Karnataka Assembly Election Results : హిజాబ్ ధారణపై నిషేధాన్ని అమలు చేసిన మంత్రి దారుణ ఓటమి
ABN, First Publish Date - 2023-05-13T19:25:00+05:30
కర్ణాటక విద్యా సంస్థల్లో హిజాబ్ ధారణపై నిషేధాన్ని అమలు చేసిన విద్యా శాఖ మంత్రి బీసీ నగేష్ శాసన సభ ఎన్నికల్లో పరాజయంపాలయ్యారు.
బెంగళూరు : కర్ణాటక విద్యా సంస్థల్లో హిజాబ్ ధారణపై నిషేధాన్ని అమలు చేసిన విద్యా శాఖ మంత్రి బీసీ నగేష్ శాసన సభ ఎన్నికల్లో పరాజయంపాలయ్యారు. ఆయన ముస్లింలను ఆర్థికంగా బాయ్‌కాట్ చేయాలని కూడా పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఆయన టిప్టూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి, ఓడిపోయారు.
బీసీ నగేష్‌కు 54,347 ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి కే షడాక్షరికి 71,999 ఓట్లు లభించాయి. జేడీఎస్ అభ్యర్థి శాంత కుమారకు 25,811 ఓట్లు లభించాయి.
టిప్టూర్ నియోజకవర్గం నుంచి 2008లో బీసీ నగేష్ గెలిచారు. షడాక్షరి 2013లో ఆయనను ఓడించారు. 2018లో మళ్లీ షడాక్షరిని నగేష్ ఓడించారు. 2021లో బసవరాజ్ బొమ్మయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో విద్యా శాఖ మంత్రిగా నగేష్ ప్రమాణ స్వీకారం చేశారు.
ఇదిలావుండగా, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ బీజేపీ చేసిన ప్రచారానికి ప్రజలు ఆకర్షితులు కాలేదు. అభివృద్ధి చేస్తామని చెప్తూనే, హిందుత్వ రాజకీయాలు చేసినా ఫలితం దక్కలేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi), కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రచారం పెద్దగా ప్రభావం చూపలేదు. 2018లో ఆ పార్టీకి 104 స్థానాలు రాగా, ఈ ఎన్నికల్లో కేవలం 64 స్థానాలు మాత్రమే లభించాయి. దీంతో దక్షిణాది రాష్ట్రాల్లో ఎదగాలనే ఆకాంక్షలకు గట్టి దెబ్బ తగిలింది. ఈ ప్రాంతంలో కర్ణాటకలో మాత్రమే ఆ పార్టీకి బలమైన కేడర్ ఉంది.
ఈ ఘోర పరాజయానికి కారణాలు చాలా ఉన్నాయని బీజేపీ నేతలు చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, అసంతృప్తి ఉన్నాయని, ముఖ్యమంత్రి పదవీ కాలం ముగియకుండానే అర్థాంతరంగా మార్చడం, స్థానిక సమస్యలను పక్కనబెట్టి, సైద్ధాంతిక ఎజెండాను ప్రచారం చేయడం వంటివాటి వల్ల ఓడిపోయామని చెప్తున్నారు.
లింగాయత్ సామాజిక వర్గంలో బలమైన నాయకుడైన బీఎస్ యెడియూరప్పను ఎన్నికలకు రెండేళ్ల ముందు మార్చి, బసవరాజ్ బొమ్మయ్‌ను ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టడం తీవ్ర ప్రభావం చూపిందని సీనియర్ బీజేపీ నేత ఒకరు చెప్పారు. ప్రజల జీవితాల్లో మార్పు కోసం తాము చేసిన కృషిని ప్రజలకు చెప్పలేకపోయామని వాపోయారు. వొక్కళిగలు, కురుబలు వంటివారితో సత్సంబంధాలను పెచుకోలేకపోయామని, యెడియూరప్పను పదవీచ్యుతుడిని చేయడం ద్వారా లింగాయత్‌ల మద్దతును కోల్పోయామని వాపోయారు. బొమ్మయ్ కూడా లింగాయత్ సామాజిక వర్గానికి చెందినవారే అయినప్పటికీ, ఆయనకు యెడియూరప్పకు ఉన్నంత ప్రజాదరణ లేదని తెలిపారు. మరోవైపు ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణలను బొమ్మయ్ తిప్పికొట్టలేకపోయారని వాపోయారు. అయితే బొమ్మయ్ నిష్కళంక చరితుడని చెప్పారు.
ఇవి కూడా చదవండి :
JDS KumaraSwamy: కుమారస్వామి గెలిచారు కానీ కొడుకును గెలిపించుకోలేకపోయారు.. అమ్మ త్యాగం వృధా..!
DK Shivakumar: భావోద్వేగంతో కంటతడి పెట్టిన డీకే
Updated Date - 2023-05-13T19:25:00+05:30 IST