు సైతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
Updated Date - 2023-10-04T15:48:47+05:30 IST