Punjab: విద్వేషకుల భరతం పడతాం: భగవంత్ మాన్
ABN, First Publish Date - 2023-03-21T13:47:14+05:30
చిక్కినట్టే చిక్కి తప్పించుకున్న ఖలీస్థానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసుల వేట నాలుగోరోజైన..
చండీగఢ్: చిక్కినట్టే చిక్కి తప్పించుకున్న ఖలీస్థానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసుల వేట నాలుగోరోజైన మంగళవారంనాడు కూడా కొనసాగుతోంది. దీనిపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ (Bhagwant Singh Mann) తొలిసారి పెదవి విప్పారు. పంజాబ్‌లో శాంతి, సామరస్యం కాపాడటం, దేశప్రగతి ఆప్ ప్రభుత్వ ప్రాధాన్యతలని చెప్పారు. వివిధ క్రిమినల్ కేసుల్లో వాంటెడ్‌గా ఉన్న 'వారిస్ పంజాబ్ దే' సంస్థ చీఫ్ అమృత్‌పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు గత ఆదివారం నుంచి విస్తృతంగా గాలిస్తున్నారు. ఈ స్పెషల్ ఆపరేషన్‌లో 100 మందికి పైగా వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
పంజాబ్ పరిణామాలపై భగవంత్ మాన్ మాట్లాడుతూ.. ''గత కొద్ది రోజులుగా విదేశీ శక్తుల సాయంతో కొందరు పంజాబ్ వాతావరణానికి చెడగొడుతూ, విద్వేష ప్రసంగాలు చేస్తున్నారు. వారిపై చర్యలు తీసుకుంటాం. అరెస్టు చేసి కఠినంగా శిక్షిస్తాం. పంజాబ్ శాంతికి విఘాతం కలిగించే శక్తులను ఎట్టిపరిస్థితిల్లోనూ విడిచిపెట్టే ప్రసక్తే లేదు'' అని అమృత్‌పాల్, అతని సహచరులను ఉద్దేశించి అన్నారు. మిత్రత్వం, శాంతి గురించి పంజాబీలకు బాగా తెలుసునని, అయితే రెచ్చగొట్టే వ్యవహారాలు నడిపితే తాము కూడా గట్టి సమాధానం చెబుతామని అన్నారు.
పలుచోట్ల మెబైల్ సర్వీసులు పునరుద్ధరణ
మరోవైపు, ముందుజాగ్రత్త చర్యగా రాష్ట్రంలో నిలిపివేసిన మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులను మంగళవారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత పలు ప్రాంతాల్లో పునరుద్ధరించారు. తర్న్ తరన్, ఫెరోజ్‌పూర్, మొగ, సంగ్రూర్, సబ్‌డివిజన్ అజ్నాల, వైపీఎస్ నగర్, విమానాశ్రయానికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో మాత్రం సర్వీసుల సస్పెన్షన్ కొనసాగుతోంది.
Updated Date - 2023-03-21T13:47:14+05:30 IST