Delhi High Court: భార్యలకు షాకిచ్చిన ఢిల్లీ హైకోర్టు.. అలాంటి పని చేస్తే విడాకులే!
ABN, First Publish Date - 2023-08-25T16:55:40+05:30
ఈరోజుల్లో చాలామంది మహిళలు సెపరేట్ కాపురం కావాలని కోరుకుంటున్నారు. అత్తమామలతో కలిసి ఉండటానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు. వాళ్లు తల్లిదండ్రుల్లాగా బాగా చూసుకున్నా సరే.. వేరే కాపురం పెట్టాల్సిందేనని...
ఈరోజుల్లో చాలామంది మహిళలు సెపరేట్ కాపురం కావాలని కోరుకుంటున్నారు. అత్తమామలతో కలిసి ఉండటానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు. వాళ్లు తల్లిదండ్రుల్లాగా బాగా చూసుకున్నా సరే.. వేరే కాపురం పెట్టాల్సిందేనని భర్తలపై ఒత్తిడి చేస్తుంటారు. ఈమధ్య విదేశీ సంస్కృతికి మనోళ్లు బాగా అలవాటు పడ్డారు కాబట్టి.. విదేశాల్లోలాగే ఇక్కడ కూడా పెళ్లైన వెంటనే వేరే కాపురం పెట్టాల్సిందిగా భర్తలను భార్యలు ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఒకవేళ భర్తలు ఒప్పుకోక.. కేసులు పెట్టి మరీ వేధింపులు పెడుతుంటారు. ఇలాగే ఒక మహిళ తన భర్తని దారిలోకి తెచ్చుకోవాలని చూసింది. చివరికి ఆ మహిళ తాను తీసిన గోతిలో తానే పడింది. ఢిల్లీ హైకోర్టు ఆమెకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఇదే టైంలో భార్యలందరికీ ధర్మాసనం ఒక స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
ఒక జంటకు 2002 ఏడాదిలో పెళ్లి అయ్యింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మొదట్లో వీరి సంసార జీవితం సాఫీగానే సాగింది కానీ, ఆ తర్వాత భార్య తన రాక్షసరూపం చూపించడం మొదలుపెట్టింది. తనని బాగా చూసుకున్నప్పటికీ.. అత్తమామలతో కలిసి ఉండటానికి ఇష్టపడలేదు. భర్తను వేరే కాపురం పెట్టాలని ఒత్తిడికి గురి చేయడం స్టార్ట్ చేసింది. పెళ్లైన కొంతకాలం నుంచే ఆమె వేరే కాపురం పెట్టాలని టార్చర్ పెట్టింది. క్రమంగా ఆ టార్చర్ మరింత పెరుగుతూ వచ్చింది. కానీ.. భర్త మాత్రం అందుకు ఒప్పుకోలేదు. తాను తల్లిదండ్రులతోనే కలిసి ఉంటానని, వేరే కాపురం పెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. దీంతో.. ఆ మహిళ తన భర్తను దారిలోకి తెచ్చుకోవడం కోసం సమాజంలో తమకు ఉండే మహిళ హక్కుల్ని అడ్డగోలుగా వాడుకుంది. తొలుత అత్తమామలు అధిక కట్నం కోసం వేధిస్తున్నారని ఫ్యామిలీ కోర్టుకి ఎక్కడింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. స్థానిక పోలీస్ స్టేషన్‌ను సంప్రదించింది. అప్పుడు మరిన్ని షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.
ఆ మహిళ తన భర్త కుటుంబంపై చాలాసార్లు ఫిర్యాదు చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఒకసారి అదనపు కట్నం కోసం అత్తింటివాళ్లు వేధిస్తున్నారని, మరోసారి తన మామ తనని అత్యాచారం చేయబోయాని ఫిర్యాదులు చేసినట్లు వెల్లడైంది. ఈ ఫిర్యాదుల గురించి ఫ్యామిలీ కోర్టుకు స్థానిక పోలీసులు తెలియజేశారు. అయితే.. తాను చేసిన ఆరోపణల్ని ఆ మహిళ నిరూపించకపోవడంతో, ఫ్యామిలీ కోర్టు ఆమె కేసుని కొట్టివేసింది. అప్పటికీ ఆమెలో మార్పు రాలేదు. వేరే కాపురం కావాల్సిందేనంటూ భర్తను మరింతగా వేధించడం మొదలుపెట్టింది. దీంతో.. తనకు భార్య నుంచి విడాకులు కావాలంటే ఆ భర్త 2007లో ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించాడు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతూ వచ్చింది. చూస్తుండగానే 16 సంవత్సరాలు గడిచాయి. ఎట్టకేలకు ఇన్నేళ్ల తర్వాత ధర్మాసనం తన తదుపరి తీర్పు ఇచ్చింది. వాదనలు విన్న తర్వాత ఆ మహిళకు ఊహించని షాకిస్తూ.. భర్తకు అనుకూలంగా తీర్పు వెల్లడించింది.
విదేశాల్లోలాగా భారత్‌లో పెళ్లికాగానే తల్లిదండ్రులను విడిచే సంస్కృతి లేదని, అది హిందూ సంప్రదాయానికి విరుద్ధమని ఢిల్లీ కోర్టు తెలిపింది. వృద్ధాప్యంలో తల్లిదండ్రుల్ని విడిచి వెళ్లడం నైతికంగా, చట్టపరంగా న్యాయం కాదని పేర్కొంది. తల్లిదండ్రుల విషయంలో కొడుకుకి కొన్ని బాధ్యతలు ఉంటాయని, వాటిని తప్పకుండా నెరవేర్చాల్సి ఉంటుందని కోర్టు చెప్పింది. అలాంటప్పుడు తల్లిదండ్రుల్ని వదిలి వేరే కాపురం పెట్టాలని భర్తను వేధించడం.. మానసిక క్రూరత్వం కిందకు వస్తుందని.. జస్టిస్ సురేశ్ కుమార్ కైట్, జస్టిస్ నీనా బన్సల్ కృష్ణలతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. ఇలా వేరే కాపురం కోసం ఒత్తిడికి గురి చేసే భార్యలకు విడాకులు ఇవ్వొచ్చని పేర్కొంటూ.. ఆ భర్తకు కోర్టు విడాకులు మంజూరు చేసింది.
Updated Date - 2023-08-25T16:56:40+05:30 IST