Upendra Kushwaha: నితీష్‌కు కుష్వాహ షాక్!.. జేడీయూకు గుడ్‌బై, కొత్త పార్టీ ప్రకటన
ABN, First Publish Date - 2023-02-20T16:32:10+05:30
బీహార్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కొద్దికాలంగా జేడీయూ పనితీరుపై అసంతృప్తితో ఉన్న ఆ పార్టీ సీనియర్ నేత ఉపేంద్ర కుష్వాహ..
పాట్నా: బీహార్ (Bihar) రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కొద్దికాలంగా జేడీయూ (JD-U) పనితీరుపై అసంతృప్తితో ఉన్న ఆ పార్టీ సీనియర్ నేత ఉపేంద్ర కుష్వాహ (Upendra Kushwaha) ఎట్టకేలకు కీలక నిర్ణయం తీసుకున్నారు. జేడీయూకు ఆయన సోమవారంనాడు రాజీనామా చేశారు. 'రాష్ట్రీయ లోక్ జనతా దళ్' అనే కొత్త పార్టీని స్థాపించనున్నట్టు ప్రకటించారు.
''ఇవాళ నుంచి కొత్త రాజకీయ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నాయి. కొద్ది మంది మినహా జేడీయూలోని ప్రతి ఒక్కరూ ఆందోళనగానే ఉన్నారు. ఎన్నికైన నా సహచర మిత్రులతో సంప్రదించి, రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. మొదట్నో నితీష్ చాలా మంచిగా ఉండేవారు. కానీ చివరికి వచ్చే సరికి ఆయన ఎంచుకున్న మార్గం ఆయనకే కాకుండా బీహార్‌కు కూడా చేటు చేయనుంది'' అని మీడియా సమావేశంలో మాట్లాడుతూ కుష్వాహ అన్నారు.
కొత్త పార్టీ... రాష్ట్రీయ లోక్ జనతా దళ్
కొత్తగా రాష్ట్రీయ లోక్ జనతాదళ్ పార్టీని ఏర్పాటు చేయాలని తాము నిర్ణయించినట్టు కుష్వాహ తెలిపారు. ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. పార్టీకి తాను జాతీయ అధ్యక్షుడిగా ఉంటానని, కర్పూరి ఠాకూర్ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తామని అన్నారు.
నితీష్‌తో విభేదాలు
ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు, 62 ఏళ్ల ఉపేంద్ర కుష్వాహకు మధ్య ఇటీవల కాలంలో అభిప్రాయ భేదాలు పొడచూపాయి. 2021 మార్చిలో ఉపేంద్ర కుష్వాహ తన సొంత పార్టీ అయిన రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్‌పీ)ని జేడీయూలో విలీనం చేశారు. అయితే, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌కు తన మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి పదవిని నితీష్ కట్టబెట్టినప్పటి నుంచి కుష్వాహ వర్గీయుల్లో అసంతృప్తి నెలకొంది. నితీష్ తనను నిర్లక్ష్యం చేశారనే అభిప్రాయంతో కుష్వాహ ఉన్నారు. కుష్వాహకు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వనున్నారంటూ ఆయన వర్గీయులు ప్రచారం చేయడం, అలాంటిదేమీ లేదని నితీష్ తేల్చిచెప్పడంతో మరోసారి కుష్వాహకు ఆశాభంగమైంది. ఇటీవల ఢిల్లీలో వైద్యపరీక్షలకు వెళ్లిన కుష్వాహ కొందరి బీజేపీ నేతలతో ఉన్న ఫోటో బయటకు వచ్చింది. ఇది కుష్వాహ ఆదేశాలతో ఆయన వర్గీయులు చేసిన పనేనని నితీష్ అనుమానించడంతో విభేదాలు మరింత ముదిరాయి. పార్టీ కట్టుబాట్లను పాటించే విషయంలో ఎవరూ అతీతులు కాదని, తమ పార్టీ ఇచ్చిన గౌరవం ఏ పార్టీ ఇవ్వదని పరోక్షంగా కుష్వాహను ఉద్దేశించి నితీష్ వ్యాఖ్యానించడం, తనను సమావేశాలకు పిలవడం లేదంటూ కుష్వాహ బహిరంగంగా చెప్పడం వంటి వరుస పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే జేడీయూకు రాజీనామా చేయడంతో పాటు సొంత పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు కుష్వాహ ప్రకటించడం విశేషం.
Updated Date - 2023-02-20T16:32:12+05:30 IST