Caste Census : దేశంలో కులగణనకు సీడబ్ల్యూ ఏకగ్రీవ మద్దతు: రాహుల్
ABN, First Publish Date - 2023-10-09T17:09:19+05:30
దేశంలో కులగణనకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏకగ్రీవంగా మద్దతు తెలిపింది. సీడబ్ల్యూసీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అధికారికంగా ప్రకటించారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టడమనేది ప్రగతిశీలక, శక్తివంతమైన అడుగుగా ఆయన అభివర్ణించారు.
న్యూఢిల్లీ: దేశంలో కులగణన (Caste census)కు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (Congrss working committee) ఏకగ్రీవంగా మద్దతు తెలిపింది. సీడబ్ల్యూసీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) అధికారికంగా ప్రకటించారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టడమనేది ప్రగతిశీలక, శక్తివంతమైన అడుగుగా ఆయన అభివర్ణించారు. ఇది కీలకమైన ముందడుగుగా ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ ముఖ్యమంత్రులు సైతం బలంగా విశ్వసిస్తున్నారని చెప్పారు. ఖర్గే అధ్యక్షతన ఏఐసీసీ కార్యాలయంలో సోమవారంనాడు జరిగిన సీడబ్ల్యూసీ సమావేశానంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ, నాలుగు రాష్ట్రాల్లోని తమ (కాంగ్రెస్) ముఖ్యమంత్రులు కులగణను కీలకంగా తీసుకుని దీనిపై తగు చర్యలు తీసుకుంటారని చెప్పారు.
కులాల సర్వేకు సిద్ధంగాలేని మోదీ..
దేశవ్యాప్తంగా కులాల వారీ సర్వేను మోదీ నిర్వహించకపోవడాన్ని రాహుల్ తప్పుపట్టారు. తప్పుదారి పట్టించే వ్యూహాలతో కులాల సర్వే నిర్వహణకు మోదీ గండికొడుతున్నారని అన్నారు. "కులగణనకు ఆయన (మోదీ) సిద్ధంగా లేరు. మాకున్న నలుగురు ముఖ్యమంత్రులలో ముగ్గురు ఓబీసీలు ఉన్నారు. 10 మంది బీజేపీ ఎంపీల్లో ఒక్కరే ఓబీసీ క్యాటగిరీకి చెందిన వారున్నారు. ఓబీసీల నుంచి బీజేపీ సీఎంలు ఎందరు ఉన్నారు? ఓబీసీలకు మోదీ చేసిందేమీ లేదు. ప్రధానమైన సమస్యల నుంచి వారి దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు'' అని రాహుల్ అన్నారు.
''కుల సర్వే నుంచి దృష్టి మళ్లించడమే మోదీ లక్ష్యం. రాబోయే రోజుల్లో మరింతగా దృష్టిమళ్లించే ప్రయత్నం జరుగుతుంది. ఇదేమీ (కులగణన) రాజకీయ నిర్ణయం కాదు. న్యాయ ఆధారిత నిర్ణయం'' అని రాహుల్ స్పష్టం చేశారు. సీడబ్ల్యూసీ సమావేశంలో ఖర్గేతో పాటు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-10-09T17:11:19+05:30 IST