karnataka election results: 36 ఏళ్ల తర్వాత సరికొత్త చరిత్ర సృష్టించిన కాంగ్రెస్
ABN, First Publish Date - 2023-05-13T19:00:21+05:30
కర్ణాటక (karnataka)లో 36 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ భారీ విజయం సాధించింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) 1989లో 224 నియోజకవర్గాలకుగాను 178 స్థానాలు ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించింది.
బెంగళూరు: కర్ణాటక (karnataka)లో 36 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ భారీ విజయం సాధించింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) 1989లో 224 నియోజకవర్గాలకుగాను 178 స్థానాలు ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించింది. 1999లో 132 స్థానాలు గెలుపొంది అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రదర్శన పేలవంగా సాగింది. ఇదిగో ఇప్పుడు మూడున్నర దశాబ్దాల తర్వాత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 136 స్థానాలు దక్కడం విశేషం. కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో 224 నియోజకవర్గాలకుగాను అంచనాలకు మించి 136 సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంది. అధికార బీజేపీకి ఈ ఎన్నికల ఫలితాలు ఊహించని షాక్ ఇచ్చాయి. దక్షిణాదిన ఆ పార్టీ అడ్రస్ గల్లంతయింది. కాంగ్రెస్ విజయయాత్రలో బీజేపీ, జేడీఎస్ (BJP JDS) కంచుకోటలు తునాతునకలయ్యాయి. ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్న కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ (DK Shivakumar) రామనగర జిల్లాలోని కనకపురలో లక్ష ఓట్లకుపైగా మెజారిటీతో ఘన విజయం అందుకున్నారు. మైసూరులోని వరుణలో మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య కూడా ఘన విజయం నమోదు చేశారు. ఒకదశలో వరుణలో ఆయన గెలుపు ఈసారి కష్టమని గట్టిగా వినిపించింది. ఆయనపై బీజేపీ గృహ వసతి శాఖ మంత్రి సోమణ్ణను రంగంలోకి దించినా ఫలితం లేకపోయింది. ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్న మల్లికార్జున ఖర్గేకు కర్ణాటక ఫలితాలు కొండంత బలాన్నిచ్చాయి. సొంత రాష్ట్రంలో పార్టీకి అధికారం దక్కేలా చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. తద్వారా అధిష్టానం పెద్దల దృష్టిలో ఖర్గే స్థానం మరింత పదిలమైంది.
లింగాయత్ ఓటు బ్యాంకు కొల్లగొట్టిన కాంగ్రెస్
బీజేపీకి కొండంతగా అండగా ఉన్న లింగాయత్ ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపు మళ్లింది. లింగాయత్‌లు నిర్ణాయక సంఖ్యలో ఉన్న 69 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఏకంగా 46 స్థానాలను కైవసం చేసుకుంది. అలాగే వక్కలిగల ప్రాబల్యం అధికంగా ఉన్న 51 నియోజకవర్గాలకుగాను 27 నియోజకవర్గాలను తన ఖాతాలో వేసుకుంది. ఎస్సీల ప్రాబల్యం అధికంగా ఉన్న 37 నియోజకవర్గాలకు గాను 22 నియోజకవర్గాలు, ఎస్టీల ప్రాబల్యం అధికంగా ఉన్న 15 నియోజకవర్గాలకుగాను 14 స్థానాలను కైవసం చేసుకుంది. ఎన్నికల సమయంలో బీజేపీ ప్రభుత్వం చేపట్టిన రిజర్వేషన్ల వర్గీకరణ, లింగాయత్, వక్కలిగలకు రిజర్వేషన్ల పెంపు వంటి అంశాల ప్రభావం బీజేపీకి ఏమాత్రం దక్కకపోవడం గమనార్హం.
రేపు సీఎల్పీ సమావేశం
కాంగ్రెస్ ఘన విజయం నేపథ్యంలో పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ సూచన మేరకు పార్టీ సీనియర్ నేతలంతా బెంగళూరులో శనివారం రాత్రి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎన్నికపై కసరత్తు చేస్తారు. ఏకాభిప్రాయ సాధన ఆధారంగా సీఎంను ఎంపిక చేయాలా..? లేదా అధిష్టానం సూచన మేరకు ముందుకు సాగాలా..? అనే అంశంపై చర్చ జరుగనుంది. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం ఆదివారం జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. వారంలోగా నూతన ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేస్తారని పేర్కొన్నారు.
Updated Date - 2023-05-13T19:00:21+05:30 IST