Former Chief Minister: అయోమయంలో మాజీ ముఖ్యమంత్రి!
ABN, First Publish Date - 2023-05-04T07:43:11+05:30
అన్నాడీఎంకే అసమ్మతివర్గం నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం (Former Chief Minister O. Panneerselvam) సొంత పార్టీని ప్రారంభించాలా? లేక బీజేపీలో చేరాలా? అంటూ అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు.
చెన్నై, (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకే అసమ్మతివర్గం నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం (Former Chief Minister O. Panneerselvam) సొంత పార్టీని ప్రారంభించాలా? లేక బీజేపీలో చేరాలా? అంటూ అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. అదే సమయంలో అన్నాడీఎంకేలో చేరేందుకు తీవ్ర ప్రయత్నాలు కూడా సాగిస్తున్నారు. అన్నాడీఎంకే(AIADMK)లో చేర్చుకోవాలంటూ ఓపీఎస్ తన అనుచరులు కొందరి తన వద్దకు రాయబారులుగా పంపినట్లు బుధవారం ఉదయం ఓమలూరులో జరిగిన పార్టీ సమావేశంలో ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (Edappadi Palaniswami) ప్రకటించి సంచలనం కలిగించారు. ఈ పరిస్థితులలో ఓపీఎస్‌కు మూడు మార్గాలలో ఒకదానిని ఎంపిక చేసుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. మళ్ళీ అన్నాడీఎంకేలో చేరడం... లేదా ఏదైనా పార్టీలో మారడం... లేకపోతే సొంత పార్టీని ప్రారంభించడం.. ఈ మూడు మార్గాలే ఆయన ముందున్నాయి. ఇటీవల తిరుచ్చిలో భారీ యెత్తున ఓపీఎస్ వర్గీయులు మహానాడు జరిపినా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ మహానాడుకు తరలివచ్చిన వేలాదిమంది కార్యకర్తలను చూసి అన్నాడీఎంకే నుంచి పిలుపు వస్తుందని ఆశించారు. అయితే అన్నాడీఎంకే నాయకులు ఆ మహానాడులో జనసమీకరణ ఓపీఎస్ వర్గీయులకున్న బలం కాదని, అదంతా బలుపేనని యెద్దేవా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకేలో చేరడానికి ఓపీఎస్ వర్గీయులు అంగీకరించడం లేదు. ఈపీఎస్ ప్రధాన కార్యదర్శిగా ఉండటంతో ఓపీఎస్‌కు పార్టీలో గౌరవ ప్రదమైన పదవులు ఇవ్వరని, చిన్నా చితక పదవులు మాత్రమే కేటాయిస్తారని అనుచరులు చెబుతున్నారు. అదే సమయంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఈపీఎస్ తన బద్ధశత్రువైన ఓపీఎస్‌ను పార్టీలో చేర్చుకోవడానికి అంగీకరించడలేదు. అయితే ఆయన అనుచరులను పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఓపీఎస్ వర్గీయులంతా తమ భవిష్యత్ ఏ దిశగా పయనించనుందో తెలియక అయోమయంలోనే కొట్టుమిట్టాడుతున్నారంటే అతిశయోక్తి కాదు.
Updated Date - 2023-05-04T07:43:11+05:30 IST