Governor: ఢిల్లీ వెళ్లిన గవర్నర్..
ABN, First Publish Date - 2023-07-08T07:16:38+05:30
రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి(Governor RN Ravi) ఏడు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు. ఈడీ విచారణను
చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి(Governor RN Ravi) ఏడు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు. ఈడీ విచారణను ఎదుర్కొంటున్న సెంథిల్‌బాలాజి(Senthilbalaji)ని శాఖ లేని మంత్రిగా కొనసాగించే విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌కు, గవర్నర్‌కి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతున్న విషయం తెలిసిందే. ఈడీ అధికారుల అరెస్టు సందర్భంగా అస్వస్థతకు గురై సెంథిల్ బాలాజి ఆసుపత్రిలో చేరటంతో ఆయన శాఖలను ఇద్దరు మంత్రులకు అదనంగా అప్పగించారు. ఆయన్ని శాఖ లేని మంత్రిగా కొనసాగిస్తున్నట్లు ముఖ్యమంత్రి తరఫున గవర్నర్‌కు ప్రతిపాదనలు పంపారు. దాన్ని పరిశీలించిన గవర్నర్ సెంధిల్‌బాలాజిని శాఖలు లేని మంత్రిగా కొనసాగించేందుకు అంగీకరించలేదు. దీనితో రాష్ట్ర ప్రభుత్వం సెంథిల్‌బాలాజిని శాఖ లేని మంత్రిగా కొనసాగేలా ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. కొద్ది రోజుల క్రితం సెంథిల్‌బాలాజిని మంత్రి పదవి నుంచి డిస్మిస్ చేస్తూ గవర్నర్ రవి ఉత్తర్వులు జారీ చేసి, నాలుగు గంటల తర్వాత ఉపసంహరించుకున్నారు. కేంద్ర హోంశాఖ సూచన మేరకు అటార్నీ జనరల్ సలహా తీసుకునేందుకు ఆ ఉత్తర్వులను పక్కనపెడుతున్నట్లు గవర్నర్ పేర్కొన్న విషయం తెలిసిందే. గత సోమవారమే ఆయన అటార్నీ జనరల్ అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటారని వార్తలు వెలువడ్డాయి. కానీ అటార్నీ జనరల్ విదేశీ పర్యటనలో ఉండటం వల్ల అది సాధ్యపడలేదు. ఈ పరిస్థితుల్లో గవర్నర్ ఢిల్లీకి పయనమయ్యారు. శనివారం ఆయన కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రావ్ మేగ్‌వాలాను కలుసుకోనున్నారు. అదే సమయంలో అటార్నీ జనరల్ వెంకట్రమణితోనూ భేటీ కానున్నారు. అదే విధంగా కేంద్ర హోమంత్రి అమిత్‌షాతోనూ గవర్నర్ సమావేశం కానున్నారని రాజ్‌భవన్ వర్గాలు పేర్కొన్నాయి.
Updated Date - 2023-07-08T07:16:38+05:30 IST