Delhi excise policy case: సిసోడియా బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
ABN, First Publish Date - 2023-03-21T17:15:47+05:30
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో 'ఆప్' సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి..
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం (Delhi excise scam) కేసులో 'ఆప్' సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా (Manish Sisodia)కు మరోసారి నిరాశ ఎదురైంది. బెయిలుపై వాదనలు విన్న ప్రత్యేక కోర్టు సీబీఐ (CBI)ని లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను మార్చి 24వ తేదీకి వాయిదా వేసింది. సిసోడియా కస్టడీని ఇప్పటికే రెండుసార్లు కోర్టు పొడిగించింది.
సిసోడియా బెయిలు అభ్యర్థనపై ఢిల్లీ కోర్టు మంగళవారంనాడు విచారణ చేపట్టింది. ఎక్సైజ్ స్కామ్ కేసులో సీబీఐ విచారణకు తన క్లెయింట్ సహకరిస్తున్నారని, సీబీఐ సోదాల్లో ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు సీబీఐకి లభ్యం కాలేదని సిసోడియా తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఆయన కస్టోడియల్ ఇంటరేగేషన్ ఇంకా పొడిగింపు అవసరం లేదని, విచారణ నుంచి ఆయన ఎక్కడకీ తప్పించుకుపోవడం లేదని ఆయన వాదించారు. తన క్లయింట్ లంచం తీసుకున్నారడానికి ఎలాంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేదని, ఎక్సైజ్ పాలసీలో మార్పులు చేయడం సాధారణ ప్రక్రియలో భాగమేనని అన్నారు. ఎక్సైజ్ పాలసీలో మార్పుల వ్యవహారం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, ఫైనాన్స్ సెక్రటీరికి దృష్టికి కూడా వెళ్లిందని చెప్పారు.
భార్యకు బాగోలేదు...కొడుకు విదేశాల్లో ఉన్నాడు..
కాగా, తన భార్యకు ఆరోగ్యం బాగోలేదని ఆమెను చూసుకునే వారెవరూ లేరని సిసోడియా తన బెయిలు విజ్ఞప్తిలో కోర్టును కోరారు. ఈ విషయాన్ని సిసోడియా లాయర్ కోర్టు దృష్టికి తెచ్చారు. సిసిడోయా భార్యకు ఒంట్లో బాగోలేకపోవడమే కాకుండా ఆయన కుమారుడు విదేశాల్లో చదువుతున్నారని, దీంతో ఆమెను చూసుకునేందుకు ఎవరూ లేరని చెప్పారు.
దీనిపై సీబీఐ తన వాదన వినిపిస్తూ, సిసోడియాను విడుదల చేస్తే ఆయన సాక్ష్యాలను ప్రభావితం చేయడంతో పాటు, వాటిని ధ్వంసం చేసే అవకాశం కచ్చితంగా కచ్చితంగా ఉందని తెలిపింది. 60 రోజుల్లోగా దర్యాప్తు సంస్థ ఛార్జిషీటు దాఖలు చేయాల్సి ఉంటుందని, సిసోడియా బయటకు వస్తే (బెయిలుపై విడుదలైతే) విచారణ విషయంలో రాజీపడాల్సి వస్తుందని పేర్కొంది. మనీష్ సిసోడియా తరచు ఫోన్లు మార్చడం అమాయకమైన చర్య ఏమీ కాదని, సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకే అలా చేశారని సీబీఐ వాదించింది.
Updated Date - 2023-03-21T17:20:34+05:30 IST