Haryana Violence: బాధితులకు ప్రత్యేక నష్టపరిహార ప్యాకేజీ : సీఎం
ABN, First Publish Date - 2023-08-02T16:33:32+05:30
హర్యానాలోని నుహ్ హింసాత్మక ఘటనలో నష్టపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలుస్తుందని ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టార్ తెలిపారు. జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించనున్నట్టు చెప్పారు.
ఛండీగఢ్: హర్యానా(Haryana)లోని నుహ్ హింసాత్మక ఘటనలో నష్టపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలుస్తుందని ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టార్ (Manohar Lal Khattar) తెలిపారు. జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు ఒక స్కీమ్ (Compensation Package) ప్రకటించనున్నట్టు చెప్పారు. ''ఎక్కడెక్కడ నష్టం జరిగిందే ఆ సమాచారం అందుతోంది. జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు అవసరమైన స్కీమ్ తెస్తాం. 80 శాతం వరకూ నష్టాలను భర్తీ చేస్తాం. పరిస్థితిని మేము ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నాం. బాధితులకు నష్టపరిహారం ఇస్తాం. ఉపశమనం కలిగిస్తాం'' అని మీడియాతో మాట్లాడుతూ సీఎం చెప్పారు.
ఘర్షణలు మొదలైన నుహ్ జిల్లాలో ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరక్కుండా 20 పారామిలటరీ బలగాలను మోహరించామని సీఎం తెలిపారు. ఈ హింసాత్మక ఘటనల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని, వారిలో ఇద్దరు పోలీసులు, నలుగురు పౌరులు ఉన్నారని వివరించారు. ఈ ఘటనలతో ప్రమేయమున్నట్టు అనుమానిస్తున్న 116 మందిని అరెస్టు చేశామని, మరో 90 మందిని ప్రశ్నించిన అనంతరం నిర్బంధంలోకి తీసుకున్నామని చెప్పారు. ఈ ఘటనలతో ప్రమేయమున్న ఎవ్వరినీ విడిచిపెట్టేది లేదని, తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
Updated Date - 2023-08-02T16:33:32+05:30 IST