Ravi Shankar Prasad: 'ఇండియా' కూటమి రహస్య ఎజెండా అదే.. బీజేపీ ఫైర్..!
ABN, First Publish Date - 2023-09-12T20:51:43+05:30
సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తమ దాడిని ఉధృతం చేసింది. ఇండియా కూటమి ఏర్పాటు లక్ష్యమే సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడం, దానిని నిర్మూలించడమని బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ (Ravi Shankar Prasad) తాజాగా ఆరోపించారు.
న్యూఢిల్లీ: సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ (BJP) తమ దాడిని మరింత ఉధృతం చేసింది. 'ఇండియా' (I.N.D.I.A.) కూటమి ఏర్పాటును టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇండియా కూటమి ఏర్పాటు లక్ష్యమే సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడం, దానిని నిర్మూలించడమని బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ (Ravi Shankar Prasad) తాజాగా ఆరోపించారు.
''సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడం ద్వారా ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడమే వారి (ఇండియా కూటమి) రహస్య ఎజెండా. కాంగ్రెస్ పార్టీని, విపక్ష కూటమిని నేను సూటిగా అడుగుతున్నాను. ఇతర మత విశ్వాసాలకు చెందిన దేవతలను విమర్శించే హక్కు వారికి ఉందా? ఆ ధైర్యం ఉందా? ఆ పని చేస్తారా? ఇతర మతాల విషయంలో మౌనంగా ఉండాలి. కానీ, బహిరంగంగా సనాతన ధర్మాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు'' అని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా తరచు డీఎంకే నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై విపక్ష నేతలు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ అధినాయకత్వాన్ని ఆయన టార్గెట్ చేస్తూ, సోనియాగాంధీ మౌనం వహించే కొద్దీ సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడం ఇండియా బ్లాక్ కనీస ఉమ్మడి కార్యక్రమంలో భాగమనే విషయం స్పష్టమవుతుదని అన్నారు. డీఎంకే వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని, అది తమ ఎజెండా కాదని నిర్దిష్టమైన తీర్మానంతో విపక్ష కూటమి ముందుకు రావాలని ఆయన అన్నారు.
Updated Date - 2023-09-12T20:51:43+05:30 IST