Maharashtra: మళ్లీ చేతులు మారనున్న సీఎం పగ్గాలు.. బీజేపీ కొత్త గేమ్‌ప్లాన్..!
ABN, First Publish Date - 2023-04-25T15:57:40+05:30
మహారాష్ట్రలో మరో 'మహా' ట్విస్ట్ చోటుచేసుకోనుందా?. అధికార ఎన్డీయే కూటమి సర్కారులో మార్పులు చేర్పులు..
ముంబై: మహారాష్ట్ర (Maharashtra)లో మరో 'మహా' ట్విస్ట్ చోటుచేసుకోనుందా?. అధికార ఎన్డీయే (NDA) కూటమి సర్కారులో మార్పులు చేర్పులు చోటుచేసుకోనున్నాయా?. అవుననే బలమైన సంకేతాలు వెలువడుతున్నాయి. ఆ ప్రకారం, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis) తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టబోతున్నారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) నుంచి సీఎం పగ్గాలను ఆయన తన చేతిల్లోకి తీసుకుని, షిండేకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వనున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (మే 10) తర్వాత ఏరోజైనా ఈ తాజా పరిణామం చోటుచేసుకునే అవకాశం ఉందని బీజేపీ అతర్గత వర్గాల సమాచారం.
ప్రభుత్వంలో చోటుచేసుకోనున్న ఈ మార్పులు, చేర్పులు చుట్టూ ఎన్‌సీపీ నేత అజిత్ పవార్ పేరు కూడా వినిపిస్తుండటం ఆసక్తికరం. అజిత్ పవార్, ఆయన మద్దతుదారులు బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని బలంగా వినిపిస్తుండగా, అదే జరిగితే ఫడ్నవిస్ టీమ్‌లో అజిత్ పవార్, షిండేలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇస్తారని తెలుస్తోంది.
ఎందుకీ మార్పులు?
దేవేంద్ర ఫడ్నవిస్‌కు మళ్లీ సీఎం పగ్గాలు అప్పగించాలనే బీజేపీ వ్యూహం వెనుక పలు కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. బీజేపీ ఇటీవల జరిపించిన సర్వేలో 2024 లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని 48 లోక్‌సభ స్థానాల్లో 22 నుంచి 25 సీట్లు బీజేపీ గెలుచుకుంటుందని తేలింది. ఈ క్రమంలో షిండే వర్గానికి ఎక్కువ ప్రయోజనం కలగకుండా చూడాలని బీజేపీ ఆలోచనగా తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా డ్రైవర్ సీటులో కూర్చునేందుకు బీజేపీ మొగ్గుచూపుతోంది. ఇదే సమయంలో షిండే పనితీరుపై కొందరు బీజేపీ మంత్రులు, నేతల్లో కూడా ఇటీవల కాలంలో అసంతృప్తి పెరిగింది. పలు ఫైళ్లకు సీఎం ఆమోదం తెలపడం లేదని బీజేపీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర యూనిట్ సైతం పార్టీ అధిష్ఠానం దృష్టికి చెచ్చింది. అయితే, కర్ణాటక ఎన్నికల వరకూ వేచిచూడాల్సిందిగా అధిష్ఠానం అసంతృప్తి నాయకులకు సూచించినట్టు సమాచారం.
అజిత్ పవార్ స్పందన
ఎన్‌సీపీ నేత అజిత్ పవార్ ఇటీవల బహిరంగంగానే సీఎం కావాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఇందుకోసం 2024 అసెంబ్లీ ఎన్నికల వరకూ వేచిచూడాల్సిన పనిలేదని కూడా వ్యాఖ్యానించారు. దీంతో ఆయన, ఆయన అనుచరులు బీజేపీలో చేరడం ఖాయమనే సంకేతాలు వెలువడ్డాయి. అయితే, జూనియర్ పవార్ (అజిత్ పవార్) మరోసారి యూటర్న్ తీసుకున్నారు. తాను ఎప్పటికీ ఎన్‌సీపీలోనే ఉంటానని, పార్టీని విడిచిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు.
Updated Date - 2023-04-25T16:01:21+05:30 IST