Delhi: వాయు కాలుష్యం పెరుగుతున్నవేళ ప్రజల్ని హెచ్చరిస్తున్న ఢిల్లీ సర్కార్
ABN, First Publish Date - 2023-11-11T15:22:00+05:30
Air Quality: వాయు కాలుష్యం దేశ రాజధాని ప్రజల్ని భయపెడుతోంది. కాలుష్య(Air Pollution) ప్రభావంతో జలుబు, దగ్గు, ఆస్తమా తదితర రోగాలతో పబ్లిక్ ఆసుపత్రులపాలవుతున్నారు. దీంతో ఢిల్లీ(Delhi) సర్కార్ ఇవాళ కీలక హెచ్చరికలు జారీ చేసింది.
ఢిల్లీ: వాయు కాలుష్యం దేశ రాజధాని ప్రజల్ని భయపెడుతోంది. కాలుష్య(Air Pollution) ప్రభావంతో జలుబు, దగ్గు, ఆస్తమా తదితర రోగాలతో పబ్లిక్ ఆసుపత్రులపాలవుతున్నారు. దీంతో ఢిల్లీ(Delhi) సర్కార్ ఇవాళ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఉదయం, సాయంత్రం వాకింగ్, శారీరక వ్యాయామాలు చేసే వారు ఇకపై వాటికి కొన్నాళ్లు ఫుల్ స్టాప్ చెప్పాలని హెచ్చరించింది. గర్భిణీలు కూడా బయట తిరగవద్దని సూచించింది.
కాలుష్య తీవ్రత పెరుగుతున్నందునా వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఆరోగ్య శాఖ(Helath Ministry) ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. గర్భిణులు, వృద్ధులు, చిన్నారులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు కలుషిత వాతావరణంలో తిరగవద్దని కోరింది. వాయు నాణ్యత సూచీ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో అత్యవసరమైతే తప్పా ఎక్కువగా బయటకి రావద్దని పేర్కొంది.
"ధూమపానం ఆపేయండి. దోమల నివారణ కాయిల్స్ వాడకండి. కలప, ఆకులు, పంట అవశేషాలు కాల్చడం మానుకోండి. బయటకి వెళ్లివచ్చాక కళ్లను చన్నీటితో తప్పనిసరిగ్గా కడుక్కోండి. గోరువెచ్చటి నీటితో పుక్కిలించుకోండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఊపిరి ఆడకపోవడం, తల తిరగడం, దగ్గు, ఛాతీలో ఆసౌకర్యం లేదా నొప్పిగా ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లండి" అని సూచించింది. ఇవాళ ఉదయం 7 గంటలకు ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ 219 పాయింట్లుగా నమోదైంది. గురు, శుక్రవారాల్లో కురిసిన వర్షాలతో ప్రజలకు కాస్తంత ఉపశమనం లభించింది. దీపావళి పండుగ తరువాత వాయు నాణ్యత మరింతగా దిగజారుతుందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. అందరూ గ్రీన్ దీపావళి చేసుకోవాలని కోరుతోంది.
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) డేటా ప్రకారం వాయు నాణ్యత సూచి 0-50 మధ్య ఉంటే "మంచిది", 51-100 "సంతృప్తికరమైనది", 101-200 "మితమైన", 201-300 "పేలవమైనది", 301-400 "చాలా పేలవమైనది", 401-500 "తీవ్రమైనది"గా పరిగణిస్తారు. 500 కంటే ఎక్కువ AQI "అతి తీవ్రమైన" విభాగంలోకి వస్తుంది. కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో రాజధాని ప్రాంతంలో చేపడుతున్న పలు నిర్మాణ పనులపై ప్రభుత్వం ఇప్పటికే నిషేధం విధించింది.
ఢిల్లీ-ఎన్‌సీఆర్(Delhi - NCR Region) పరిధిలో అనవసరమైన నిర్మాణ కార్యకలాపాలను కేంద్ర కాలుష్య నియంత్రణ ప్యానెల్(Central Pollution Control Panel) నిషేధించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. కమీషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM) కూడా ఢిల్లీలో డీజిల్ వాహనాల రాకపోకల్ని నిషేధించింది. కాగా నిన్న సుప్రీంకోర్టు ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది.
పరిష్కారానికి చర్యలు తీసుకోకుండా, భారమంతా కోర్టుపైనే వేసే ప్రయత్నం మానుకోవాలని ఢిల్లీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. తాము పదేపదే జోక్యం చేసుకుంటేనే పరిష్కార చర్యల్లో వేగం వస్తుందా..? అంటూ మందలించింది. కాలుష్యం కారణంగా ఢిల్లీలో వాయు నాణ్యత దారుణంగా పడిపోతున్న అంశంపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా శుక్రవారం జస్టిస్ సంజయ్‌కిషన్ కౌల్(Justice Sanjay Kishan Kaul) నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
Updated Date - 2023-11-11T15:22:02+05:30 IST