DK Shivakumar: డీకే నామినేషన్‌కు ఈసీ ఆమోదం, పోటీ ఎవరి మధ్యనంటే..?
ABN, First Publish Date - 2023-04-21T14:53:15+05:30
కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ నామినేషన్‌కు ఎన్నికల కమిషనర్ శుక్రవారంనాడు..
బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ (DK Shivakumar) నామినేషన్‌కు ఎన్నికల కమిషనర్ (Election Commission) శుక్రవారంనాడు ఆమోదం తెలిపింది. దీంతో కనకపుర (Kanakapura) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన పోటీకి మార్గం సుగమమైంది. డీకేపై బీజేపీ అభ్యర్థిగా రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఆర్.అశోక పోటీలో ఉన్నారు.
కనకపుర నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన డీకే శివకుమార్ గత సోమవారంనాడు తన మద్దతుదారులతో కలిసి వెళ్లి నామినేషన్ వేశారు. తన నామినేషన్ రద్దు చేసే అవకాశాలను కూడా దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తగా ఆయన తన సోదరుడు, బెంగళూరు రూరల్ ఎంపీ డీకే సురేష్‌తో కూడా కనకపుర నియోజకవర్గం నుంచి నామినేషన్ వేయించారు. పార్టీ బ్యాకప్ అభ్యర్థిగా డీకే సురేష్ నామినేషన్ వేశారు.
మనీ లాండరింగ్, పన్ను ఎగవేతలకు సంబంధించిన ఆరోపణలపై ఈడీ, ఆదాయం పన్ను శాఖ కేసులను డీకే శివకుమార్ ఎదుర్కొంటున్నారు. తాను ఎలాంటి తప్పూ చేయలేదని, బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తనపై రాజకీయ కక్ష సాధించాలని అనుకుంటోందని డీకే చెబుతున్నారు.
కాగా, బీజేపీ వ్యూహాత్మకంగా కనకపుర నుంచి పార్టీ అభ్యర్థిగా ఆర్.అశోకను నిలబెట్టింది. వొక్కలిగ సామాజిక వర్గానికి చెందిన అశోక్‌కు మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప సన్నిహితుడిగా కూడా పేరుంది. రామనగర జిల్లాలోన కనకపుర నియోజకవర్గంలో వొక్కలిగ సామాజిక వర్గానికి గట్టి పట్టుంది. 60 శాతం మంది ఓటర్లు ఈ సామాజిక వర్గానికి చెందినవారే ఉన్నారు. మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, మే 13న ఓట్లు లెక్కించి, ఫలితాలు ప్రకటించనున్నారు.
Updated Date - 2023-04-21T14:55:40+05:30 IST