DMK: ఏమిటిది గవర్నర్ సార్?
ABN, First Publish Date - 2023-04-08T10:04:58+05:30
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన డీఎంకే(DMK) ప్రభుత్వం శాసనసభలో వివిధ చట్టాలకు సంబంధించి చేసిన బిల్లులను ఆమోదించకుండా పెండింగ్‌లో ఉంచి,
చెన్నై, (ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన డీఎంకే(DMK) ప్రభుత్వం శాసనసభలో వివిధ చట్టాలకు సంబంధించి చేసిన బిల్లులను ఆమోదించకుండా పెండింగ్‌లో ఉంచి, అనుచిత వ్యాఖ్యలు, విమర్శలు చేస్తున్న రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి(Governor RN Ravi) తీరును ఖండిస్తూ ఈ నెల 12న ధర్నా నిర్వహించనున్నట్లు డీఎంకే మిత్రపక్షాలు ప్రకటించాయి. ఈ ఆందోళన సందర్భంగా రాజ్‌భవన్‌ను ముట్టడించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు డీఎంకే కోశాధికారి, ఎంపీ టీఆర్ బాలు, ద్రవిడ కళగం నేత కే.వీరమణి, టీఎన్‌సీసీ అధ్యక్షుడు కే.ఎస్.అళగిరి(K. S. Alagiri), ఎండీఎంకే నేత వైగో సహా 11 పార్టీల నేతలు సంయుక్తంగా శుక్రవారం ఓ ప్రకటన జారీ చేశాయి. గవర్నర్‌గా ఆర్‌ఎన్ రవి పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి డీఎంకే ప్రభుత్వానికి, ఆ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా బహిరంగ సభలలో విమర్శలు, ఆరోపణలు చేయడమే కాకుండా అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించిన వివిధ బిల్లులను ఆమోదించకుండా కేంద్రంలోని బీజేపీ పాలకులకు సేవకుడిగా, ఆర్‌ఎస్ఎస్(RSS) కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని ఆ ప్రకటనలో నాయకులు ధ్వజమెత్తారు. తమిళులంతా పంచమవేదంలా భావించే తిరుక్కురళ్‌కు సైతం గవర్నర్ రవి వక్రభాష్యాలు చెబుతున్నారని, తాను రాష్ట్ర ప్రభుత్వం చేసే బిల్లులను పెండింగ్‌లో ఉంచితే వాటికి తన అనుమతి లేనట్లేనని భావించాలని కాబోయే ఐఏఎస్ అభ్యర్థుల సమావేశంలో ప్రకటించడం రాజ్యాంగ ధర్మాసనానికి వ్యతిరేకమని విరుచుకుపడ్డారు. అన్నింటికి మించి స్టెరిలైట్ కాపర్ కర్మాగారానికి వ్యతిరేకంగా రైతులు జరిపిన ఆందోళనను తప్పుబడుతూ తీవ్రవాద సంస్థ నిధులతోనే ఆ ఆందోళన జరిగిందని గవర్నర్ ప్రకటించడం వాస్తవాలకు వ్యతిరేకంగా ఉన్నాయని, ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే పనిగా పెట్టుకుని తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం మానుకున్నారని టీఆర్ బాలు సహా నేతలు విమర్శించారు. డీఎంకే ఎప్పుడూ గవర్నర్ పదవులే అనవసరమే భావనతో వ్యవహరిస్తుందన్నారు. రాష్ట్రంలో పోటీ ప్రభుత్వం జరపాలనే దురుద్దేశంతో ఉన్న గవర్నర్ ఆర్‌ఎన్ రవి వ్యాఖ్యలపట్ల నిరసన వ్యక్తం చేస్తూ ఈ నెల 12న సాయంత్రం నాలుగు గంటలకు డీఎంకే కూటమిలోని 11 పార్టీల ఆధ్వర్యంలో వేలాదిమంది కార్యకర్తలతో ధర్నా జరిపి రాజ్‌భవన్‌ను ముట్టడించనున్నామని ఆయన చెప్పారు. ఈ ఆందోళనకు ప్రజాస్వామ్యవాదులంతా గట్టి మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Updated Date - 2023-04-08T10:04:58+05:30 IST