Maharashtra: శాఖల్లేని మంత్రులు, ఎందుకీ జాప్యం?.. కారణాలు ఇవేనా?
ABN, First Publish Date - 2023-07-09T17:47:13+05:30
ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంలో ఏమి జరుగుతోంది? అంతా సవ్యంగానే ఉందా?. మహారాష్ట్ర రాజకీయాల్లో తాజాగా ఈ ప్రశ్నలు చర్చనీయాంశమవుతున్నాయి. ఎన్‌సీపీ తిరుగుబాటు నేత అజిత్ పవార్ , ఆయన వర్గం ఎమ్మెల్యేలు మహారాష్ట్రలోని ఎన్డీయే ప్రభుత్వంలో చేరి ఇప్పటికి 8 రోజులవుతోంది. అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా, 8 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసినప్పటికీ ఇంతవరకూ వారికి శాఖలు కేటాయించలేదు.
ముంబై: ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) ప్రభుత్వంలో ఏమి జరుగుతోంది? అంతా సవ్యంగానే ఉందా?. మహారాష్ట్ర రాజకీయాల్లో తాజాగా ఈ ప్రశ్నలు చర్చనీయాంశమవుతున్నాయి. ఎన్‌సీపీ తిరుగుబాటు నేత అజిత్ పవార్ (Ajit Pawar), ఆయన వర్గం ఎమ్మెల్యేలు మహారాష్ట్రలోని ఎన్డీయే ప్రభుత్వంలో చేరి ఇప్పటికి 8 రోజులవుతోంది. అనూహ్యంగా అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా, 8 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసినప్పటికీ ఇంతవరకూ వారికి శాఖలు కేటాయించలేదు. అజిత్ పవార్‌కు కీలకమైన ఆర్థిక శాఖ, తక్కిన మంత్రులకు ప్రధానమైన శాఖలే దక్కనున్నాయని ప్రచారం జరిగింది. అయితే దీనిపై ఇంతవరకూ ఎలాంటి స్పష్టత లేదు. దీంతో ఇటు అజిత్, అటు శివసేన, బీజేపీ శిబిరాల్లో అసహన వాతావరణం కనిపిస్తోంది.
ఫడ్నవిస్, షిండే సమావేశమైనా...
ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మధ్య రెండు రోజుల క్రితం సీఎం నివాసమైన వర్షా బంగ్లాలో అర్ధరాత్రి వరకూ చర్చలు జరిగాయి. అయితే మంత్రిత్వశాఖల కేటాయింపు వ్యవహారం ఓ కొలిక్కి రాలేదు. ప్రస్తుతం ఫడ్నవిస్‌తో ఉన్న ఆర్థిక శాఖను అజిత్ పవార్‌కు ఇచ్చేందుకు షిండే వర్గం సుముఖంగా లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆర్థిక శాఖ, ఇంధన శాఖ, రెవెన్యూ శాఖ వంటి కీలక శాఖలను పవార్ కోరకుంటున్నారు. తను అడిగినవి కాకుండా వేరే శాఖలు తీసుకునేందుకు ఆయన సుముఖంగా లేరని చెబుతున్నారు. ఆయనతో పాటు అధికార కూటమిలో చేరిన దిలీప్ వాల్సే పాటిల్, హసన్ ముష్రిఫ్, ధనంజయ్ ముండే సైతం గౌరవప్రదమైన శాఖలు కోరుకుంటున్నారు.
అసెంబ్లీ సమావేశాలకు ముందే...
అధికార పంపకాల (శాఖల కేటాయింపు) వ్యవహారం ఈనెల 17న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే జరగాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, ఢిల్లీలోని అధిష్ఠానం నుంచి ఇంతవరకూ ఎలాంటి గ్రీన్‌సిగ్నల్ రాలేదు. ప్రభుత్వంలో 43 మందికి శాఖలు కేటాయించే అవకాశం ఉండగా, ప్రస్తుతం 14 మంత్రి పదవులు మాత్రమే భర్తీ చేయాల్సి ఉంది. ఇంతవరకూ జరిగిన చర్చల ప్రకారం, బీజేపీ, శివసేన నుంచి తలో ముగ్గురు కొత్త వ్యక్తులకు మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంది. రెండు వర్గాలకు చెందిన ఇద్దరు లేదా ముగ్గురిని మంత్రివర్గం నుంచి తప్పించే వీలుంది. లోక్‌సభ ఎన్నికల కోసం పార్టీ బాధ్యతలు అప్పగించిన వారిని మంత్రివర్గం నుంచి తప్పించవచ్చని తెలుస్తోంది.
శివసేనకు చిక్కు?
కాగా, క్యాబినెట్ విస్తరణ పేరుతో మార్పులు చేర్పులకు శివసేన మంత్రులు కొందరు అయిష్టంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకు భిన్నంగా శివసేన మంత్రులను ఎవరినైనా తప్పిస్తే వారు తిరుగుబాటు దారి పట్టే అవకాశం ఉందని శివసేన భయపడుతున్నట్టు చెబుతున్నారు. మొత్తంమీద, శివసేన, బీజేపీ, ఎన్‌సీపీ శిబారాల్లో అధికార పంపకాల వ్యవహారం అంతకంతగా జఠిలంగా మారుతున్నట్టు బలమైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Updated Date - 2023-07-09T17:47:13+05:30 IST