Manipur video : మహిళలను నగ్నంగా ఊరేగించడానికి కారణం వదంతులే : మణిపూర్ పోలీసులు
ABN, First Publish Date - 2023-07-21T10:32:27+05:30
మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనకు కారణం వదంతులేనని మణిపూర్ పోలీసు వర్గాలు తెలిపాయి.
న్యూఢిల్లీ : మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనకు కారణం వదంతులేనని మణిపూర్ పోలీసు వర్గాలు తెలిపాయి. ఢిల్లీలో ఓ మహిళ అత్యాచారానికి గురయ్యారని, అయితే ఆ దుర్ఘటన మణిపూర్‌లో జరిగినట్లు, బాధితురాలు ఆ రాష్ట్రంలోని ఓ తెగకు చెందిన మహిళ అని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడంతో కొందరు రెచ్చిపోయి ఈ దారుణానికి పాల్పడ్డారని చెప్పాయి.
మణిపూర్ పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, ప్లాస్టిక్ షీట్‌ను కప్పుకున్న ఓ మహిళ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ మహిళ మణిపూర్‌లోని ఓ తెగకు చెందినవారని, ఆమెపై అత్యాచారం జరిగిందని ప్రచారం చేశారు. అయితే ఈ అత్యాచారం ఢిల్లీలో జరిగిందని ఆ తర్వాత వెల్లడైంది. ఈ వదంతులు ప్రచారమవడంతో కొందరు వ్యక్తులు కాంగ్పొక్పిలో ఐదుగురిని అపహరించారు. ఈ సంఘటన మే 4న జరిగింది. అంతకుముందు రోజు నుంచే రాష్ట్రంలో హింసాకాండ ప్రారంభమైంది.
పోలీసు కంప్లయింట్ ప్రకారం, అత్యాధునిక ఆయుధాలతో దాదాపు 1000 మంది బీ ఫైనోమ్ గ్రామంలోకి దూసుకెళ్లి, విధ్వంసం సృష్టించారు. ఆ సమయంలో ఇద్దరు పురుషులు, ముగ్గురు మహిళలు సమీపంలోని అడవుల్లో దాక్కున్నారు. వీరిని నంగ్పోక్ సెక్మాయి పోలీసులు కాపాడి, సురక్షితంగా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తుండగా, పెద్ద గుంపు వచ్చి, ఈ ఐదుగురిని మళ్లీ కిడ్నాప్ చేసింది. వీరిలో ఒక పురుషుడిని అక్కడికక్కడే చంపేశారు. ముగ్గురు మహిళల బట్టలను విప్పేయాలని ఆదేశించారు. వారిలో 21 ఏళ్ల వయసుగల మహిళపై సామూహికంగా అత్యాచారం చేశారు. ఆమె సోదరుడు (19) అడ్డుకోబోగా, అతనిని చంపేశారు.
ఈ కేసులో ఇప్పటి వరకు ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ చెప్పారు. మే 18న పోలీసులకు ఫిర్యాదు అందిందని, దీనిపై జూన్ 21న ఎఫ్ఐఆర్ నమోదైందని తెలిపారు. ఈ దారుణానికి పాల్పడినవారికి మరణ శిక్ష విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
ఇదిలావుండగా, ఈ కేసులో ప్రధాన నిందితుడు హుయిరెమ్ హెరోడస్ ఇంటిని దుండగులు గురువారం తగులబెట్టారు. పెద్ద ఎత్తున మహిళలు, పురుషులు గుంపుగా వచ్చి, ఈ ఇంటిని తగులబెట్టారు.
మెయిటీలు, కుకీల మధ్య మే 3 నుంచి ఘర్షణలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మే 4న ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన సంఘటనకు సంబంధించిన వీడియో బుధవారం సామాజిక మాధ్యమాల ద్వారా బయటపడింది. దీనిపై మణిపూర్ పోలీసులు స్వయంగా కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసు వర్గాలు చెప్తున్నాయి.
ఇవి కూడా చదవండి :
Speaker: మీలా నేనూ మనిషినే.. విందుకు వెళితే తప్పేంటి?
CJI : రైలు ప్రయాణంలో అసౌకర్యంపై హైకోర్టు జడ్జి ఫిర్యాదు.. హుందాగా ప్రవర్తించాలంటూ సీజేఐ లేఖ..
Updated Date - 2023-07-21T10:49:33+05:30 IST