Agniveers : అగ్నివీరులకు కేంద్రం శుభవార్త!
ABN, First Publish Date - 2023-03-17T11:35:31+05:30
అగ్నివీరులను అతి తక్కువ వయసులోనే బయటకు పంపించేస్తున్నారనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు
న్యూఢిల్లీ : అగ్నివీరులను అతి తక్కువ వయసులోనే బయటకు పంపించేస్తున్నారనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకుంటోంది. మాజీ అగ్నివీరులకు బీఎస్‌ఎఫ్ (BSF-సరిహద్దు భద్రతా దళం) ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పిస్తూ ఓ వారం క్రితం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా తాజాగా కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (CISF) ఉద్యోగాల్లో కూడా 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
అగ్నివీర్ (Agniveer) తొలి బ్యాచ్, ఆ తర్వాతి బ్యాచ్‌లలో చేరినవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడం కోసం గరిష్ఠ వయో పరిమితిని కూడా సడలిస్తున్నట్లు ప్రకటించింది. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం చట్టం, 1968 ప్రకారం రూపొందించిన నిబంధనలను సడలించి ఈ మేరకు ఓ నోటిఫికేషన్‌ను కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ‘‘మాజీ అగ్నివీరుల కోసం 10 శాతం ఖాళీలు కేటాయించబడతాయి’’ అని ఈ నోటిఫికేషన్ పేర్కొంది. అగ్నివీరుల మొదటి బ్యాచ్‌లో చేరినవారికి గరిష్ఠ వయోపరిమితిని ఐదేళ్ళ వరకు సడలిస్తున్నట్లు, ఆ తర్వాతి బ్యాచ్‌లవారికి గరిష్ఠ వయోపరిమితిని మూడేళ్ళ వరకు సడలిస్తున్నట్లు తెలిపింది. వయోపరిమితి సడలింపుతోపాటు శారీరక దారుఢ్య పరీక్షల్లో కూడా మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపింది.
రక్షణ దళాల్లో నియామకాల కోసం అగ్నివీర్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం (Central Government) గత ఏడాది జూన్ 14న ప్రారంభించిన సంగతి తెలిసిందే. 17 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్కులు ఈ పథకం క్రింద దరఖాస్తు చేసుకోవచ్చు. సైన్యం/వాయు సేన/నావికా దళంలో నాలుగేళ్లపాటు వీరిని కాంట్రాక్టు పద్ధతిలో నియమిస్తారు. వీరిని అగ్నివీరులని పిలుస్తారు. నాలుగేళ్ళు పూర్తి చేసుకున్న అగ్నివీరుల్లో 25 శాతం మందిని రెగ్యులర్ సర్వీస్‌లో నియమిస్తారు. మిగిలిన 75 శాతం మందికి కేంద్ర పారామిలిటరీ దళాలు, అస్సాం రైఫిల్స్‌లలో 10 శాతం ఉద్యోగాలను రిజర్వు చేస్తామని అప్పట్లో ప్రభుత్వం తెలిపింది.
పారామిలిటరీ (Paramilitary) దళాల్లో నియామకాలకు వయో పరిమితి 18 నుంచి 23 సంవత్సరాలు. అగ్నిపథ్ (Agnipath) పథకంలో మొదటి బ్యాచ్‌లో చేరినవారు... నియమితులైన సమయంలో వారి వయసునుబట్టి వయపరిమితి సడలింపును పొందుతారు. ఉదాహరణకు 21 సంవత్సరాల వయసులో చేరినవారు ఈ నాలుగేళ్లు పూర్తయిన తర్వాత 30 సంవత్సరాలు వచ్చినప్పటికీ సీఐఎస్ఎఫ్ రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకంలో తర్వాతి బ్యాచ్‌లలో చేరినవారు గరిష్ఠంగా 28 సంవత్సరాల వయసు వరకు సీఐఎస్ఎఫ్ రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
పారామిలిటరీ దళాల్లోకి అగ్నివీరులను తీసుకోవడానికి హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించడం వల్ల మాజీ అగ్నివీరులు రిటైర్‌మెంట్ వయసు వరకు ఉద్యోగావకాశాలను పొందడానికి వీలవుతుంది. మరోవైపు పారామిలిటరీ దళాలకు కూడా ఇది ప్రయోజనకరమే. 84,800 ఖాళీలను భర్తీ చేయడం కోసం శిక్షణ పొందిన అభ్యర్థులు లభించడం ప్రయోజనకరమే.
ఇవి కూడా చదవండి :
weddings: భర్తలతో పాటు భార్యలకు కూడా తప్పడం లేదు..
Karnataka : బంగ్లాదేశీయుల రాకతో మన సంస్కృతికి ముప్పు : హిమంత బిశ్వ శర్మ
Updated Date - 2023-03-17T11:36:34+05:30 IST