Data usage: డేటా వినియోగానికి అంగీకారం తప్పనిసరి!
ABN, First Publish Date - 2023-08-14T02:54:11+05:30
వ్యక్తిగత సమాచారాన్ని(Personal information) సేకరించి వినియోగించుకోవటానికి ముందు ఆయా వ్యక్తుల బేషరతు అంగీకారాన్ని కంపెనీలు తీసుకోవటం తప్పనిసరి అని ‘డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్’ (డీపీడీపీ) చట్టం స్పష్టం చేస్తోంది. స
దేనికోసం వాడుతున్నారో తెలియజేయాలి.. ఒకటి చెప్పి మరో దానికి వాడొద్దు
పని పూర్తయ్యాక ఆ డేటాను తొలగించాలి
కంపెనీలకు డీపీడీపీ చట్టం నిర్దేశం
తప్పులకు రూ.250 కోట్ల వరకూ జరిమానా
వ్యక్తిగత స్థాయిలో సమాచార
సేకరణకు చట్టం నుంచి మినహాయింపు
న్యూఢిల్లీ, ఆగస్టు 13: వ్యక్తిగత సమాచారాన్ని(Personal information) సేకరించి వినియోగించుకోవటానికి ముందు ఆయా వ్యక్తుల బేషరతు అంగీకారాన్ని కంపెనీలు తీసుకోవటం తప్పనిసరి అని ‘డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్’ (డీపీడీపీ) చట్టం స్పష్టం చేస్తోంది. సదరు వ్యక్తులకు తమ వివరాలను దేనికోసం వినియోగిస్తున్నారన్నదానిపై కంపెనీలు పూర్తి స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. దేనికోసం వివరాలను సేకరించారో ఆ పని కోసమే వినియోగించాలి. పని పూర్తి అయిన తర్వాత ఆ వివరాలను తొలగించాలి. ఉదాహరణకు, ఒక వైద్యసేవల యాప్(Medical services app) ఒక వ్యక్తి నుంచి సమాచారం తీసుకుంటే వైద్యసేవల వరకే దానిని వినియోగించాలి. ఆ తర్వాత ఆ వివరాలను తొలగించాలి. మధ్యలో వ్యక్తులు తమ అంగీకారాన్ని ఉపసంహరించుకున్నా కూడా వారి వివరాలను తొలగించాల్సిందే. తమ వద్ద ఉన్న సమాచారాన్ని భద్రపరచటానికి కంపెనీలు అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. ఒకవేళ డేటా లీకేజీ(Data leakage) జరిగితే ఆ విషయాన్ని వెంటనే డేటా పరిరక్షణ బోర్డుకు, సదరు వ్యక్తులకు తెలియజేయాలి. సమాచార పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోలేదని తేలితే రూ.250 కోట్ల వరకు జరిమానా పడుతుంది. నిబంధనల ఉల్లంఘనకు రూ.200 కోట్ల జరిమానా. రాష్ట్రపతి ఆమోదం నేపథ్యంలో డీపీడీపీ బిల్లు చట్టంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చట్టంలోని అంశాలు ఆదివారం వెల్లడయ్యాయి.
వీటి ప్రకారం.. వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి చట్టబద్ధ ప్రయోజనాల కోసం వినియోగించుకునే కంపెనీలు, వివాద పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయటం తప్పనిసరి. ఫిర్యాదుల స్వీకరణకు ఒక అధికారిని నియమించి, ఆ అధికారి ఫోన్ నెంబర్ తదితర వివరాలను వెల్లడించాలి. ఇదంతా కంపెనీలకు సంబంధించింది కాగా, వ్యక్తుల విషయానికొస్తే, తమ వ్యక్తిగత వివరాలను దేనికి ఉపయోగిస్తున్నారు, ఎవరితో పంచుకుంటున్నారు అన్న విషయాలను సదరు కంపెనీ నుంచి తెలుసుకునే హక్కు వారికి ఉంటుంది. తమ వ్యక్తిగత వివరాలను పూర్తిగా ఉపసంహరించుకోవటమేగాక, మార్పుచేర్పులు చేసుకునే అవకాశం కూడా వారికి డీపీడీపీ చట్టం ఇస్తుంది. అయితే, ఇతరుల వివరాలను తమ పేరుతో ఇచ్చినా, వాస్తవాలను దాచిపెట్టినా, తప్పుడు ఫిర్యాదులు చేసినా రూ.10 వేల వరకూ వ్యక్తులపై జరిమానా విధించే అవకాశం ఉంది. ప్రభుత్వం విషయానికొస్తే, దేశ భద్రత కోణంలో కొన్ని దేశాలకు భారతీయ పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని బదిలీ చేయటానికి అనుమతిని నిరాకరించవచ్చు. స్టార్ట్‌పల వంటి కొన్ని కంపెనీలను, ప్రభుత్వ సంస్థలను చట్టం పరిధి నుంచి మినహాయించే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంటుంది. డేటా ప్రొటెక్షన్ బోర్డు సిఫార్సు మేరకు కంపెనీలను నిషేఽధించవచ్చు.
ఆఫ్‌లైన్‌లో సేకరించినా చట్టం వర్తిస్తుంది
డీపీడీపీ చట్టం ప్రకారం ఒక వ్యక్తికి సంబంధించిన వివరాలే వ్యక్తిగత సమాచారం. భారత్‌లో నివసిస్తున్న వారి నుంచి డిజిటల్ రూపంలో సేకరించిన లేదా ఆఫ్‌లైన్‌లో సేకరించి ఆ తర్వాత డిజిటలీకరించిన వ్యక్తిగత సమాచారానికి చట్టంలోని నిబంధనలు వర్తిస్తాయి. భారత్‌లో సేవలు అందిస్తున్న కంపెనీలు తాము సేకరించిన సమాచారాన్ని విదేశాల్లో నిర్వహించినా కూడా చట్టం వర్తిస్తుంది. 18 ఏళ్ల లోపు వారిని పిల్లలుగా ఈ చట్టం నిర్వచిస్తుంది. వీరి సమాచారం సేకరించాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి.
Updated Date - 2023-08-14T04:31:14+05:30 IST