DK. Shivakumar: ప్రధానిని ఎదిరించే ధైర్మం లేని నేతల వల్లే రాష్ట్ర ప్రయోజనాలకు దెబ్బ
ABN, First Publish Date - 2023-09-16T13:10:44+05:30
ప్రధానిని ఎదిరించే ధైర్మం లేని బీజేపీ నేతల వల్లే రాష్ట్ర ప్రయోజనాలకు భంగం ఏర్పడుతోందని కాంగ్రెస్ విరుచుకుపడింది.
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): ప్రధానిని ఎదిరించే ధైర్మం లేని బీజేపీ నేతల వల్లే రాష్ట్ర ప్రయోజనాలకు భంగం ఏర్పడుతోందని కాంగ్రెస్ విరుచుకుపడింది. ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్(DK. Shivakumar) నగరంలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కావేరితో పాటు జల వివాదాలపై చర్చించేందుకు అపాయింట్‌మెంట్ కోసం ప్రధాని కార్యాలయానికి లేఖ రాసినా ఇంతవరకు స్పందన రాలేదన్నారు. రాష్ట్రంలో బీజేపీకి 26 మంది లోక్‌సభ సభ్యులు ఉన్నారని కావేరి జల వివాదం విషయంలో ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi)కి వాస్తవాలను వివరించేందుకు ఎందుకు చొరవ తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కావేరి వివాదం విషయంలో కాంగ్రెస్ రాజకీయం చేస్తోందన్న బీజేపి నేత విమర్శలను ఆయన తిప్పికొట్టారు. తాజా పరిణామాలు గమనిస్తే ఎవరురాజకీయం చేస్తున్నారో స్పష్టంగా తెలుస్తోందన్నారు. ఇటీవలి అత్యవసర సమావేశానికి బీజేపి ముఖ్య నేతలు హాజరుకాలేదని ఆయన గుర్తుచేశారు. కేంద్ర పర్యావరణ శాఖ నుంచి ఎన్‌ఓసి తీసుకొచ్చే విషయంలో బీజేపి ఎంపీలు సహకరించి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. కావేరిజలాల విషయంలో న్యాయనిపుణుల సలహామేరకే నిర్ణయాలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. తానే స్వయంగా జైపూర్‌కు వెళ్ళి కేంద్ర జలవనరుల శాఖా మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్‌కు మొత్తం పరిస్థితిని కూలంకుషంగా వివరించానని ప్రభుత్వం తరుపున లేఖకూడా అందజేశానని డిసిఎం వివరించారు.
Updated Date - 2023-09-16T13:10:44+05:30 IST