G20 Presidency : చైనా రుణ వలపై మోదీ వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-08-26T13:19:37+05:30
ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం నుంచి దేశాలు తమను తాము కాపాడుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు. చైనాను పరోక్షంగా ప్రస్తావిస్తూ, ఇతర దేశాల సంక్షోభాలను తమకు అనుకూలంగా మార్చుకుంటూ, ఆ దేశాలను దోపిడీ చేసే శక్తులు ఉన్నాయన్నారు.
న్యూఢిల్లీ : ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం నుంచి దేశాలు తమను తాము కాపాడుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) సూచించారు. చైనాను పరోక్షంగా ప్రస్తావిస్తూ, ఇతర దేశాల సంక్షోభాలను తమకు అనుకూలంగా మార్చుకుంటూ, ఆ దేశాలను దోపిడీ చేసే శక్తులు ఉన్నాయన్నారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కొన్ని శక్తులు ఇతర దేశాల రుణ సంక్షోభాలను తమకు అనుకూలంగా మలచుకుంటున్నాయన్నారు. ఇతర దేశాల బలహీనతలను ఆసరాగా చేసుకుని, వాటిని రుణ వలలోకి దింపి, దోచుకుంటున్నాయని చెప్పారు. ఇతర దేశాల నిస్సహాయత నుంచి లబ్ధి పొందాలని చూసే శక్తులు ఉన్నాయన్నారు. అన్ని దేశాలకు ఆర్థిక క్రమశిక్షణ అవసరమేనని చెప్పారు. ఆర్థిక క్రమశిక్షణారాహిత్యం నుంచి తనను తాను ప్రతి దేశం కాపాడుకోవాలన్నారు. కెన్యా, జాంబియా, లావోస్, మంగోలియా, పాకిస్థాన్ వంటి దేశాలకు చైనా పెద్ద మొత్తంలో రుణాలు ఇచ్చి, వాటిని పీడిస్తున్న సంగతి తెలిసిందే.
ఆదాయం అతి తక్కువగా, మధ్య స్థాయిలో ఉన్న దేశాల రుణ బాధలను పరిష్కరించేందుకు జీ20 కట్టుబడి ఉందని మోదీ చెప్పారు. 2030నాటికి సుస్థిర అభివృద్ధిని సాధించాలనే లక్ష్యం నెరవేరాలంటే ఈ దేశాలు కూడా అభివృద్ధి చెందడం తప్పనిసరి అని చెప్పారు. ఈ దేశాల అభివృద్ధికి రుణాలే ఆటంకంగా మారుతున్నాయన్నారు.
జీ20కి భారత దేశం అధ్యక్షత వహించిన సమయంలో సాధించిన విజయాల గురించి మోదీ మాట్లాడుతూ, జీ20 దేశాల కూటమికి 2023లో భారత దేశం అధ్యక్షత వహిస్తోందని, కామన్ ఫ్రేమ్‌వర్క్ ద్వారా రుణాల రీస్ట్రక్చరింగ్‌ను చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రోత్సహించామని తెలిపారు. భారత దేశం దృష్టి పెట్టడంతో, జాంబియా, ఇథియోపియా, ఘనా దేశాలు చెప్పుకోదగ్గ ప్రగతి సాధించాయన్నారు. ముఖ్యమైన రుణదాతగా భారత దేశం కీలక పాత్ర పోషించిందన్నారు. ఈ కామన్ ఫ్రేమ్‌వర్క్‌కు అతీతంగా జీ20 ఫోరమ్స్ శ్రీలంకలో రుణాల రీస్ట్రక్చరింగ్ కోసం సమన్వయంతో పని చేశాయన్నారు. భారత్, జపాన్, ఫ్రాన్స్ సహాధ్యక్షతన కల కమిటీ ఈ ప్రక్రియలో చాలా ముఖ్యమైన పాత్రను పోషించిందని చెప్పారు.
ఇవి కూడా చదవండి :
Chandrayaan-3 : చంద్రయాన్-3 విజయోత్సవాలు.. ఇస్రో శాస్త్రవేత్తల సమక్షంలో మోదీ భావోద్వేగం..
Smart Cities Awards : ఇండోర్ అత్యుత్తమ స్మార్ట్ సిటీ.. మధ్య ప్రదేశ్ అత్యుత్తమ రాష్ట్రం..
Updated Date - 2023-08-26T13:19:37+05:30 IST