India-US Relations: అమెరికాకు భారత్ ఎంతో ముఖ్యమైన దేశం.. జో బైడెన్ ఈ మాట చెప్పారన్న యూఎస్ రాయబారి
ABN, First Publish Date - 2023-11-02T20:10:05+05:30
గతంతో పోలిస్తే.. భారత్, అమెరికా దేశాల మధ్య ఇప్పుడు బలమైన బంధాలున్నాయి. చాలా విషయాల్లో ఇరుదేశాలు పరస్పర సహకారాలు, మద్దతులు ఇచ్చుకుంటాయి. కెనడాతో కొనసాగుతున్న దౌత్యపరమైన వివాదంలో..
గతంతో పోలిస్తే.. భారత్, అమెరికా దేశాల మధ్య ఇప్పుడు బలమైన బంధాలు ఏర్పడ్డాయి. చాలా విషయాల్లో ఇరుదేశాలు పరస్పర సహకారాలు, మద్దతులు ఇచ్చుకుంటాయి. కెనడాతో కొనసాగుతున్న దౌత్యపరమైన వివాదంలో.. ఆ అగ్రదేశం భారత్‌కే మద్దతు తెలుపుతోంది. ఈ వివాదం నెలకొన్న మొదట్లో.. భారత్‌తో బంధం తమకెంతో ముఖ్యమని అమెరికా వెల్లడించింది. ఇప్పుడు భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ కూడా అదే మాటని రిపీట్ చేశారు. అమెరికాకు భారత్ అత్యంత ముఖ్యమైన దేశమని, ఈ రెండు దేశాల మధ్య బంధం ఈ శతాబ్దపు ‘మోస్ట్ డిఫైనింగ్ రిలేషన్‌షిప్’ అని అభివర్ణించారు. న్యూ ఢిల్లీలో గ్లోబల్ ఎనర్జీ అలయన్స్ ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్ (GEAPP) నిర్వహించిన ది ఎనర్జీ ట్రాన్సిషన్ డైలాగ్స్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘అమెరికాకు భారత్ ఎంతో ముఖ్యమైన దేశమని నేను ప్రధాని మోదీకి ప్రైవేట్‌గా చాలా సార్లు చెప్పాను. కానీ.. ఇప్పుడు ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పగలను. అమెరికా అధ్యక్షుడు నాకు భారతదేశంలో రాయబారి బాధ్యతలు అప్పగించే సమయంలో.. ‘భారతదేశం నాకు ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన దేశం’ అని ఆయన నాతో అన్నారు. గత అధ్యక్షులు ఈ మాట చెప్పారో లేదో నాకు తెలీదు కానీ.. జో బైడెన్ మాత్రం నిజంగానే ఈ మాట చెప్పారు’’ అని గార్సెట్టీ పేర్కొన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. భారత్ అధ్యక్షతన సెప్టెంబర్‌లో జరిగిన జీ20 సదస్సు చరిత్రలోనే అత్యుత్తమమైనదని కొనియాడారు. ఈ శిఖరాగ్ర సదస్సుకు భారత్ అద్భుతమైన నాయకత్వం వహించిందని, అందుకు ధన్యావాదాలని తెలిపారు. ఈ సదస్సులో అమెరికా హుషారుగా పాల్గొనడాన్ని బట్టి చూస్తే.. ఇరుదేశాల మధ్య బందాలు ఎంత గట్టిగా ఉన్నాయో స్పష్టమవుతుందని పేర్కొన్నారు.
ఇదే సమయంలో వ్యాపార అవకాశాలపై గార్సెట్టీ మాట్లాడుతూ.. భారత్, అమెరికా మార్కెట్‌లలో పునరుత్పాదక రంగాల్లో పెట్టుబడులకు చాలా అవకాశాలున్నాయన్నారు. ఇరువైపులా కంపెనీలు పరస్పరం మార్కెట్లలో అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని చెప్పారు. అమెరికాలో భారత్ కంపెనీల కోసం అవకాశాల్ని చూస్తున్నామన్నారు. భారతదేశపు PLI సోలార్ తయారీ ఎలక్ట్రోలైజర్‌లలో పనిచేసే కంపెనీలకు పన్ను ప్రయోజనాలను అందిస్తోందన్నారు. పెట్టుబడులు రెండు వైపులా నుండి మరింత వేగంగా పుంజుకోవాల్సిన అవసరం ఉందని గార్సెట్టీ చెప్పుకొచ్చారు.
Updated Date - 2023-11-02T20:10:06+05:30 IST