Delhi Liquor Scam: సిసోడియా కస్టడీ మే 23 వరకూ పొడిగింపు
ABN, First Publish Date - 2023-05-08T17:48:19+05:30
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జరుపుతున్న దర్యాప్తునకు సంబంధించి ఆప్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జ్యుడిషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు సోమవారంనాడు పొడిగించింది. ఈనెల 23వ తేదీ వరకూ ఆయన జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది.
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ (Delhi Excise Policy) కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జరుపుతున్న దర్యాప్తునకు సంబంధించి ఆప్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా (Manish Sisodia) జ్యుడిషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు సోమవారంనాడు పొడిగించింది. ఈనెల 23వ తేదీ వరకూ ఆయన జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది.
ఎక్సై్జ్ పాలసీకి సంబంధించిన రూ.622 కోట్ల నేరంపై సిసోడియాపై విచారణ కొనసాగుతున్నట్టు కోర్టుకు ఈడీ గత శనివారంనాడు తెలియజేసింది. దీంతో సప్లిమెంటరీ చార్జిషీటు సాఫ్ట్ కాపీని తమకు ఈనెల 8వ తేదీన అందజేయాలని కోర్టు ఆదేశించింది. సిసోడియాపై నమోదు చేసిన అనుబంధ ఛార్జిషీటును ఈనెల 10న పరిశీలిస్తామని కోర్టు తెలిపింది. కాగా, ఇప్పటికే సిసోడియాపై 2,000 పేజీల ఛార్జిషీటును ఈడీ నమోదు చేసింది.
బీజేపీ క్షమాపణలు చెప్పాలి...
మరోవైపు, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సరైన సాక్ష్యాలు లేవంటూ కేసులో నిందితులైన రాజేష్ జోషి, గౌతమ్ మల్హోత్రాలకు రౌస్ అవెన్యూ కోర్టు ఆదివారం బెయిల్ మంజూరు చేయడంపై ఆమ్ ఆద్మీ పార్టీ సోమవారంనాడు హర్షం వ్యక్తం చేసింది. లిక్కర్ కుంభకోణం అంతా బోగస్ అని, మొదట్నించి ఆ మాట తాము చెబుతూనే ఉన్నామని, ఇప్పుడు కోర్టులు కూడా అదే మాట చెబుతున్నాయంటూ ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఆప్ వంటి నిజాయితీ కలిగిన పార్టీపై నిరంతరం బురదచల్లే ప్రయత్నం బీజేపీ చేస్తోందని ఆరోపించారు. దీనిపై ఆప్ నేత, ఢిల్లీ మంత్రి అతిషి కూడా స్పందించారు. ఢిల్లీ ఎక్సైజ్ కేసులో ఇద్దరు నిందితులపై సరైన సాక్ష్యాలు లేకుండా ఆరోపణలు చేసినందుకు ఈడీని కోర్టు మందలించిందని, వారికి బెయిల్ మంజూరు చేసిందని తెలిపారు. కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్‌ను అప్రతిష్టపాలు చేసి, దేశాన్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
Updated Date - 2023-05-08T17:48:19+05:30 IST