Governor: గవర్నర్ నోట.. మళ్లీ వివాదపు మాట..
ABN, First Publish Date - 2023-05-05T11:33:23+05:30
రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్.రవి(Governor RN Ravi) మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంట
చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్.రవి(Governor RN Ravi) మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో... ద్రావిడ తరహా పాలన అనేది కాలం చెల్లిన సిద్ధాంతం, ఇది ‘ఏక భారతం సమైక్య భారతం అనే సిద్ధాంతానికి వ్యతిరేకం, భాషకు అంటరానితనాన్ని అంటగడుతోంది, రాష్ట్రంలో తమిళం, ఆంగ్ల భాషలు మినహా ఇతర భాషలకు అనుమతి లేదు, అలాంటి ద్రావిడ తరహా పాలనకు మద్దతివ్వలేను.. శాసనసభలో తాను చేసిన ప్రసంగంలో ఆ పదాన్ని మినహాయించానంటూ గవర్నర్ వెల్లడించారు. ప్రతిచోటా ప్రతి సభలో రెండేళ్లుగా రాష్ట్రంలో ద్రావిడ తరహా పాలన అందిస్తున్నామంటూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) చేస్తున్న ప్రకటనకు విరుద్ధంగా గవర్నర్ వ్యాఖ్యానించి సరికొత్త వివాదానికి నాంది పలికారు. డీఎంకే ప్రభుత్వం బిల్లులను తాను పెండింగ్‌లో ఉంచలేదని, రాజ్యాగం ధర్మాసనానికి కట్టుబడే తన విధులను నిర్వర్తిస్తున్నానంటూ పలు అంశాలపై తన అభిప్రాయాలను కుండబద్దలుకొట్టినట్లు వ్యక్తం చేశారు. శాసనసభలో పాలకులు అందించిన ప్రసంగ పాఠంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు భేషుగ్గా ఉన్నాయన్నారని, అయితే రాష్ట్రంలో పాపులర్ ఫ్రంట్ ఉగ్రవాద సంస్థలకు నిధులు పంపిణీ, కళ్లకుర్చి సంఘటనను ప్రస్తావిస్తూ ప్రసంగించానని, గవర్నర్ ప్రసంగంలో ద్రావిడ తరహా పాలనను పొగుడుతూ మాట్లాడాలని పాలకులు ఆశించారని, ద్రావిడ తరహా పాలన అంటూ ఏదీ లేదని, ఆ తరహా సిద్ధాంతాలన్నీ కాలం చెల్లినవని, వాటికి మళ్ళీ ప్రాణం పోయాలని అనుకుంటున్నారని గవర్నర్ విరుచుకుపడ్డారు. అంతే కాకుండా ద్రావిడ తరహా సిద్ధాంతం దేశ స్వాతంత్య్ర సంగ్రామాన్ని తక్కువగా అంచనావేస్తుందన్నారు.
కలైంజర్ లైబ్రరీలో ఇతర భాషలకు తావులేదా?
కలైంజర్ గ్రంథాలయాన్ని 3.25 లక్షల పుస్తకాలను ఏర్పాటు చేయనున్నారని, ఆ పుస్తకాలన్నీ తమిళం, ఆంగ్ల భాషల్లో మాత్రమే ఉన్నాయని, ఇది వేర్పాటు వాదాన్ని ప్రోత్సహిస్తుందని, ఈ విషయాన్ని శాసనసభలో తాను ప్రసంగిస్తున్నప్పుడు తెలుసుకున్నానన్నారు. రాష్ట్రంలో రెండు భాషలకు మాత్రమే ప్రాధాన్యమిచ్చి ఇతర భాషలను అంటరాని భాషలుగా భావించడం తగదన్నారు.
బిల్లులు పెండింగ్‌లో లేవు...
