Assembly Elections 2023: కాంగ్రెస్ విక్టరీ ఖాయం... ఓటు వేసిన సీఎం
ABN, First Publish Date - 2023-11-25T14:14:48+05:30
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ గెలిచి అధికారంలోకి రావడం ఖాయమని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. రాష్ట్రంలోని 199 అసెంబ్లీ స్థానాలకు శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలుకావడంతో సర్దార్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సీఎం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో (Rajasthan Assembly polls) కాంగ్రెస్ మళ్లీ గెలిచి అధికారంలోకి రావడం ఖాయమని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) అన్నారు. రాష్ట్రంలోని 199 అసెంబ్లీ స్థానాలకు శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలుకావడంతో సర్దార్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సీఎం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఇది మోదీజీ ఎన్నికలు కాదని, తాము ఇక్కడి వాళ్లమని, ఇక్కడే ఉంటామని, అభివృద్ధి గురించే మాట్లాడతామని చెప్పారు. మోదీ ప్రసంగంలో ఏమాత్రం పస లేదని కొట్టిపారేశారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ మరోసారి గెలుస్తుందని, బీజేపీ నేతలు ఈరోజు తర్వాత మళ్లీ కనిపించరని, ఫలితాలు అనంతరం మళ్లీ ఐదేళ్ల తర్వాత వాళ్లు కనిపిస్తారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏడు ఎన్నికల వాగ్దానాలు ప్రజల్లోకి దూసుకెళ్లాయని చెప్పారు.
బీజేపీకి నెర్వస్ పట్టుకుంది: వైభవ్ గెహ్లాట్
బీజేపీ చాలా నెర్వస్‌తో ఉందని, కాంగ్రెస్ మెజారిటీ సాధిస్తుందని అశోక్ గెహ్లాట్ తనయుడు వైభవ్ గెహ్లాట్ తెలిపారు. సర్దార్‌పూర్‌లో ఓటు వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత ఐదేళ్లు ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అంకితభావంతో పనిచేసిందని చెప్పారు. రెడ్ డైరీ ఆరోపణలపై మాట్లాడుతూ, అవన్నీ క్టటుకథలని, అది ఫ్యాబ్రికేటెడ్ డైరీ అని అభివర్ణించారు. దీని గురించి ఆ దేవుడికే తెలుసునన్నారు. రాజస్థాన్‌లోని మొత్తం 200 స్థానాలకు గాను 199 స్థానాల్లో శనివారం పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 6 గంటలతో పోలింగ్ ముగుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ కూనర్ ఇటీవల మరణించడంతో కరణ్‌పూర్ నియోజకవర్గం ఎన్నికలు వాయిదా పడ్డాయి. డిసెంబర్ 3న రాజస్థాన్ అసెంబ్లీ ఫలితాలు వెలువడతాయి.
Updated Date - 2023-11-25T14:14:49+05:30 IST