Modi : రామేశ్వరం నుంచి మోదీ పోటీ?
ABN , First Publish Date - 2023-07-11T03:46:10+05:30 IST
దక్షిణాదిలో గట్టిగా పాగా వేయాలని యోచిస్తున్న బీజేపీ.. ఆ మేరకు వ్యూహాలకు పదును పెడుతోంది. తమిళనాట ‘కొరకరాని కొయ్య’లా మారిన డీఎంకేను గట్టిగా ఢీకొట్టడంతోపాటు ఇక్కడ గణనీయమైన స్థానాలు సాధించాలని ఆ పార్టీ భావిస్తోంది.
దక్షిణాదిలోనూ బీజేపీ పాగా వేసేందుకే!
తమిళ పత్రిక మాలై మలర్ కథనం
తమకూ సంకేతాలు అందాయన్న పార్టీ వర్గాలు
చెన్నై, జూలై 10(ఆంధ్రజ్యోతి): దక్షిణాదిలో గట్టిగా పాగా వేయాలని యోచిస్తున్న బీజేపీ.. ఆ మేరకు వ్యూహాలకు పదును పెడుతోంది. తమిళనాట ‘కొరకరాని కొయ్య’లా మారిన డీఎంకేను గట్టిగా ఢీకొట్టడంతోపాటు ఇక్కడ గణనీయమైన స్థానాలు సాధించాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీని తమిళనాడులోని ప్రపంచ ప్రసిద్ధిగాంచిన శైవక్షేత్రం రామేశ్వరం(రామనాథపురం నియోజకవర్గం) నుంచి పోటీ చేయించాలని నిర్ణయించినట్లు తెలిసింది. తమిళ పత్రిక ‘మాలై మలర్’ ఈ మేరకు ఓ కథనాన్ని ప్రచురించింది. తమిళనాడు బీజేపీ వర్గాలు సైతం దీనిపై తమకు స్పష్టమైన సంకేతాలు అందినట్లు చెబుతున్నాయి. దీంతో కొద్ది రోజులుగా ఈ అంశం చర్చనీయాంశమైంది.
గత ఎన్నికల్లో ప్రసిద్ధ శైవక్షేత్రం కాశీ(వారాణసీ) నుంచి పోటీ చేసిన మోదీ.. ఈసారి కాశీతోపాటు రామేశ్వరంలోనూ పోటీ చేయాలని భావిస్తున్నారు. స్వయంగా ప్రధానే ఇక్కడి నుంచి పోటీ చేస్తే, ఆ ప్రభావం ఓటర్లపై పడటంతోపాటు, తమ పార్టీ అభ్యర్థుల్లోనూ ఉత్సాహం కలుగుతుందని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. మోదీ రెండు చోట్లా విజయం సాధించడం ఖాయమని ఆ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల ఫలితాల అనంతరం వారాణసీ నియోజకవర్గానికి మోదీ రాజీనామా చేస్తారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. రామనాథపురం నియోజకవర్గంలో ముస్లిం ఓట్లు గణనీయంగా ఉన్నాయి. అందుకే 2019 ఎన్నికల్లో డీఎంకే తమ కూటమి భాగస్వామి అయిన ఐఎంయూఎల్‌కు ఈ నియోజకవర్గాన్ని కేటాయించగా, ఆ పార్టీ అభ్యర్థి నవాజ్ ఘన విజయం సాధించారు.