Pinarayi vijayan: బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే దేశం ప్రమాదంలో పడినట్టే... సీఎం సంచలన వ్యాఖ్య
ABN, First Publish Date - 2023-10-08T18:42:22+05:30
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీ మూడోసారి అధికారంలోకి వస్తే ఇండియా తీవ్ర ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. అదే జరిగితే ఆ తర్వాత విచారించి కూడా ఏమాత్రం ప్రయోజనం ఉండదని అన్నారు.
తిరువనంతపురం: కేరళ (Kerala) ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan) సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీ (BJP) మూడోసారి అధికారంలోకి వస్తే ఇండియా తీవ్ర ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. అదే జరిగితే ఆ తర్వాత విచారించి కూడా ఏమాత్రం ప్రయోజనం ఉండదని అన్నారు. అయితే, మూడోసారి తాము అధికారంలోకి రావడం సాధ్యం కాకపోవచ్చనే విషయం ప్రధాని మోదీ సారథ్యంలోని బీజేపీ కూడా గ్రహించిందని చెప్పారు. నార్త్ కేరళ జిల్లా ఆదివారంనాడు జరిగిన ఒక కార్యక్రమంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ, ఆర్ఎస్, సంఘ్ పరివార్‌పై నిప్పులు..
దేశంలోని భిన్నత్వాన్ని ధ్వంసం చేసి, మతం ఆధారంగా దేశాన్ని సృష్టించేందుకు కేంద్రంలోని బీజేపీతో పాటు ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ ప్రయత్నిస్తున్నాయని సీఎం ఆరోపించారు. దేశంలో ఆవుల పేరుతో మతఘర్షణలు చోటుచేసుకుంటున్నాయని, ఒక తరహా ఆహారం తీసుకునే పౌరులను దేశానికి శత్రువులుగా చిత్రీకరిస్తున్నారని అన్నారు. కులం, మతం ప్రమేయం లేకుండా చట్టం అందరికీ సమాన రక్షణ కల్పిస్తుందని, అయితే ఇప్పుడు దేశంలో ఆ పరస్థితి మారిపోతోందన్నారు. మైనారిటీ కమ్యూనిటీల్లో ఇలాంటి భయాలు, ఆందోళలను చోటుచేసుకుంటున్నాయని చెప్పారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వస్తే దేశానికి జరిగే ప్రమాదం ఇంతాఅంతా కాదన్నారు. ఇందుకోసం బీజేపీని ఓడించడమే లక్ష్యంగా సెక్యులర్ భావజాలం కలిగిన గ్రూపులు, ప్రజలు ఐక్య ఫ్రంట్‌గా ఏర్పడి, బీజేపీని తిరిగి అధికారంలోకి రాకుండా చూడాలని సూచించారు. దేశంలోని నాలుగు విపక్ష పాలిత రాష్ట్రాలపై వివిధ సెంట్రల్ ఏజెన్సీలు జరుపుతున్న దాడులు చూస్తే బీజేపీ ఎలాంటి ప్రమాదకరమైన అడుగులు వేస్తోందో అర్ధం చేసుకోవచ్చని అన్నారు. మరిన్ని దాడులు కూడా వారి నుంచి అంచనావేయవచ్చని చెప్పారు.
Updated Date - 2023-10-08T18:44:36+05:30 IST