Digvijaya Singh: బైకర్‌ను ఢీకొన్న దిగ్విజయ్ సింగ్ కారు
ABN, First Publish Date - 2023-03-10T13:57:17+05:30
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న మోటార్ సైకిలును ఢీకొన్న ఘటన రాజ్‌గఢ్..
రాజ్‌గఢ్: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ (Digvijay Singh) ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న మోటార్ సైకిలును ఢీకొన్న ఘటన రాజ్‌గఢ్ జిల్లా జిరాపూర్ సమీపంలో చోటుచేసుకుంది. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడితో సమావేశానంతరం కొడక్య గ్రామానికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బైక్‌పై వస్తున్న యువకుడు రోడ్ క్రాస్ చేస్తుండగా సింగ్ ప్రయాణిస్తున్న నలుపురంగు ఫార్చునర్ కారు బైక్‌ను ఢీకొంది. దీంతో ఆ యువకుడు బైక్ నుంచీ సుమారు పది అడుగులు ఎగిరిపడి అక్కడున్న స్తంభాన్ని ఢీకొన్నాడు. ప్రమాదం గుర్తించిన సింగ్ వెంటనే కారు నుంచి బయటకు వచ్చి ఆ అయువకుడిని ఆసుపత్రికి తరలించాడు. వైద్యులు అతనికి ప్రాథమిక చికిత్స అందించి, తదుపరి చికిత్స కోసం భోపాల్ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. 20 ఏళ్ల ఆ యువకుడిని రాంబాబు బగ్రిగా గుర్తించారు. అంతరం భోపాల్‌లోని చిరయు ఆసుపత్రిలో చేరిన యువకుడిని దిగ్వజయ్ వెళ్లి పరామర్శించినట్టు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.
కాగా, యువకుడు కారుకు అడ్డంగా రోడ్‌ను క్రాస్ చేయడంతో ప్రమాదం చోటుచేసుకుందనీ, అయినప్పటికీ యువకుడి చికిత్సకు అయ్యే ఖర్చు తానే భరిస్తానని సింగ్ తెలిపారు. తన కారును సీజ్ చేసి, డ్రైవర్‌పై ఫిర్యాదు నమోదు చేయాలని కూడా ఆయన స్యయంగా పోలీసులను కోరారు. దీంతో ఆయన వాహనాన్ని జిరాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే కారులో సింగ్ రాజ్‌గఢ్‌కు బయలుదేరి వెళ్లారు. 2019లో కూడా దిగ్విజయ్ సింగ్ కాన్వాయ్ ఒక ట్రక్కును చిత్రకోట్ జిల్లాలో ఢీకొన్న ఘటన జరిగింది. ఆ ప్రమాదంలో ఆయన సెక్యూరిటీ సిబ్బంది పలువురు గాయపడ్డారు.
Updated Date - 2023-03-10T13:59:04+05:30 IST