శాసనసభలో ప్రతిపాదించిన, ప్రవేశపెట్టిన బిల్లులను తాను పెండింగ్‌లో ఉంచుతున్నట్లు పనిగట్టుకుని దుష్ప్రచారాలు చేస్తున్నారని, రాజ్‌భవన్‌లోగానీ, గవర్నర్ వద్దగానీ ఎప్పుడూ బిల్లులు పెండింగ్‌లో లేవన్నారు. 2021 సెప్టెంబర్‌లో తాను గవర్నర్‌గా పదవిని చేపట్టినప్పుడు 19 బిల్లులు తన పరిశీలనకు వచ్చాయని, వాటిలో 18 బిల్లులను ఆమోదించానని, నీట్ మినహాయింపు బిల్లును రాష్ట్రపతి సలహాకోరుతూ పెండింగ్‌లో ఉంచానని గవర్నర్ స్పష్టం చేశారు. గతయేడాది 59 బిల్లులు తన పరిశీలనకు వచ్చాయని, వాటిలో 48 బిల్లులను అంగీకరించానని, వాటిలో మూడు బిల్లులను రాష్ట్రపతి సలహా కోరుతూ పెండింగ్‌లో ఉంచానని, ఓ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుందని, ఎనిమిది బిల్లులు మాత్రమే అనుమతించలేదన్నారు. ఇక ఈ యేడాదికి సంబంధించి ఇప్పటివరకూ ఏడు బిల్లులు తన పరిశీలనకు వాటిని అంగీకరించానని చెప్పారు. పెండింగ్‌లో ఉంచిన ఎనిమిది బిల్లులో సిద్దవైద్య విశ్వవిద్యాలయం బిల్లు కూడా ఒకటని, ఈ బిల్లులో ముఖ్యమంత్రి ఆ విశ్వవిద్యాలయానికి రెండుసార్లు ఛాన్సలర్‌గా వ్యవహరిస్తారని పేర్కొన్నారని, ఇది యూజీసీ నిబంధనలకు వ్యతిరేకం కనుకనే పెండింగ్‌లో ఉంచానని తెలిపారు. విశ్వవిద్యాలయాల పాలన వ్యవహారాలన్ని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి జాబితాలో ఉన్నాయని అందుకే వాటికి సంబంధించిన బిల్లులను నిలిపి ఉంచానని చెప్పారు.
ఆర్థిక మంత్రి ఆరోపణలు అవాస్తవాలు...
రాజ్‌భవన్‌కు కేటాయిస్తున్న నిధులు దుర్వినియోగమవుతున్నాయంటూ ఆర్థికమంత్రి పీటీఆర్ పళనివేల్ త్యాగరాజన్ ఆరోపించటం గర్హనీయమని గవర్నర్ పేర్కొన్నారు. 2000 సంవత్సరంలోనే రాజ్‌భవన్ నిధుల వినియోగానికి సంబంధించి పలు సవరణలు జరిగాయన్న విషయాన్ని మరచి ఆర్థిక మంత్రి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని గవర్నర్ రవి విమర్శించారు.
అసెంబ్లీలో వాకౌట్...
శాసనసభలో ప్రసంగాన్ని ముగించిన తర్వాత తనకు వ్యతిరేకంగా పాలకులు తీర్మానం చేయడానికి ప్రయత్నించారని, అందువల్లే తాను వాకౌట్ చేశానని చెప్పారు. శాసనసభ నిబంధనలను తాను ఉల్లఘించినట్లు ఆరోపిస్తున్నారని, డాక్టర్ అంబేడ్కర్ సిద్ధాంతాలను పాలకులు తెలియజేయాల్సిన అవసరం లేదని అంబేడ్కర్ తన మదిలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని తెలిపారు. పార్లమెంట్‌లో రాష్ట్రపతి, శాసనసభలో గవర్నర్ ప్రసంగించే సమయాల్లో జాతీయగీతం వినిపించడం ఆనవాయితీ అని, రాష్ట్ర శాసనసభలో ఆ ఆనవాయితీ పాటించడం లేదని తెలుసుకుని తన ప్రసంగానికి ముందు జాతీయ గీతం ఆలాపించాలని స్పీకర్‌కు మౌఖికంగా ఆదేశించానని, తన ప్రసంగం ముందు జాతీయ గీతం ఆలాపించలేదని గవర్నర్ ఆరోపించారు. శాసనసభ ప్రసంగపాఠంలో ప్రభుత్వాన్ని మెచ్చుకోలేదన్న కారణంగా తనకు వ్యతిరేకంగా శాసనసభలో తీర్మానం చేసినప్పుడు వాకౌట్ చేశానని, అలాంటప్పుడు తాను జాతీయ గీతం ఆలాపించడానికి ముందే వాకౌట్ చేసినట్లు విమర్శలు చేయడం గర్హనీయమన్నారు.
