Agnipath scheme : అగ్నివీరుల నియామక ప్రక్రియలో సరికొత్త నిర్ణయం
ABN, First Publish Date - 2023-02-21T18:32:35+05:30
రక్షణ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకం (Agnipath scheme)లో టెక్నికల్ కేటగిరీలో
న్యూఢిల్లీ : రక్షణ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకం (Agnipath scheme)లో టెక్నికల్ కేటగిరీలో ఐటీఐ/పాలిటెక్నిక్ గ్రాడ్యుయేట్లు కూడా లబ్ధి పొందవచ్చు. భారత సైన్యం టెక్నికల్ విభాగాల్లోకి నైపుణ్యంగలవారిని నియమించాలని ప్రయత్నిస్తోంది. ఈ పథకంలో ఎంపికైనవారికి శిక్షణ ఇచ్చే సమయాన్ని తగ్గించుకోవడం కోసం ఈ సవరణ చేసింది. వృత్తి విద్యలో శిక్షణ పొందినవారికి, నైపుణ్యంగలవారికి అవకాశం కల్పించాలని నిర్ణయించింది. దీంతో ఈ పథకం ద్వారా సైన్యంలో చేరాలనుకునేవారు మరింత ఎక్కువ మంది దరఖాస్తు చేసుకోవడానికి వీలవుతుంది.
అగ్నిపథ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2022 జూన్ 14న ప్రవేశపెట్టింది. త్రివిధ దళాల్లో కమిషన్డ్ ఆఫీసర్ దిగువ స్థాయి సైనికుల నియామకం కోసం ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఎంపికైనవారు నాలుగేళ్లపాటు సైన్యంలో పని చేస్తారు. నాలుగేళ్ల తర్వాత వీరికి ప్రభుత్వం కొన్ని ప్రయోజనాలను కల్పిస్తుంది. నూతన జీవితాన్ని ఆరంభించేందుకు లేదా తదుపరి విద్యను అభ్యసించేందుకు రూ.12 లక్షలు ఇస్తుంది. వ్యాపారం చేయాలనుకునేవారికి రుణ సదుపాయం కల్పిస్తుంది. తదుపరి చదువు కొనసాగించాలనుకునేవారికి 12వ తరగతితో సమానమైన సర్టిఫికేట్‌ను ఇస్తుంది.
17.5 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్కులు, 10+2 లేదా ఇంటర్మీడియేట్ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైనవారికి ప్రారంభంలో నెలకు రూ.30,000 జీతం ఇస్తారు. నాలుగో సంవత్సరం పూర్తయ్యేసరికి ఇది రూ.40,000 వరకు పెరుగుతుంది.
ఇవి కూడా చదవండి :
Jaishankar : ఆ పని చేసినది రాహుల్ గాంధీ కాదు : విదేశాంగ మంత్రి
Karnataka : యూరోపియన్ స్టైల్ బస్సు ప్రయాణాన్ని ఆస్వాదించడానికి సిద్ధంకండి!
Updated Date - 2023-02-21T18:32:41+05:30 IST