Delhi Services Act: రాష్ట్రపతి ఆమోద ముద్ర.. చట్టరూపం సంతరించుకున్న ఢిల్లీ సర్వీసుల బిల్లు
ABN, First Publish Date - 2023-08-12T14:37:01+05:30
పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందిన ఢిల్లీ సర్వీసుల బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారంనాడు ఆమోదముద్ర వేశారు. దీంతో బిల్లు చట్టరూపం సంతరించుకుంది. ఈమేరకు భారత ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది.
న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందిన ఢిల్లీ సర్వీసుల బిల్లు (Delhi Sevices Bill)కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) శనివారంనాడు ఆమోదముద్ర వేశారు. దీంతో బిల్లు చట్టరూపం సంతరించుకుంది. ఈమేరకు భారత ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది.
ఉభయసభల్లోనూ...
ఢిల్లీ ప్రభుత్వంలోని సీనియర్ అధికారుల నియామకాలు, బదిలీలకు సంబంధించిన అధికారాన్ని కేంద్రానికి కట్టబెట్టే ఢిల్లీ సర్వీసుల బిల్లును ఆగస్టు 3న మూజువాణి ఓటుతో లోక్‌సభ ఆమోదించింది. ఓటింగ్‌కు ముందే విపక్ష పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయి. అటూ రాజ్యసభలోనూ గట్టి పోటీ ఎదురైనప్పటికీ బిల్లు గట్టెక్కింది. బిల్లుకు అనుకూలంగా 131 ఓట్లు పోలయ్యాయి. వ్యతిరేకంగా 102 ఓట్లు పడ్డాయి. 26 పార్టీల I.N.D.I.A. కూటమి నుంచి గట్టి ప్రతిఘటన ఎదురైనప్పటికీ, టీడీపీ, బీజేడీ, వైఎస్ఆర్‌సీపీ వంటి విపక్ష పార్టీలు బిల్లుకు అనుకూలంగా ఓటు వేశాయి.
ఢిల్లీపై చట్టాలు చేసే హక్కు పార్లమెంటుకు ఉంది...
తొలుత బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన హోం మంత్రి విపక్ష నేతల చర్చ అనంతరం సమాధానమిచ్చారు. విపక్ష పార్టీలు తమ కూటమిని నిలుపుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయని, ఢిల్లీ ఒక రాష్ట్రం కాదని, కేంద్రపాలిత ప్రాంతమని అన్నారు. ఢిల్లీకి సంబంధించి చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉందన్నారు. తాము ఢిల్లీ కోసం ఆలోచిస్తుంటే విపక్షాలు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాయని అన్నారు. దీనిపై కాంగ్రెస్ విపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి స్పందిస్తూ, బిల్లు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఇప్పుడు ఢిల్లీ, ఆ తర్వాత ఇతర రాష్ట్రాలకు ఇదే గతి పట్టవచ్చన్నారు. ఢిల్లీలోనే కుంభకోణాలు జరిగాయనుకుంటే, అందుకోసం బిల్లు తేవాల్సిన అవసరం ఉందా అని నిలదీశారు. ఈడీ, సీబీఐ వంటి సంస్థలు మీ చేతుల్లోనే ఉన్నందున వాటిని ఎందుకు ఉపయోగించుకోకూడదని ప్రశ్నించారు. ఆర్డినెన్స్ దారి పట్టి, హడావిడిగా బిల్లును తీసుకురావాల్సిన అవసరం ఏమందని అడిగారు. బిల్లునే నేరుగా తీసుకు రావచ్చు కదా అని ప్రశ్నించారు. అంత అసాధారణ పరిస్థితి ఏమొచ్చిందో సభకు చెప్పాలని అమిత్‌షాను కోరారు.
రాజ్యసభలోనూ 'షా' వాదన..
కేంద్ర ప్రభుత్వ అధికారుల్లో ఢిల్లీ ప్రభుత్వం చొరబడకుండా ఈ బిల్లు అడ్డుకుంటుందని అమిత్‌షా రాజ్యసభలో వాదన వినిపించారు. ఎక్సైజ్ స్కామ్‌కు సంబంధించిన ఫైళ్లు అక్కడ ఉన్నందునే విజిలెన్స్ శాఖ అధికారులను వాళ్లు (ఆప్ ప్రభుత్వం) బదిలీ చేశారని ఆరోపించారు.
Updated Date - 2023-08-12T14:59:49+05:30 IST