Bajrang Dal: బజరంగ్‌దళ్‌పై కాంగ్రెస్ యూ టర్న్... నిషేధిస్తామనలేదని వెల్లడి
ABN, First Publish Date - 2023-05-04T16:00:02+05:30
బజరంగ్‌దళ్ (Bajrang Dal) అంశం ప్రకంపనలు సృష్టిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ యూ టర్న్ తీసుకుంది. బజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామని తమ మేనిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ వెనకడుగు వేసింది.
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) వేళ బజరంగ్‌దళ్ (Bajrang Dal) అంశం ప్రకంపనలు సృష్టిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ యూ టర్న్ తీసుకుంది. బజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామని తమ మేనిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ వెనకడుగు వేసింది. అసలు తాము బజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామని అననేలేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీరప్ప మొయిలీ (Congress leader M Veerappa Moily) స్పష్టం చేశారు. తాను కర్ణాటకలో న్యాయమంత్రిగా కూడా పనిచేశానని ఆయన గుర్తు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బజరంగ్‌దళ్‌ను బ్యాన్ చేయలేదని తెలిపారు. బజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామని జరుగుతున్న ప్రచారంపై కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్ సవివరంగా మాట్లాడతారని కూడా మొయిలీ చెప్పారు.
కర్ణాటక కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో బజరంగ్ దళ్ (Bajrang Dal)ను నిషేదిస్తామని పేర్కొనడంపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) సూటిగా స్పందించేందుకు నిరాకరించారు. ఇప్పటికే తమ పార్టీ నేత డాక్టర్ పరమేశ్వర వివరణ ఇచ్చినట్టు బుధవారంనాడు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ''డాక్టర్ పరమేశ్వర ఇప్పటికే వివరణ ఇచ్చారు. ఆయన మేనిఫెస్టో ముసాయిదా కమిటీ చైర్మన్. దీనిపై ఆయన మంగళవారంనాడే వివరణ ఇచ్చారు. ఒకసారి మా పార్టీ వ్యక్తులు సమాధానం ఇచ్చిన తర్వాత నా సొంత అభిప్రాయం చెప్పాల్సిన పనిలేదు'' అని ఖర్గే అన్నారు.
హనుమాన్ భక్తులు బలంగా నిలబడితే ఇప్పటికే అస్థిరమైన కాంగ్రెస్‌ను కూలదోస్తారంటూ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై చేసిన వ్యాఖ్యలపై అడిగినప్పుడు, ఆయన (బొమ్మై) చెప్పేది ఆయన చెబుతారని, బొమ్మై ప్రతి ప్రశ్నకు తాము సమాధానం ఇవ్వాల్సిన పని లేదని ఖర్గే అన్నారు. ఆయన ఏదైనా చెబితే అక్కడ తమ (కాంగ్రెస్) నేతలు ఉన్నారని, రాష్ట్ర స్థాయిలోనే వారు సమాధానమిస్తారని చెప్పారు.
మరోవైపు ఓటు వేసేటప్పుడు ‘జై బజరంగబలి’ నినాదం చేయడం ద్వారా కాంగ్రెస్ దుష్ట సంస్కృతిని శిక్షించాలని కర్ణాటక ఓటర్లకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఆ పార్టీయే అభివృద్ధి, శాంతిసామరస్యాలకు శత్రువని నిందించారు. కర్ణాటకలోని ఉత్తర కన్నడ, దక్షణ కన్నడ, బెళగావి జిల్లాల్లో మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన నేపథ్యంలో మోదీ ప్రతి బహిరంగసభలోనూ ‘జై బజరంగబలి’ అంటూ నినదించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు మొత్తం ‘విభజించు పాలించు’ అనే విధానంపైనే ఆధారపడి ఉన్నాయన్నారు. భారత ప్రజాస్వామ్యాన్ని, అభివృద్ధిని ప్రపంచవ్యాప్తంగా ప్రశంసిస్తున్న సమయంలో ఆ పార్టీ ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ దేశం పరువుతీస్తోందని నిందించారు. భారత సైనిక దళాలనూ ఆ పార్టీ అవమానిస్తోందన్నారు. ‘కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పెట్టుబడిదారులు పారిపోయారు. ఉగ్రవాద బాస్‌లను ఆ పార్టీ కాపాడింది. వారిపై కేసులు ఉపసంహరించుకోవడమే కాదు. వారిని విడుదల కూడా చేసింది. బుజ్జగింపు రాజకీయాలే ఆ పార్టీకి ఏకైక గుర్తింపు. ఎన్నికల్లో దేశ వ్యతిరేక శక్తుల సాయం కూడా తీసుకుంది. అలాంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడాన్ని మీరు(ఓటర్లు) అనుమతిస్తారా? కర్ణాటక నాశనమవడానికి మీరు అంగీకరిస్తారా? దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనైనా శాంతి, అభివృద్ధి కోరుకునే ప్రజలు మొదట చేసే పని కాంగ్రెస్‌ను గద్దె దించడమే. సమాజంలో శాంతి ఉందంటే, దేశం పురోగమిస్తోందంటే కాంగ్రెస్ జీర్ణించుకోలేదు. ప్రశాంతంగానూ ఉండలేదు. దేశంలో కర్ణాటకను నంబర్ వన్ స్థానంలో నిలిపేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. ఢిల్లీలో కూర్చున్న రాచ కుటుంబానికి కర్ణాటకను నంబర్ వన్ ఏటీఎంగా మార్చాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జేడీఎస్ నేతలు కూడా అలాంటివారే. పోలింగ్ బూత్‌లో బటన్ నొక్కే సమయంలో జై బజరంగబలి అనడం ద్వారా వారిని శిక్షించండి’ అని మోదీ పిలుపునిచ్చారు.
మరోవైపు గురువారం రాత్రి 7 గంటలకు ఆలయాలలో హనుమాన్ చాలీసా పఠనం నిర్వహించాలని బజరంగ్‌దళ్ పిలుపునిచ్చింది.
కర్ణాటకలో అధికారంలోకి వస్తే బజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు ఊపందుకున్నాయి. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ కార్యాలయంపై బజరంగ్‌దళ్ కార్యకర్తలు దాడి చేసి ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేశారు.
Updated Date - 2023-05-04T16:20:43+05:30 IST