స్టాలిన్‌తో సన్నిహిత సంబంధాలు...
ప్రభుత్వపరమైన సిద్ధాంతాలరీత్యా అభిప్రాయబేధాలున్నప్పటికీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) తనకు మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయని గవర్నర్ స్పష్టం చేశారు. స్టాలిన్ చాలా మంచి వ్యక్తి అని, ఆయనకు తాను తగిన గౌరవమర్యాదలిస్తున్నానని, తనపట్ల కూడా ఆయన గౌరవప్రదంగానే వ్యవహరిస్తున్నారన్నారు. అయితే పాలనపరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటున్నట్లు తప్పుడు సమాచారాన్ని ఆయనకు అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ ధర్మాసనాన్ని ఉల్లంఘిస్తే అడ్డుకోవాల్సిన బాధ్యత గవర్నర్‌కు ఉందని, అలాంటప్పుడు తాను పాలనలో జోక్యం చేసుకుంటున్నట్లు ఎలా భావిస్తారని ఆయన ప్రశ్నించారు.
కాంగ్రెస్, సీపీఐ నేతల ఖండన...
ద్రావిడ తరహా పాలనకు కాలం చెల్లిందంటూ ఆర్‌ఎస్ఎస్(RSS) కార్యకర్తలా, రాజకీయ నాయకుడిలా విమర్శలు చేస్తు న్న రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి తక్షణమే పదవి నుంచి వైదొలగాలంటూ టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ముత్తరసన్ వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశారు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవర్నర్ డీఎంకే పాలనపై వివాదస్పద వ్యాఖ్యలు చేయడాని కి ఈ రెండు పార్టీల నేతలు తీవ్రంగా ఖండించారు. సీపీఐ కార్యదర్శి ముత్తరసన్ తన ప్రకటనలో శాసనసభలో చేసిన బిల్లులు ఏవీ పెండింగ్‌లో లేవని గవర్నర్ ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. గవర్నర్ ఆర్‌ఎ్‌సఎస్ కార్యకర్తలా వ్యవహరిస్తూ డీఎంకే ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి గవర్నర్ తానొక బీజేపీ నాయకుడని నిరూపించుకున్నారన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ గవర్నర్ ఆరోపించడం కూడా అవాస్తవమని పేర్కొన్నారు. గవర్నర్ రాజ్యాంగ ధర్మాసనానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని, ఈ పరిస్థితులలో పదవికి రాజీనామీ చేసి తప్పుకోవడమే మంచిదని ముత్తరసన్ హితవు పలికారు.
విషం చిమ్మిన గవర్నర్...
గవర్నర్ ఆర్‌ఎన్ రవి రాజ్యాంగ ధర్మాసనాన్ని ఉల్లఘించి మరోమారు వివాదాస్పదమైన విమర్శలు చేసి డీఎంకే ప్రభుత్వంపై విషం చిమ్మారని టీఎన్‌సీసీ అధ్యక్షుడు అళగిరి ధ్వజమెత్తారు. ఏక భారత సమైఖ్య భారతం అంటూ గవర్నర్ బీజేపీ నాయకుడిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఓ రాజకీయ పార్టీ సిద్ధాంతం గురించి విమర్శించే హక్కు గవర్నర్‌కు ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర రాజకీయాలు తెలియని గవర్నర్ ద్రావిడ సిద్ధాంతం గురించి మాట్లాడే అర్హత కూడా లేదన్నారు. గవర్నర్ అనుసరిస్తున్న రాజ్యాంగ విరుద్ధమైన ధోరణులను ఖండిస్తూ అన్ని రాజకీయ పార్టీలు కలిసికట్టుగా పోరాడాల్సిన తరుణం ఆసన్నమైందని అళగిరి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా రాజ్యాంగ ధర్మాసనానికి విరుద్ధంగా డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు చేసినందుకు గవర్నర్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలంటూ ఎండీఎంకే నేత వైగో ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.
Updated Date - 2023-05-05T11:33:23+05:30 IST