PM Modi: కాంగ్రెస్ ఎక్కడుంటే అక్కడ నక్సలిజం పెరుగుతుంది..
ABN, First Publish Date - 2023-11-07T16:23:04+05:30
దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ అధికారంలోకి వచ్చినా అక్కడ టెర్రరిస్టులు, నక్సలైట్లకు ధైర్యం పెరుగుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఛత్తీస్‌గఢ్ లోని సూరజ్‌పూర్‌లో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని పాల్గొన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో నక్సలిజానికి ముకుతాడు వేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
సూరజ్‌పూర్: దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ అధికారంలోకి వచ్చినా అక్కడ టెర్రరిస్టులు, నక్సలైట్లకు ధైర్యం పెరుగుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) లోని సూరజ్‌పూర్‌లో మంగళవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని పాల్గొన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో నక్సలిజానికి ముకుతాడు వేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు.
''దేశంలో ఎక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా అక్కడ నక్సలైట్లు, టెర్రరిస్టులకు ధైర్యం పెరుగుతుంటుంది. రాష్ట్రంలో నక్సల్స్ హింసను అరికట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. అనేక మంది కార్యకర్తలను బీజేపీ కోల్పోయింది. కొద్ది రోజుల క్రితమే మా కార్తకర్త ఒకరిని కాల్చిచంపారు'' అని మోదీ చెప్పారు. సర్గుజ డివిజన్‌లో మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల వ్యాపారం ఎక్కువగా ఉందని ఆయన అన్నారు. మన ఆడకూతుళ్లు నేరగాళ్ల టార్గెట్‌గా మారుతున్నారని, గిరిజన కుటుంబాల్లోని అనేక మంది అమ్మాయిలు మాయవుతున్నారని, దీనికి కాంగ్రెస్ వద్ద ఎలాంటి సమాధానం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాల వల్ల సర్గుజ ప్రాంతంలో పండుగలు చేసుకోవడం కూడా కష్టంగా ఉందన్నారు.
ద్రౌపతి ముర్మును రాష్ట్రపతి కాకుండా అడ్డుకున్నారు..
భారత తొలి గిరిజన రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్మును రాష్ట్రపతి కాకుండా చూసేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిన మోదీ ఆరోపించారు. ఆదివాదీ కుటుంబానికి చెందిన ఒక మహిళ భారత రాష్ట్రపతి అవుతుందని ఎరైనా ఊహించారా? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎంతగా అడ్డుకునే ప్రయత్నం చేసినా ద్రౌపది ముర్ముకు ఆ గౌరవం కల్పించామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఆదివాసీలపై ఖర్చు చేయడం వృథా అనుకోదని చెప్పారు.
మహదేవ్ పేరుతో స్కామ్..
ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసగించడం మినహా చేసిందేమీ లేదని మోదీ ఘాటు విమర్శలు చేశారు. యువత కలలను సాకారం చేయలేదని, మహదేవ్ పేరుతో ఒక స్కామ్ కూడా పాల్పడ్డారని ఆరోపించారు. మహదేవ్ బెట్టింగ్ స్కామ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోందని అన్నారు. ''వాళ్ల ఖజానాలు నింపుకునేందుకు మీ పిల్లల్ని బెట్టింగ్‌లోకి దింపుతోంది. అలాంటి వాళ్లను (కాంగ్రెస్) మీరు క్షమిస్తారా?'' అని మోదీ ప్రశ్నించారు.
కాగా, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతలుగా నిర్వహిస్తుండగా, 20 నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్ మంగళవారం ఉదయం 7 గంటలకు మొదలైంది. రెండో విడత పోలింగ్ నవంబర్ 17న జరుగనుంది. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.
Updated Date - 2023-11-07T16:24:36+05:30 IST