Former CM: తమిళనాడును ఒప్పించి ‘కావేరి’ వివాదానికి తెరదించండి
ABN, First Publish Date - 2023-09-27T12:01:15+05:30
తమిళనాడు ప్రభుత్వాన్ని ఒప్పించి కావేరి జల వివాదానికి తెర దించాలని బీజేపీ ముఖ్యనేత, మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై(Former Chief Minister Basavaraj Bommai)
- ప్రభుత్వానికి మాజీ సీఎం బొమ్మై వినతి
- సుప్రీం దృష్టికి తీసుకెళ్లేందుకు పోరాటం అనివార్యం
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): తమిళనాడు ప్రభుత్వాన్ని ఒప్పించి కావేరి జల వివాదానికి తెర దించాలని బీజేపీ ముఖ్యనేత, మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై(Former Chief Minister Basavaraj Bommai) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బెంగళూరులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కావేరి జల వివాద తీవ్రతను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లేందుకు పోరాటం అనివార్యమని అన్నారు. కావేరి బేసిన్‌లోనూ, బెంగళూరులోనూ మంగళవారం బంద్ విజయవంతం చేసినందుకు ప్రజలను అభినందించారు. కొవిడ్ అవధిలోనూ కాంగ్రెస్ మేకెదాటు ర్యాలీ తలపెట్టగా తాము అనుమతించామని, అయితే కావేరి జలాల విడుదలకు నిరసనగా ఫ్రీడం పార్కు వరకు ర్యాలీ నిర్వహించేందుకు ఆందోళనకారులకు అనుమతి ఇవ్వకపోవడం దారుణమన్నారు. కావేరి జల వివాదాన్ని రాజకీయం చేస్తున్నామన్న సీఎం ఆరోపణలను తిప్పికొట్టారు. రైతులు రాజకీయం చేస్తున్నారా..? అంటూ ఆయన ప్రశ్నించారు.
రేపు గాంధీ విగ్రహం ఎదుట ధర్నా: తమిళనాడుకు కావేరి జలాల విడుదలను నిరసిస్తూ ఈనెల బుధవారం విధానసౌధ - వికాససౌధ మధ్యగల గాంధీ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ మేరకు మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప(Former Chief Minister BS Yeddyurappa) మీడియాతో మాట్లాడుతూ.. బెంగళూరు బంద్‌ను విజయవంతం చేసినందుకు ప్రజలను అభినందించారు. కావేరి జల వివాదాన్ని పరిష్కరించే విషయంలో ప్రభుత్వం విఫలమైందని, అడుగడుగునా నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. ఇండియా కూటమి ప్రయోజనాల కోసం రాష్ట్ర రైతాంగం ప్రయోజనాలను బలి చేశారని మండిపడ్డారు. బుధవారం జరిగే ధర్నాలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా పాల్గొంటారన్నారు.
Updated Date - 2023-09-27T12:01:15+05:30 IST