Former CM: తేల్చి చెప్పేసిన మాజీ సీఎం.. అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీతో జతకట్టే ప్రసక్తే లేదు
ABN, First Publish Date - 2023-10-19T11:00:20+05:30
వచ్చే యేడాది జరిగే లోక్‌సభ ఎన్నికలలో మాత్రమే కాకుండా 2026లో రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపెట్టుకునే
చెన్నై, (ఆంధ్రజ్యోతి): వచ్చే యేడాది జరిగే లోక్‌సభ ఎన్నికలలో మాత్రమే కాకుండా 2026లో రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపెట్టుకునే ప్రసక్తే లేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి(Former Chief Minister Edappadi Palaniswami) స్పష్టం చేశారు. అన్నాడీఎంకే 52వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని పార్టీలోని 82 జిల్లా శాఖలకు సంబంధించి పొలింగ్ బూత్ కమిటీ ఇన్‌ఛార్జీలతో ఆయన సమావేశమయ్యారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో బూత్‌కమిటీ ఇన్‌చార్జీలు, జిల్లా శాఖల నాయకులు, మహిళా, యువజన, న్యాయవాదుల , కార్మిక, మత్స్యకారుల విభాగాల నేతలు, సభ్యులంతా డీఎంకే ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై విస్తృత ప్రచారం సాగించాలని పిలుపునిచ్చారు. బూత్‌కమిటీ ఇన్‌ఛార్జీల పదవులకు మహిళా, యువజన విభాగాలకు ప్రాధాన్యం కల్పించినట్టు గుర్తు చేశారు. ఈ విషయంలో జిల్లా శాఖల నాయకులు చర్యలు చేపట్టాలన్నారు. బీజేపీతో తెగతెంపులు చేసుకోవడాన్ని పార్టీ శ్రేణులంతా స్వాగతిస్తున్నాయని, అందరి అభిప్రాయం మేరకే ఆ నిర్ణయాన్ని తీసుకున్నామని చెప్పారు. బీజేపీతో పొత్తుపెట్టుకోవడం వల్ల మైనార్టీల మద్దతు కోల్పోయి పార్టీ తీవ్రంగా నష్టపోయిందని పేర్కొన్నారు. బీజేపీతో ఇకపై పొత్తు పెట్టుకోకూడదనే దృఢ నిశ్చయంతోనే ఉన్నానని, లోక్‌సభ ఎన్నికల్లో మాత్రమే కాకుండా శాసనసభ ఎన్నికల్లోనూ ఆ పార్టీతో పొత్తు పెట్టుకోబోమన్నారు. ఈ విషయంలో పార్టీ శ్రేణులు ఎలాంటి అనుమానాలు పెట్టుకోకూడదని ఈపీఎస్ అన్నారు. బీజేపీతో తెగతెంపులు చేసుకోవడంతో మైనారిటీ వర్గాలకు చెందిన రాజకీయ పార్టీలు అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమవుతున్నాయని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లోనూ, ఆ తర్వాత జరిగే శాసనసభ ఎన్నికల్లోనూ మెగా కూటమిని ఏర్పాటు చేసి ఘనవిజయం సాధిస్తామని ఈపీఎస్ ధీమా వ్యక్తం చేశారు.
Updated Date - 2023-10-19T11:00:20+05:30 IST